అహ్మద్ పటేల్ ..కాంగ్రెస్ నేతల్లో ఆయన తెలియని వారుండరు. అందరూ ఆయనను అహ్మద్ భాయి అని పిలుస్తారు. ఇందిరా, రాజీవ్,సోనియా,రాహుల్ గాంధీ లకు ఆయనే సలహాదారుడిగా పనిచేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో ఆయన వ్యూహాలే పార్టీ ని ముందుకు నడిపించాయి. గుజరాత్ కి చెందిన అహ్మద్ పటేల్ గాంధీ కుటుంబానికి తల్లో నాలుకలాంటి వాడు. సోనియాకు కానీ రాహుల్ కు గానీ ఏదైనా విషయం చేరవేయాలంటే అహ్మద్ పటేల్ కి చెబితే చాలు. అది వారికి వెళ్ళిపోతుంది. సోనియా తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా అహ్మద్ ఆలోచనలుంటాయి అంటే అతిశయోక్తి కాదు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏమూల ఏం జరుగుతున్నదో ఆయన తెలుసుకుంటారు. పంచాయితీ రాజకీయాలనుంచి ప్రధాని ఎత్తుగడల వరకు ప్రతి అంశాన్ని అహ్మద్ ఇట్టే పట్టేయగల దిట్ట. ఎన్నో సమస్యలనుంచి పార్టీ ని కాపాడిన చాతుర్యం ఆయనది. తెర ముందు సోనియా, రాహుల్ కనిపించినప్పటికీ తెరవెనుక మంత్రాంగం అంతా అహ్మద్ భాయ్ దే అని జనపధ్ కి సన్నిహితంగా ఉండే వారికి బాగా తెలుసు. ఏపీ విభజన అంశంలోనూ అహ్మద్ ఎత్తుగడలు ఉన్నాయి. అంతకుముందు కిరణ్ రెడ్డి సీఎం కావడం వెనుక జరిగిన ప్లానింగ్ లోను ఆయన ఉన్నారు. ఆ మధ్య శివసేన .. శరద్ పవర్ లతో మాట్లాడి కాంగ్రెస్ తో చేతులు కలిపించి మహారాష్ట్ర లో ప్రభుత్వం ఏర్పాటు చేయించడం లో కూడా ఆయనదే కీలక పాత్ర. అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్, షిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా అలాగే పవార్ ఎన్‌సిపి వంటి పార్టీలను కాంగ్రెస్ పర్మనెంట్ స్నేహపూర్వక పార్టీలు గా మార్చింది ఈయనే.
జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వొద్దు అని చెప్పింది ఈయనే అంటారు . అలాగే తెరాస ను కాంగ్రెస్ లో కలిపేసుకుని కేసీఆర్ ను సీఎం ను చేయమని చెప్పింది కూడా ఈయనే నని చెబుతారు. తెలంగాణ, ఏపీ నేతల అందరితోనూ అహ్మద్ కు మంచి సంబంధాలున్నాయి. ఆయనంటే మన నేతలకు కొంత భయం కూడా. ఆయన సూచనల్లో కొన్ని బూమరాంగ్ కూడా అయ్యాయి. కొన్ని సూచనలను సోనియా, రాహుల్ తోసిపుచ్చారని కూడా అంటారు.
26 ఏళ్ల ప్రాయంలోనే అహ్మద్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి గాంధీ పరివారానికి విధేయుడిగా ఉన్నారు. అహ్మద్ ఎపుడూ ప్రభుత్వంలో చేరలేదు. రాజీవ్ హయాంలో మంత్రిగా తీసుకుంటానని అన్నప్పటికీ సున్నితంగా తిరస్కరించారట. ఎపుడూ అధినేతల వెంట కనబడే అహ్మద్ ను చూసే వారు ఆయన వారి పీఏ అనుకుంటారు కానీ కీలకమైన సూచనలు ఈయనవే అనుకోలేరు. సోనియా గాంధీ ఇంత కాలం పార్టీ పై పట్టు బిగించి నిలబడగలిగారంటే అహ్మద్ పటేలే కారణం. సోనియా పార్టీ పగ్గాలు చేపట్టిన సమయంలో పీవీ, తివారీ,ప్రణబ్, అర్జున్ సింగ్, తదితర నేతలను కలుపుకుని పోవడం వెనుక అహ్మద్ వ్యూహం కూడా ఉందంటారు. పార్టీ నిర్మాణం .. ఎన్నికల వ్యూహాలు , పొత్తులు , నిధుల సమీకరణ , సీఎంలతో మాట్లాడటం వంటి విషయాల్లో అహ్మద్ నమ్మకంగా పని చేసేవారు.
అహ్మద్ లోకసభ సభ్యునిగా మూడు సార్లు ఎన్నికయ్యారు. రాజ్యసభ కు అయిదు మార్లు ఎంపికయ్యారు. గుజరాత్ లోని భరూచ్ లో అహ్మద్ పుట్టారు. 1976 లో గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా పటేల్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1977 లో భరూచ్ నుండి పోటీ చేసి గెలిచాక ఆయన వెనుదిరిగి చూడలేదు. సాధారణంగా పై స్థాయి నాయకులు, మంత్రులు రాత్రి 8 తర్వాత ఎవర్ని కలవడానికి ఇష్టపడరు. రాజకీయాల్లో ఇద్దరికీ మాత్రం మినహాయింపు ఉంది. ఆ ఇద్దరు అహ్మద్ పటేల్ .. శరద్ పవర్. అలాగే ఇంకోటి కూడా చెబుతుంటారు. అహ్మద్ పటేల్ సమావేశాలు రాత్రి పూట మొదలై తెల్లవారుజాము నాలుగుదాకా నడుస్తాయట. శరద్ పవర్ ఉదయం 8 గంటలనుంచి ప్రజలను కలుస్తుంటారట. కాగా గత కొన్ని సంవత్సరాలుగా, పటేల్,ఆయన కుటుంబ సభ్యులు మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ డీ కేసులు నమోదు చేసింది. పటేల్ కుమారుడు , కుమార్తె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ కష్ట కాలంలో ఉన్నపుడు ఆయన కన్నుమూయడం ఆ పార్టీకి పెద్ద లోటు.
———– KNM