Available in Few Places only ……………..
పొట్టిక్కలు ఇడ్లీలాంటివే. కానీ ప్రత్యేకమైనవి. ఇవి కూడా ఇడ్లీ లాగానే ఆవిరిపై వుడుకుతాయి.. అమలాపురం దగ్గర్లోని అంబాజీపేట… పొట్టిక్కలకు చాలా ఫేమస్. ఇక్కడ పనస ఆకుల్లో చుట్టి వండుతారు వీటిని. ఇడ్లీలాగానే వుండే ఈ వంటకానికి ఇడ్లీకన్నా ఎక్కువ డిమాండ్ వుంటుంది.
కొబ్బరికాయల వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారు పొట్టిక్కలంటే పడి చస్తారు.
పొట్టిక్కలకు ఆ రుచి… పనస ఆకులోంచి రావడంతోపాటు.. చట్నీలతో అద్దుకోవడంలో ద్విగుణీకృతం అవుతుంది. కారప్పొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, దబ్బకాయ చట్నీలతో నంజుకొని పొట్టిక్కలు తింటే… ఆ రుచే వేరు.
అంబాజీపేటకు దరిదాపుల్లోనూ వుంటాయి పొట్టిక్కలు. కానీ అంబాజీపేటలో తింటే… దాని రుచి అదుర్స్. కొన్ని చోట్ల ఈ పొట్టిక్కలను అరటి ఆకులతో కూడా తయారు చేస్తారు. మిగిలిన ఫుడ్ లాగా ఈ పొట్టిక్కలు అన్నిచోట్లా దొరకవు. వీటినే పనస బుట్టలు అనికూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో లంక గ్రామాల్లో ఇవి బాగా ఫేమస్.
కొన్ని ప్రాంతాల్లో వీటిని ఆవిరితో ఉడికిస్తారు. కొన్ని చోట్ల నేరుగా పొయ్యి మంట మీదనే వండుతారు. ఈ మధ్యకాలంలో రావుల పాలెం … రాజమండ్రి హైవే పై ఉన్న హోటల్స్ కూడా ఈ పొట్టిక్కలను చేస్తున్నారు. పనస ఆకుకు శరీరం లోని వేడిని తీసే లక్షణం ఉండటం .. ఆ ఆకులో పొట్టిక్క ఉడకడం మూలానా ఇటు ఆరోగ్యానికి అవి మంచివని అంటారు.
ఇడ్లీ రుచికి ,పొట్టిక్కల రుచికి తేడా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూస్తే వదలరు. పొట్టిక్కల టిఫిన్ చేసేందుకే ఆ ప్రాంతానికి వెళ్లే వాళ్ళున్నారు అంటే నమ్మరు కానీ అది నిజం. ఈ పొట్టిక్కల తయారీ ఎప్పటినుంచో ఉంది. మన తెలుగువాళ్ళ సాంప్రదాయ వంటకమని చెప్పుకోవచ్చు.
తూర్పుగోదావరి జిల్లా కెళ్ళినపుడు తప్పనిసరిగా ఈ పొట్టిక్కల రుచిని ఆస్వాదించండి. ఇపుడు హైదరాబాద్ లో కూడా కొన్నిహోటళ్లలో ఈ పొట్టిక్కలను తయారు చేస్తున్నారు.. అంతర్జాలంలో వెతికితే హోటళ్ల చిరునామా దొరుకుతుంది.
——–Vasireddy Venugopal