పడిలేచిన కెరటం !

Sharing is Caring...

భండారు శ్రీనివాసరావు  ……………………………….

This Honda is the inspiration for many

సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు. పోనీ ఉట్టి ‘హోండా!’ ఓహో! హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్. అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు సైకిళ్ళను, హోండా మోటారు వాహనాలను ఉత్పత్తిచేసే హోండా మోటారు కంపెనీ స్థాపకుడీయన.

ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్నో పాట్లు పడ్డాడు. పడడమే కాదు పడి లేచాడు. లేచి నిలబడ్డాడు. తాను నిలబడి తన కంపెనీని నిలబెట్టాడు.అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఈ జపానీయుడికి చిన్నతనం నుంచి వాహనాలు అంటే ఎంతో మోజు. ఆ రోజుల్లో వాళ్ల వూరికి వచ్చే మోటారు వాహనాలను చూడడానికి, వీలుంటే ఒకసారి చేతితో తాకడానికి చాలా మోజుపడేవాడు.

ఆ అవకాశం దొరక్క కేవలం ఆ మోటారు వాహనం నుంచి వెలువడే చమురు వాసన పీల్చి తృప్తిపడేవాడు. అలాటి వాడు భవిష్యత్తులో ఒక పెద్ద మోటారు వాహనాల కంపెనీ స్థాపించగలడని వూహించడానికి కూడా వీలులేని రోజులవి. బతుకు తెరువుకోసం ఓ గరాజులో పనికి కుదిరాడు.

కానీ అతడి ఆరాటం బతుకు బండి నడపడం కాదు. మోటారు బండి తయారు చేయడం. ఈ క్రమంలో అతడి ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న పిస్టన్ అతడి బతుకు బాటను ఓ మలుపు తిప్పింది. అంతా ఓ గాట్లో పడుతోందని అనుకుంటున్న సమయంలో వచ్చిన భూకంపంలో అతడి ఫాక్టరీ సర్వనాశనం అయింది. కధ మళ్ళీ మొదటికి వచ్చింది.

భూకంపం అతడి ఫాక్టరీని ధ్వంసం చేయగలిగింది కాని అతగాడి పట్టుదలను కాదు కదా! అందుకే అతడు కధ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి మరింత కసిగా. అతడి కృషితో ఫాక్టరీ తిరిగి ఉత్పత్తి మొదలు పెట్టింది. అంతా సజావుగా సాగుతోంది. ఆర్డర్లు పెరుగుతున్నాయి. కంపెనీ కోలుకుంటోంది.

ఈ దశలో మళ్ళీ కోలుకోలేని డెబ్బ తగిలింది. రెండో ప్రపంచయుద్ధం పుణ్యామా అని హోండా ఫాక్టరీ మూతపడింది.యుద్ధం ముగిసింది.హోండా మళ్ళీ నడుం బిగించాడు. పట్టుదలే అతడి పెట్టుబడి. అంతకంటే మించిన పెట్టుబడి మరి ఏముంటుంది. అందుకే అతడి కల ఫలించింది. వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఇక రాలేదు.

కంపెనీ అప్రతిహతంగా అభివృద్ధి పధంలో పురోగమించింది. దేశదేశాల్లో హోండా పేరు మారు మోగింది. విశ్వవ్యాప్తంగా హోండా కార్లకు ఆదరణ పెరిగింది. మోటారు వాహనాల రంగంలో హోండా పతాకం వినువీధులకు ఎగిరింది.‘పడిలేచిన కెరటం’ అంటే ఇదేనేమో!

నవంబర్ 17, 1906న, జపాన్‌లోని షిజువోకా ప్రిఫెక్చర్‌లోని కొమ్యో గ్రామంలో (ఇప్పుడు టెన్ర్యూ నగరం) ఆయన జన్మించారు.ఆగస్టు 5, 1991 మరణించారు

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!