Subramanyam Dogiparthi………………………
A film that reflects rural issues……………………
వందే మాతరం .. వందే మాతరం వందే మాతర గీతం స్వరం మారుతున్నది వరస మారుతున్నది . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ ఆలోచనాత్మక గీతం కన్నెబోయిన శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాస్ గా మార్చేసింది . ప్రపంచానికో గొప్ప గాయకుడిని ఇచ్చింది .
నారాయణరెడ్డి వ్రాసిన ఈ పాట విశేషం ఏమిటంటే వందే మాతరం పాటలోని ముఖ్య పదాలను తీసుకుని సమకాలీన సమస్యలతో ముడి పెట్టడం . గొప్ప ప్రయోగం . వందే మాతరం సినిమాకు గుండె కాయ లాంటి ఈ పాటను ఆయన ఈ సినిమా కోసం వ్రాయలేదు,
ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైన ఈ పాటను ప్రజా నాట్య మండలి వారు ఎప్పటినుంచో పాడుతున్నారు . ప్రజా నాట్యమండలి నేపధ్యం నుండి వచ్చిన టి కృష్ణ ఈ సినిమాకు ఉపయోగించుకున్నారు . శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాసుని చేసారు . తన వందే మాతరం సినిమాను ఓ సూపర్ హిట్ సినిమాను చేసారు .
ఈ వందే మాతరం సినిమాకు మరి కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి . డా రాజశేఖర్ని తెలుగు తెరకు పరిచయం చేసింది . కొండవీడుని రాజధానిగా చేసుకుని రెడ్డి రాజ్యాన్ని ఏలిన ప్రాంతమైన ఫిరంగిపురం , అమీనాబాద్ గ్రామాల్లో ఈ సినిమా షూటింగ్ అంతా జరిగింది .
ఈ ప్రాంతంలో ఉన్న ప్రాచీన ఆలయాలను , అవశేషాలను టి కృష్ణ సినిమానుగుణంగా బాగా ఉపయోగించుకున్నారు . ఇవన్నీగుంటూరు జిల్లో లోనివే .కధాంశం పాతదే . 1940 నుండీ గ్రామ సీమల్లోని ముఠా తగాదాలు , మూఢ నమ్మకాలు , వాటి మైకంలో విద్య వైద్యాన్ని గాలికి వదిలేయటం , వంటి రుగ్మతల మీద పుంఖానుపుంఖాలుగా సినిమాలు వచ్చాయి .
వాటిని ఆవిష్కరించే తీరు , సామాన్య ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా చెప్పడం , శ్రావ్యమైన సంగీత నృత్యాలతో చెప్పడం ముఖ్యం . అవన్నీ చేసాడు టి కృష్ణ .వి యస్ కామేశ్వరరావు అందించిన కధను… అద్భుతంగా తెరకెక్కించారు. మాటల్ని కూడా ఈ కామేశ్వరరావు గారే చాలా పదునుగా వ్రాసారు .
ఈ సినిమా ఘన విజయానికి ఒక కారణం సంగీతం , నృత్యం . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి .
స్కూల్ పిల్లలు ఏదయా మీ దయా మా మీద లేదు అంటూ పాడుకుంటూ కలెక్టర్ దగ్గరకు వస్తూ పాడే పాట చాలా గొప్పగా ఉంటుంది . దసరా పండుగ సమయంలో మా చిన్నప్పుడు పాడిన జయా విజయీ భవ దిగ్విజయీ భవలోని పదాలను తీసుకుని ఈ సినిమా పాటను అల్లారు .
మరో చక్కటి పాట విజయశాంతి , స్కూల్ పిల్లల బృంద నృత్యంతో నా పేరే పల్లెటూరు మన దేశానికి మరో పేరు . ఆనాటి గ్రామాలలో ఉన్న అన్నయ్య , అక్కయ్య , మామ , బాబాయ్ అని వరసలు పెట్టుకుని జీవించే సంస్కృతిని , సంస్కారాన్ని అద్భుతంగా చూపారు ఈ పాటలో . అదృష్ట దీపక్ వ్రాసారు ఈ పాటను .
విజయశాంతి , రాజశేఖర్ల డ్యూయెట్ ‘ఆకాశమా నీవెక్కడ అవని పైనున్న నేనెక్కడ’ చాలా అందంగా చిత్రీకరించారు టి కృష్ణ . సినిమా అంతా విజయశాంతిని చాలా అందంగా ప్రెజెంట్ చేస్తారు టి కృష్ణ . నత్యాలను కంపోజ్ చేసిన చిన్నాని మెచ్చుకోవాలి .
నారాయణరెడ్డి గారితో పాటు అదృష్ట దీపక్ , దాసం గోపాలకృష్ణ పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , శైలజ , మాధవపెద్ది రమేషులు పాడారు అద్భుతంగా . ప్రజా నాట్యమండలి పటాలం అంతా కనిపిస్తుంది . టి కృష్ణ , మాదల రంగారావు సినిమాల్లో ప్రజా నాట్యమండలి వారికి విస్తృతంగా అవకాశం ఇవ్వడం ముదావహం .
ఈ సినిమాలో ఎప్పటిలాగే మెచ్చుకోవలసింది నిర్మలమ్మను , సుత్తి వేలుని . ఇద్దరూ ప్రేక్షకులను మెప్పించారు. సుత్తి వేలుకు సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు కూడా వచ్చింది .. నల్లూరి వెంకటేశ్వర్లు , సాక్షి రంగారావు , చిట్టిబాబు , డబ్బింగ్ జానకి ,ప్రభృతులను . సినిమా చాలా వరకు ఫిరంగిపురం చుట్టూ ఉన్న ఔట్ డోర్ లొకేషన్లే .
టి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య కో డైరెక్టర్ . తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందిన ఈ సినిమాకు నిర్మాత వై అనిల్ బాబు.. ఈ సినిమాను చూడనివారు ఉంటే యూట్యూబులో ఉంది .
కొండవీడు , ఫిరంగిపురం , అమీనాబాదులలో , చుట్టుపక్కల పురాతన దేవాలయాలు ఉన్నాయి . రెడ్డి రాజుల , కాకతీయుల కాలం నాటివి. ఇప్పుడు కొండవీడు మీదకు ఘాట్ రోడ్ కూడా ఉంది . ఒక రోజు టూర్ ప్లాన్ చేసుకుని వీటన్నింటినీ చూడవచ్చు.
Tharjani ……….
‘ఈ మంటలనార్పండి’ అనే నాటకం ఆధారంగా ‘వందేమాతరం’ సినిమా నిర్మించారు. ఒంగోలు కి చెందిన ప్రమఖ నాటక రచయిత వి ఎస్ కామేశ్వరరావు ఆ నాటకాన్ని రాశారు. నాటక పరిషత్తులో చాలా బహుమతులు కూడా గెలుచుకుంది.తెలుగు నాటకాలు చూసినవారికి కామేశ్వరరావు మాష్టారు గురించి బాగా తెల్సు. సర్ప యాగం, నత్వం శోచిత మర్హసి వంటి మరెన్నో నాటకాలు రాశారు.
దర్శకుడు టీ కృష్ణ ఈ నాటకాన్ని చూసి సినిమాగా తీయాలనుకున్నారు. ఆయన సూచించిన విధంగా కామేశ్వరరావు మాష్టారు కథ రూపొందించి మాటలు తానే రాశారు.’అదిగదిగో పానశాల కాదు కాదు పాఠశాల… మాటీచర్ ఎపుడో ఒకసారి వస్తుంటారు. వచ్చినపుడు పేకాట ఆడుతుంటారు. సుత్తి వేలు నోట పలికే డైలాగులివి. ఆ పాత్రను చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు. సినిమా లో సుత్తి డైలాగ్స్ కూడా బాగా పేలుతాయి.
మొదటి ఈ క్యారెక్టర్ కి p l నారాయణ ను అనుకున్నారు .. అంతే అంతకు ముందు ఇలాటి పాత్రే వేరే సినిమాలో చేశారు. ఆయన కాదనడంతో సుత్తి వేలును తీసుకున్నారు.. వేలు విజృంభించి నటించాడు. అవార్డు కొట్టేసాడు.
‘ఇల్లు కడిగి ముగ్గు వేసి లోగా బదిలీ ఆర్డర్ వస్తుంది’ అనే నిర్మలమ్మ పాత్రకు మంచి డైలాగ్స్ పడ్డాయి.. రాజేంద్రప్రసాద్ డాక్టర్ పాత్రలో బాగానే చేశారు. పదేళ్లు ఎంబీఎస్ చదివిన డాక్టర్ గా ‘ఉచితంగా వైద్యం చేస్తానంటే ఎవరు రారే’ అంటూ వాపోతుంటారు.
‘మనం తయారు చేసే చెప్పులు మనల్ని కొట్టుకోవడానికే కానీ దొరలను కొట్టడానికి పనికి రావు’ అంటూ సాయి చంద్ చెప్పే డైలాగులు బాగా పేలాయి. సాయి చంద్ చెల్లెలి పంచాయితీ సీన్ బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాయి చంద్ పీఎల్ లవి చిన్న పాత్రలే అయినా బాగా చేశారు.
సకాలం లో వైద్యం అందక నిండు గర్భిణీ మరణించే సీన్ ప్రేక్షకులను ఎమోషన్ కి గురి చేస్తుంది. ద్వితీయార్ధంలో విజయశాంతి పాత్రను ఎలివేట్ చేశారు. పాటలను రవి కాంత్ నగాయిచ్ అద్భుతంగా తెరకెక్కించారు.పాఠశాలలో విద్యార్థులను కూడా వేర్వేరు వర్గాలుగా చూపడం గ్రామా రాజకీయాలకు అద్దం పడుతుంది. ప్రెసిడెంట్ గా నర్రా కోటేశ్వరరావు , గోవిందయ్య గా కోట శ్రీనివాసరావులు పోటా పోటీగా నటించారు.