Subramanyam Dogiparthi………………………
కీచకులు ఉన్నంత కాలం ద్రౌపదులు , రావణులు ఉన్నంతకాలం సీతలు ఉంటారని సినిమా ప్రారంభంలోనే హరికధ ద్వారా చెప్పేస్తాడు దర్శకుడు విశ్వనాథ్ . ఓ కీచకుడి బారి నుండి తనను తాను రక్షించుకుని , తన స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు , ఆ కీచకుడికే తల్లి అవతారం ఎత్తిన కథే .. ఈ సీత కధ సినిమా. సినిమాకు షీరో రోజా రమణే . ప్రహ్లాదుడిగా చిన్నప్పుడే అదరగొట్టిన రోజా రమణి యుక్తవయసులోకి వచ్చాక నటించిన ఈ సినిమాలో కూడా మళ్ళా అంతే పేరు తెచ్చుకొంది .
ఆమె తర్వాత గొప్పగా నటించింది రమాప్రభ . ‘చింతచిగురు పులుపని చీకటంటె నలుపని’ తెలియని పిచ్చిపిల్లగా అద్భుతంగా నటించింది . వీరిద్దరితో పాటు ప్రధాన పాత్రధారులు చంద్రమోహన్ , దేవదాస్ కనకాల . చంద్రమోహన్ పాత్ర అర్ధంతరంగా ముగిసినా , ఏ పాత్రనయినా అవలీలగా వేయగలనని మరోసారి రుజువు చేసుకున్నాడు . దేవదాస్ కనకాల జల్సారాయుడిగా , స్త్రీ లోలుడిగా చాలా బాగా నటించారు .
టైప్ ఇన్స్టిట్యూట్ మాస్టారి పాత్రలో అల్లు రామలింగయ్య , కాంతారావు , పండరీబాయి , శుభ , సాక్షి రంగారావు , పుష్పకుమారి ప్రభృతులు నటించారు .ఈ సినిమా విజయానికి మరో ముఖ్య కారణం కె వి మహదేవన్ సంగీతం . వేటూరి సుందరరామ మూర్తి రచించిన హరికధ ‘భారతనారీ చరితము మధుర కధాభరితము’ చాలా శ్రావ్యంగా , సందేశాత్మకంగా ఉంటుంది . వేటూరి వారికి బహుశా ఇదే మొదటి పాటేమో ! By the way , నేను పాలకమండలి సభ్యుడిగా ఉన్న సమయంలోనే వీరికి నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది . పి లీల కంఠం చెవుల తుప్పు వదిలిస్తుంది .
మరో గొప్ప పాట చింతచిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్నపిల్ల పాట , చిత్రీకరణ , రమాప్రభ నటన సినిమాకే హైలైట్ . నిజంగానే పతాక సన్నివేశం . మిగిలిన పాటలు ‘మల్లె కన్నా తీయన మా సీత సొగసు’ , పుత్తడి బొమ్మ , కల్లాకపటం ఎరగని పిల్లలు , నిను కన్న కధ మీ అమ్మ కధ కూడా శ్రావ్యంగా ఉండటమే కాకుండా బాగా హిట్టయ్యాయి కూడా . ఈ సినిమాకు గొల్లపూడి మారుతీరావు సంభాషణలు సమకూర్చారు.
నంది పురస్కారాలలో మూడవ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది , ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి . తాష్కెంటులో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది . మళయాళం , తమిళ భాషల్లోకి రీమేక్ అయింది . దేవదాస్ కనకాల పాత్రని మళయాళంలో కమల్ హాసన్ , తమిళంలో రజనీకాంత్ పోషించారు . మళయాళంలో రోజారమణి తన పాత్రను తానే నటించింది .
కె విశ్వనాథ్ కళా తపస్సు ప్రారంభ దినాలలో వచ్చిన ఈ సినిమా ఈరోజుకీ తప్పక చూడవలసిన సినిమాలలో ఒకటి . ఓ సినిమాగా , ఓ సందేశంగా ఎలా చూసుకున్నా గొప్ప సినిమా. An unmissable musical , feel good movie . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి .
———–
Tharjani …………….
ఈ సినిమా కథ డెబ్బయివ దశకంలో ఓ సంచలనం. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదనే కోపంతో ఆమె ప్రేమిస్తున్న యువకుడిని చంపిస్తాడు విలన్. ప్రేమికుడి హఠాన్మరణానికి కారకుడైన విలన్ కి బుద్ధి వచ్చేలా చేయాలని ఆ అమ్మాయి అతగాడి తండ్రిని పెళ్లి చేసుకుంటుంది.
వినడానికే కాస్త కఠినంగా ఉన్న ఈ కథను దర్శకుడు కె విశ్వనాథ్ అద్భుతంగా తెరకెక్కించారు. తను కోరుకున్న అమ్మాయి.. తనకు తల్లిగా ఇంటికి వచ్చినప్పుడు ఆ విలన్ పడే వ్యధ ఎలా ఉంటుందో ? దర్శకుడు తెరకెక్కించిన విధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అప్పట్లో ఆ పాత్ర పోషించిన కనకాల దేవదాస్ కి మంచి పేరు వచ్చింది. అప్పటివరకు చిన్న పాత్రల్లో నటించిన దేవదాస్ ఓ సీత కథ లో ప్రధాన పాత్ర నటించి మెప్పించారు.
ఈ దేవదాస్ కనకాల ఎవరో కాదు ఇప్పటి నటుడు రాజీవ్ కనకాల తండ్రి.. స్టార్ యాంకర్ సుమ మామగారు. తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను, నటులను పరిచయం చేసిన ఖ్యాతి దేవదాస్ ది. ఆయన ఓ యాక్టింగ్ స్కూల్ కూడా నడిపారు. ఎందరో నటులు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నారు. చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భానుచందర్, అరుణ్‌పాండ్యన్, రాంకీ, రఘువరన్ వంటి నటులతో పాటు ఇంకా చాలా మంది ఆయన వద్ద శిక్షణ తీసుకున్న వాళ్లే.
అన్నట్టు ఈ సినిమాను నిర్మించింది ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ .. 19ఏళ్ల వయసులో ‘సావరిన్ సినీ ఎంటర్‌ప్రైజెస్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మరొకరితో కలసి నిర్మించారు. తర్వాత వైజయంతీ మూవీస్ సంస్థ ను నెలకొల్పారు. ఈ నాటికి నిర్మాతగా కొనసాగుతున్నారు.