Mohammed Rafee ………..
తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. హీరో విజయ్ పెట్టిన కొత్త పార్టీ ఈసారి రంగంలో వుంది! యువ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న వారిలో అత్యంత ధనిక అభ్యర్థి మహిళ కావడం విశేషం! ఆవిడే లీమా రోజ్.
తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నా డిఎంకె పార్టీ తరపున బరిలో వున్నారు. ఆమె కుటుంబ ఆస్థి విలువ అక్షరాలా ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు. ఆమె వ్యక్తిగత ఆస్థి 1049 కోట్లు!లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత శాంటియాగో మార్టిన్ ఆమె భర్త. లీమా రోజ్ వయసు 58.
ఇటీవలే ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. అన్నాడిఎంకె పార్టీలో చేరారు. పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు. నామినేషన్ అఫిడవిట్ లో ఆమె ప్రస్తావించిన ఆస్థుల వివరాల ప్రకారం చూస్తే…19 కిలోల బంగారం, 1217 క్యారట్ల వజ్రాభరణాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నట్లు సమాచారం.
139.63 కోట్ల చరాస్థులు, 909.94 కోట్ల స్థిరాస్థులు ఉన్నాయి. సహజంగా డబ్బున్నోళ్లకు అప్పులు ఎలాగూ ఉంటాయి కాబట్టి ఆమెకు కూడా 8.57 కోట్ల అప్పు ఉందట! భర్త మార్టిన్ పేరిట 4100 కోట్లు పైచిలుకు ఆస్థులు వున్నాయట! ఆయన పేరిట నగలు చూస్తే…281 గ్రాములు బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 21 కిలోల వెండి, 321 గ్రాములు ప్లాటినం ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు.
ఇంతా చేస్తే ఆమె చదివింది ఆరవ తరగతి మాత్రమే! పైగా ఆమెపై నాలుగు కేసులు కూడా వున్నాయట! లాల్గుడి ఓటర్లు ఆమెపై పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది! ఓటుకు కనీసం మూడు నుంచి ఐదు వేల వరకు ఇస్తున్నదని బెట్టింగులు వేసుకుంటున్నారట!
మొత్తానికి లీమా గెలుపు ఖాయం అంటున్నారు. “చట్టసభలోకి అడుగు పెట్టనివ్వండి. లాల్గుడి నియోజకవర్గం ఎలా అభివృద్ధి జరుగుతుందో చూడండి” అని లీమా రోజ్ అంటున్నారు. ఆమె ప్రచార పర్వంలో వేలాదిమంది యువతకు ఉపాధి లభించింది. చదువు లేకున్నా డబ్బు వుంది కాబట్టి ఇలాంటి వారిని గెలిపిస్తే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది. ఆమె మార్టిన్ చారిటీ ఫౌండేషన్ పేరిట ఎన్నో ఏళ్లుగా సేవ కూడా చేస్తుండటం విశేషం.
ఈమె కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ సొంత పార్టీ లక్ష్య జననాయక కచ్చి తరపున పుదుచ్చేరిలో పోటీ చేస్తున్నారు. అల్లుడు ఆధవ్ అర్జున నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీలో చేరారు. శాంటియాగో మార్టిన్ ఆయన సంస్థలపై పలు తీవ్రమైన కేసులు విచారణలో ఉన్నాయి..
సిక్కిం లాటరీ మోసం కేసులో సిక్కిం ప్రభుత్వానికి దాదాపు ₹910 కోట్ల నష్టం కలిగించారనే ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మార్టిన్‌కు చెందిన సుమారు ₹1,000 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
నవంబర్ 2024లో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోని ఆయన కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించి ₹12.41 కోట్ల నగదును సీజ్ చేసింది.కేరళలోని మనీలాండరింగ్ కేసులో మార్టిన్ ఎదుర్కొంటున్న విచారణపై సుప్రీంకోర్టు గతంలో స్టే విధించింది. అలాగే, ఆయన నివాసం నుండి సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించకుండా ఈడీపై కోర్టు ఆంక్షలు విధించినట్లు సమాచారం.
మార్టిన్ నేతృత్వంలోని ‘ఫ్యూచర్ గేమింగ్’ సంస్థ రాజకీయ పార్టీలకు ₹1,368 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చి, దేశంలోనే అత్యధికంగా బాండ్లు కొనుగోలు చేసిన సంస్థగా నిలిచింది. ప్రస్తుతానికి ఎటువంటి నేరం రుజువు కాలేదు (No conviction yet) చాలా కేసులు విచారణ దశలోనే ఉన్నాయి.

