Dreams Melted Away……………………………………………పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న నేను క్లాస్ కి అటెండ్ అవుదామని యూనివర్సిటీ కి వచ్చాను. అంతలోనే క్యాంపస్ హాస్టళ్ల లో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఎదురు పడ్డారు. ఏమి జరిగిందని అడిగాను.’తాలిబన్లు కాబూల్‌కు వచ్చారు. పోలీసులు మమ్మల్ని ఖాళీ చేసి పొమ్మన్నారు. ఎక్కువ సేపు ఉంటే ఏదైనా జరగవచ్చని భయపడి వచ్చేసాం’ అన్నారు వాళ్ళు.
నాకు ఒక్క క్షణం భయమేసింది. ‘ఇప్పుడెలా’ అన్నాను. ‘తిరిగి ఇళ్లకు వెళ్లి పోతాం’ అంటూ వారు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. నేనొక్కదాన్నే మిగిలాను. ఇక్కడ నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నేను కూడా బయట కొచ్చి ఆటో అతన్ని పిలిచాను. అతను రావడానికి భయపడ్డాడు.’తాలిబన్లు ఊరేగింపుగా ఇటు వస్తున్నారట. వారి కంట్లో పడితే ప్రమాదం. మీరు వెళ్లిపోండి. ఎక్కడైనా బురఖా కొనుక్కొని వేసుకోండి. లేకుంటే ఇబ్బంది పడతార’ని హెచ్చరించాడు. ఆ మాటలతో నాకు మరింత భయం వేసింది.
చకచకా నడవడం మొదలెట్టాను. అంతలో ఒక రౌడీ గ్యాంగ్ నా వెంట పడింది. “వీధుల్లో నడవడానికి మీకు చివరి రోజులు” బైక్ మీద వెళుతూ అతగాడు నాకేసి చూసి ఆ మాట అన్నాడు. నేను ఆ మాటలు విననట్టే నటిస్తూ తలవంచుకుని నడుస్తున్నాను. వాళ్ళు ఆగలేదు .. వెళ్లిపోయారు. మరింత వేగంగా నడుచుకుంటూ ఇంటి కొచ్చాను. అలవాటు లేని నడక కావడంతో కాళ్ళు పీకుతున్నాయి.
అక్కయ్య కూడా టీవీలో వార్తలు చూసిందట. నా గురించి కంగారు పడుతోంది. “ఇక కొద్దీ రోజులు బయటికెళ్ళకు.” అందామె. ఆమె కూడా ఆందోళన పడుతోంది. నేను ఆఫ్ఘనిస్తాన్లోని రెండు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండి ఏక కాలంలో డిగ్రీలను పూర్తి చేశాను. మరిన్ని కోర్సులు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరదామనుకుంటున్నా. ఈ లోగా ఈ ఉపద్రవం ముంచు కొచ్చింది. ఇక స్వేచ్ఛ మొత్తం పోయినట్టే. ఇపుడు మా ఐడీ కార్డులన్నీ భద్రంగా దాచుకోవాలి. ఇష్టం లేకపోయినా తప్పదు మరి.
నేను ఈ స్థితి కి రావడానికి కన్నవాళ్ళు.. మా అక్క ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ ఋణం తీర్చుకునే అవకాశం పోయింది. పురుషులు ప్రారంభించిన రాజకీయ యుద్ధానికి మహిళలు అంతా ఇక బాధితులే. నేను ఇకపై బిగ్గరగా నవ్వలేను, ఇష్టమైన పాటలు వినలేను, కేఫ్‌లో నా స్నేహితులను కలవలేను. ఇష్టమైన పసుపు రంగు దుస్తులు లేదా పింక్ కలర్ లిప్‌స్టిక్ వేసుకోలేను.
నా భవిష్యత్తు ప్రణాళికలన్నీఇక కలలుగానే మిగిలి పోవాల్సిందేనా ? ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎపుడూ ఊహించలేదు. తాలిబాన్ల గురించి .. వారు మహిళలతో వ్యవహరించిన తీరు గురించి మా అమ్మ చెప్పే కథలు గుర్తుకొస్తున్నాయి. షరియా చట్టం ఎంత కఠినంగా ఉంటుందో తలుచుకుంటేనే వణుకు పుడుతుంది.
షరియా చట్టాల ప్రకారం పదేళ్లు పైబడిన బాలికలు పాఠశాలకు వెళ్లకూడదు. సంగీతం, టీవీ, సినిమాలూ నిషేధం. మహిళలు బయటకు వెళ్లాలంటే తోడుగా తప్పనిసరిగా పురుషుడు ఉండాలి. అతగాడు తండ్రి లేదా భర్త, లేదా సోదరుడు లేదా కుమారుడు అయి ఉండాలి. మహిళలు హైహీల్స్ వేసుకోకూడదు. కాలి నుంచి చేతి వరకు శరీరంలోని ఏ భాగం కనిపించకుండా బురఖా వేసుకోవాలి.
మహిళలు రాజకీయాల్లోకి రాకూడదు. బహిరంగ ప్రదేశంలో పెద్దగా మాట్లాడకూడదు. మహిళలు ఇంటి బాల్కనీలో కూడా నిలబడటం నిషేధం. ఇంటి కిటీకీలోంచి కూడా బయటకు చూడకూడదు. వీడియోలు, సినిమాల్లో నటించకూడదు. అనుమతి లేనిదే రేడియో, టీవీలలో పని చేయకూడదు. సైకిల్ .. మోటార్ సైకిల్ నడపకూడదు. మహిళలు బస్సుల్లో ప్రయాణించ కూడదు. వారికోసం ప్రత్యేక మహిళా బస్సులు ఉంటాయి. మహిళలు బహిరంగ సమావేశాల్లో కనబడకూడదు.
ఇలాంటి కఠినమైన నియమాలు,నిబంధనలు ఉంటాయి.ఈ చట్టం అమలుకొస్తే ప్రాథమిక హక్కులన్నింటినీ కోల్పోతాం. మళ్ళీ మధ్యయుగం నాటికి వెళతాం. మా హక్కులు.. స్వేచ్ఛ కోసం 20 సంవత్సరాల పోరాటం తరువాత, ఇపుడు మేము బుర్ఖాల కోసం వేటాడాలి. గుర్తింపును దాచుకోవాలి.
కొద్దిరోజుల క్రితం ప్రావిన్సులు తాలిబాన్లు నియంత్రణలోకి రావడంతో వందలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి తమ కూతుళ్లు, భార్యలను కాపాడుకోవడానికి కాబూల్ వచ్చారు. వారు పార్కులు .. ఆ సమీప ప్రదేశాలలో నివసిస్తున్నారు. నేను అమెరికన్ యూనివర్సిటీ విద్యార్థుల బృందంలో భాగంగా నగదు, ఆహారం, నిత్యావసరాలు సేకరించి వారికి పంపిణీ చేసాను. ఆ సందర్భంగా కొన్ని కుటుంబాల కథలు విన్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.
యుద్ధంలో ఒకరు తమ కొడుకును కోల్పోయారు. కాబూల్ వచ్చినందుకు టాక్సీ ఛార్జీలు చెల్లించడానికి డబ్బులేకపోవడంతో వారి కోడలిని ఇచ్చేసారు. స్త్రీ విలువ ఎంతకు దిగజారింది ? ఇకపై మా పరిస్థితి అంతే. అంతకంటే భిన్నంగా ఏమి ఉండబోదు. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ. ఇది నా ఒక్కదాని ఆవేదన కాదు .. ఆఫ్ఘన్ లో యువతులందరి ఆవేదన. ఇన్నాళ్లు స్వేచ్ఛకు అలవాటు పడిన మేము ఇక బానిసలుగా బందీలుగా బ్రతకాలి. ఏ దేవుడు మా మొర వింటాడు ??
——- KNM
(అంతర్జాతీయ మీడియా లో వచ్చిన ఒక యువతీ ఇంటర్వ్యూ ఆధారంగా )