పద్మశ్రీ అందుకున్న తొలి కమెడియన్ !!

Sharing is Caring...

సుమ పమిడిఘంటం ……

విజయావారి సినిమాల్లో సహజంగా ప్రముఖ హాస్య నటుడు రేలంగికి వేషం లేకుండా ఉండదు. కానీ పూర్తి హాస్యరస ప్రధాన చిత్రం ‘గుండమ్మకధ’లో ఆయనకు వేషం లేదు. దీంతో రేలంగి కొంత ఫీల్ అయ్యారు. ఒకసారి విజయా నిర్మాణ సారధి చక్రపాణి ని కలసినపుడు అదే విషయం అడిగారు.

సినిమాల్లో కనిపించేలా రేలంగి అంత అమాయకుడు కాదు. ఏదీ మనసులో ఉంచుకోరు.  ముఖం మీదే అడిగేస్తారు. ఆ రోజు కూడా చక్రపాణిని అదే విధంగా అడిగేసారు. “అదేవిటి హాస్యరస సినిమా అటకదా…  ప్రముఖ హాస్య నటుడ్ని నాకు వేషం లేకపోవడం ఏవిటి, రమణారెడ్డి గారికి వేషం వుండటవేమిటి?” అని అడిగారు రేలంగి.”అది కామెడీ విలన్ క్యారెక్టర్. నీకు సినిమాలో వేషం వర్కవుట్ అవలేదు.” అన్నారట చక్రపాణి.

“ఆయన వేషమే నాకు గనక ఇస్తే చేయలేనా ఏం?” అని మరో ప్రశ్నవేశారు రేలంగి.పేపర్ లోనుంచి ముఖం బైటకు కూడ పెట్టకుండా “నువు చేస్తావు కాని వాళ్ళు(ప్రేక్షకులు ) చూడరు” అన్నారట చక్రపాణి. విషయం అర్ధమైన రేలంగి ఏం మాట్లాడకుండా వచ్చేశారట.

కాగా హాస్యనటుడు రేలంగికి మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలు ఏమీ లేవు. సైకిల్ వేసుకుని నేరుగా స్టూడియో కి వెళ్లి .. . పని ముగించుకుని ఇంటికి వచ్చేవారు. ఒకసారి కాగడా శర్మ తన పత్రికలో ‘రేలంగి తాగి తందానా లాడతాడు’ అంటూ తనదైన  భాషలో ఒక కథనం రాశాడు. ఎవరో చెబితే ఆ పత్రిక చదివిన రేలంగి కి పిచ్చికోపమొచ్చింది.

ఆ తర్వాత ఒక రోజు స్టూడియోలో షాట్‌ బ్రేక్‌లో కాగడా శర్మ రేలంగికి ఎదురయ్యాడు. వెంటనే రేలంగి అతని చెంప చెళ్లు మనే లా నాలుగు పీకాడు. పోలీసు కేసు పెడతానని బీరాలు పలికిన కాగడా శర్మను సహచర జర్నలిస్టులు చీవాట్లు పెట్టారు. అప్పటి నుంచి కాగడా శర్మకు రేలంగి అంటే హడల్‌. ఎక్కడైనా కనిపించినా ఓ నమస్కారం పెట్టేసి వెళ్ళేవాడు. ఆ ఘటన తర్వాత రేలంగి గురించి ఒక్క ముక్క కూడా రాయ లేదు. 

ఇక రేలంగి తండ్రి హరికథలు చెబుతూ కుటుంబాన్ని పోషించేవారు. రేలంగి చిన్ననాటి నుంచే హరికథలు వింటూ .. అవి చెప్పడం కూడా ప్రాక్టీస్ చేసాడు. అలాగే హార్మోనియం వాయించడంలోనూ దిట్ట గా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో నాటకాల్లో నటించడానికి రూపంతో పాటు, గాత్రం, కాసింత సంగీత జ్ఞానం కూడా ఎంతో అవసరం.

రేలంగికి అవి పుష్కలంగా ఉండడంతో ఇట్టే నాటక రంగంలో మంచి పేరు సంపాదించారు. 1935లో సి.పుల్లయ్య సినిమా  ‘శ్రీకృష్ణతులాభారం’లో  కృష్ణుని చెలికాడు వసంతయ్యపాత్ర పోషించి నవ్వులు పూయించారు. సి.పుల్లయ్య చిత్రాలలో నటిస్తూనే ఆయన సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్నారు రేలంగి.  రేలంగి హరికథలు చెబుతారని తెలిసే ‘వాగ్దానం’ సినిమాలో ఆత్రేయ రేలంగి చేత హరికథ చెప్పించారు. దాన్ని శ్రీశ్రీ రాయగా .. ఘంటసాల పాడారు.

రేలంగికి 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లోపని చేసాడు. 1948లో వచ్చిన ‘వింధ్యరాణి’ సినిమాతో ఆయన కెరీర్ మలుపుతిరిగింది.

కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. నటుడిగా తారాస్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు.

 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. తాడేపల్లి గూడెంలో రేలంగి చిత్రమందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించాడు. రేలంగి చిట్టచివరి చిత్రం 1975లో వచ్చిన పూజ. చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ రేలంగి 1975 లో తాడేపల్లి గూడెంలో మరణించారు. రాజమండ్రిలోని గోదావరి నది ఒడ్డున రేలంగి కాంస్య విగ్రహాన్ని 2024 సెప్టెంబరు 19న ఆవిష్కరించారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!