నిడిమామిడి లో బయటపడిన విజయనగర రాజుల శాసనాలు!

Sharing is Caring...

Inscriptions of the Vijayanagara kings………………….

అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండలం  నిడిమామిడి గ్రామంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన మూడు శాసనాలు బయటపడ్డాయి. వీటిలో రెండు తెలుగులో, ఒకటి కన్నడలో ఉన్నాయి. ఈ నిడిమామిడి ప్రాంతం గతంలో వీర శైవ పీఠం ఉండేది.  బయటపడిన శాసనాలు 15 వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందినవని సీనియర్ జర్నలిస్ట్ ..చరిత్ర పరిశోధకుడు మైనా స్వామి గుర్తించారు.

వీర శైవ పీఠంలో భాగమైన నిడిమామిడి పీఠానికి కంచి, హంపి,పెనుకొండ ప్రాంతాల్లో శాఖలు ఉన్నాయి. ప్రధాన పీఠం గుళ్లూరు లో ఉంది. అప్పట్లో వైష్ణవం తో పాటు శైవానికి విజయనగర పాలకులు ప్రాధాన్యత నిచ్చారు.

ఈ శాసనం ద్వారా ఆ విషయం స్పష్టమౌతోంది. కన్నడలో ఉన్న శాసనం  వీరభద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో కనిపించే నంది శాసనం అని మైనాస్వామి అంటున్నారు.

15 వ శతాబ్దానికి ముందు పూజలు అందుకున్న నంది విగ్రహం ఉందని శాసనం చెబుతోంది. రెండవ శాసనం తెలుగులోఉంది.  అది నిడిమామిడి లోని దళిత కాలనీలో ఒక పెద్ద రాయి పై కనిపించింది. 1542 తర్వాత సదాశివరాయలు రాజుగా ఉన్నప్పుడు..అలియరామరాయలు విజయనగర చక్రవర్తిగా ఉన్నప్పుడు ఇది చెక్కబడింది. ఈ తెలుగు శాసనం వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణం గురించి వివరిస్తుంది.

మూడవ శాసనం గ్రామ శివార్లలోని వ్యవసాయ క్షేత్రంలోని పెద్ద రాయిపై కనుగొనబడింది. ఇది 1608 నాటిది.. విజయనగర చక్రవర్తి వెంకటపతి రాయలు, ఆయన  ప్రతినిధి బంగారు నాయకుడు కాలంలో ఈ శాసనం చెక్కబడిందని మైనాస్వామి వివరించారు.

భారతీయ సంస్కృతి,  సంప్రదాయాలను రక్షించడానికి నిడిమామిడి పీఠం స్థాపించబడింది. ఈ శాసనాలు విజయనగర సామ్రాజ్యం వేసవి రాజధాని పెనుకొండ గురించి చెబుతాయి. నిడిమామిడిలో  నిర్మాణాలు శిథిలావస్థలో ఉన్నాయి. చాలా భూములు ఆక్రమణకు గురయ్యాయి. పురావస్తు శాఖ వారు శాసనాలను  దేవాలయ ప్రాంగణానికి చేర్చి …వాటిని రక్షించాలని  మైనాస్వామి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

——–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!