The first male contraceptive injection
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ పురుషుల కోసం గర్భ నిరోధక ఇంజక్షన్ తయారు చేసింది. ఇప్పటివరకు మహిళలు మాత్రమే ఉపయోగించే గర్భ నిరోధక మందులు ఉన్నాయి. ఇప్పుడు ఐసీఎంఆర్ పురుషుల కోసం ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్ ను అభివృద్ధి చేసింది.
ఇది ప్రపంచంలోనే తొలి మేల్ కాంట్రాసెప్టివ్ ఇంజక్షన్ కావడం విశేషం. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాగా ఏడేళ్లుగా శాస్త్రవేత్తలు దీనిపై పనిచేశారు.ఈ మేల్ కాంట్రాసెప్టివ్ వినియోగం వల్ల సీరియస్ దుష్ప్రభావాలు ఉండవని , ప్రభావవంతంగా పని చేస్తోందని ఐసీఎంఆర్ చెబుతోంది.
మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్ ను 25 – 40 ఏళ్ల మధ్య వయసు గల 303 మందిపై ప్రయోగించారు. న్యూ ఢిల్లీ, ఉధంపూర్, లూథియానా, జైపూర్, ఖర్గపూర్ లలో ఈ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారికి 60 మిల్లీగ్రాముల మందును ఇంజెక్ట్ చేసారు. 99.02 శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. వారిలో ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు కనిపించలేదని తేలింది.
ఇప్పటి వరకు గర్భ నిరోధ భారం ఎక్కువగా మహిళల పైనే పడుతోంది. పురుషులకు కండోమ్ వంటి గర్భ నిరోధక సాధనం, వేసక్టమీ ఆపరేషన్ మాత్రమే ఉన్నాయి. మహిళల కోసం గర్భ నిరోధక మాత్రలు, గర్భ నిరోధక సాధనాలైన విమెన్ కండోమ్, కాపర్ టి, ట్యూబెక్టమీ ఆపరేషన్ ఉన్నాయి.
వేసక్టమీ ఆపరేషన్ పై ఉన్న అపోహల కారణంగా దీనిని చేయించుకోవడానికి పురుషులు ముందుకు రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మేల్ కాంట్రాసెప్టివ్ ఇంజక్షన్ రావడం శుభ పరిణామమని అంటున్నారు. కాగా ఈ ఇంజక్షన్ మార్కెట్లోకి రావడానికి మరికొంత కాలం పడుతుంది