కొండవీటి డైలాగులు అప్పట్లో పెద్ద సంచలనం !!

Sharing is Caring...

A rare writer ………………

“ఆచార్య దేవా ఏమంటివి? ఏమంటివి ?” దానవీర శూర కర్ణ …సినిమాలోని ఆ డైలాగు వినగానే పాత తరం వారికి వెంటనే కొండవీటి వెంకటకవి గుర్తుకొస్తారు..డి. వి. ఎస్ కర్ణ లో ఎన్టీఆర్ కి ఆయన రాసిన డైలాగులు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి.

పౌరాణిక సినిమాల్లో ఆ తరహా లో ముందెవరూ డైలాగులు రాయలేదు. లక్షల సంఖ్యలో ఆడియో క్యాసెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఆ డైలాగులు చెప్పిన ఎన్టీఆర్ కి ఎంత ఖ్యాతి వచ్చిందో …కొండవీటి వేంకటకవి కి అంతే ఖ్యాతి దక్కింది. అంతటి గొప్ప కవి, పండితుడు…కొండవీటి వెంకటకవి. 

కొండవీటి వెంకటకవి తెలుగు చలనచిత్ర రంగంలో ముఖ్యంగా పౌరాణిక చిత్రాలపై తనదైన ముద్ర వేశారు. ఆయన రాసిన సంభాషణలు కేవలం మాటలు మాత్రమే కావు. ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ. ఆ కాలంలోని చాలా సినిమాలు వాడుక భాషను ఉపయోగించినా, ఆయన మాత్రం దాన వీర శూర కర్ణ కోసం అచ్చమైన గ్రాంథిక భాషను ఎంచుకున్నారు.

ఆ శైలి పాత్రలకు ఒక రకమైన గాంభీర్యాన్ని, ఆనాటి రాజ్యసభల వైభవాన్నికంటికి కంటినట్టు చూపింది.  ఆయన కలం నుండి వెలువడిన సంభాషణలు ఎన్.టి. రామారావు నట విశ్వరూపానికి ఆయువుపట్టుగా నిలిచాయి.అనూహ్యమైన స్పందనను సాధించాయి. 

ఈ సినిమా డైలాగులపై విమర్శలు కూడా ఉన్నాయి. మహాభారతంలో కర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ఆమెను కించపరిచే మాటలు అంటాడు. కానీ సినిమాలో కర్ణుడిని అత్యంత నిష్కళంకమైన పాత్రగా, కేవలం స్నేహానికి కట్టుబడిన త్యాగమూర్తిగా చూపించడం ద్వారా అతనిలోని ప్రతికూల కోణాలను దాచిపెట్టారనే విమర్శ ఉంది.

కర్ణ, సుయోధన పాత్రలను గొప్పగా చూపించే క్రమంలో పాండవులను బలహీనులుగా లేదా అసూయాపరులుగా చిత్రించారనే విమర్శ కూడా ఉంది. ధర్మరాజు, భీమార్జునుల వ్యక్తిత్వాలను ఈ సినిమా కొంత తక్కువ చేసి చూపిందని భావిస్తారు..

అలాగే శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఆధ్యాత్మికతను, సామాజిక సంస్కరణను మేళవించి ఆయన రాసిన మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. శ్రీమద్విరాటపర్వం , తాండ్ర పాపారాయుడు,ఏకలవ్య వంటి సినిమాలకు కూడా ఆయన తన లేఖినితో ప్రాణం పోశారు. పాత్ర స్వభావానికి తగ్గట్టుగా మాటలను రాయడంలో ఆయన సిద్ధహస్తులు. 

సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో, ఆయన డైలాగులలో సంస్కృత పదాల వినియోగం అర్థవంతంగా ఉండేది.ఆయన స్వతహాగా హేతువాది కావడంతో, పురాణ పాత్రల ద్వారా కూడా తర్కబద్ధమైన, ఆలోచింపజేసే సంభాషణలు రాయగలిగారు.

కొండవీటి వెంకటకవి  తెలుగు సినీ, సాహిత్యరంగాల్లో రచయితగా ప్రఖ్యాతి గాంచారు. ఆయన అసలు పేరు కొండవీటి వెంకటయ్య. సాహిత్యం అంటే ఆయనకు ఎంతో మక్కువ . ఆయన అందరిలా కాకుండా హేతువాద దృష్టితో చూసేవాడు. ఆ మార్గాన్నే జీవితమంతా అనుసరించారు .ఆధునిక కవుల్లో ఓ ప్రత్యేకత కలిగి , విలక్షణమైన రచనలతో ప్రస్థానం సాగించిన కవి పండితుడు వేంకటకవి. మహాకవి , పండితుడు , తాత్వికుడు.

కొండవీటి వేంకటకవి  1918లో జనవరి 25 న గుంటూరు జిల్లా విప్పర్ల గ్రామంలో నారాయణ , శేషమ్మ దంపతులకు జన్మించారు. తెలుగు ,సంస్కృత  భాషలు నేర్చుకున్నారు. తెలుగు పండితుడుగా పనిచేశారు . కొంతకాలం దేశమంతా పర్యటించి జీవితం పట్ల అవగాహన ఏర్పరచుకున్నారు .

సాహిత్యం పట్ల మక్కువ తో  తన 14 వ ఏట “కర్షకా ” అనే రచనతో సాహిత్య ప్రస్థానం మొదలు పెట్టారు. ఆయన ఎన్నో సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు  వేంకటకవి ప్రజ్ఞ ను గుర్తించి  “కళాప్రపూర్ణ ” బిరుదుతో ఘన సన్మానం చేసింది.

అభిమానులు కవిరాజు అనే  బిరుదు కూడా ఇచ్చారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి అంటే వేంకటకవి కి అభిమానం.రామస్వామి చౌదరి గారిలా వేంకటకవి ఆదర్శ వివాహాలు జరిపించారు. ఆయన రాసిన అనేక శతకాలు, గ్రంధాలు అన్ని గ్రంధాలయాల్లో ఉన్నాయి.

ఎందరో యువకులకు, రచయితలకు కొండవీటి వెంకటకవి ఆదర్శంగా నిలిచారు. ఏపీ  ప్రభుత్వం వీరిని అధికారభాష సంఘంలో సభ్యులుగా నియమించింది. సోక్రటీసు లాగా తన ప్రపంచం తప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి… ఆయన 1991, ఏప్రిల్ 7వ తేదిన కాలం చేశారు. 

మచ్చుకు కొన్ని డైలాగులు ……

ఆచార్యదేవా! ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ? కాదు, కాకూడదు, ఇది కులపరీక్షయే అందువా?
ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది.

విరాగియైన పాండురాజుకూ, సరాగినియై కూళప్రవర్తనాసక్తయైన కుంతికీ జనించిన పాండవులు; ఆబాల్యమూ ఆటపాటలలో మమ్ముల నస బెట్టిన పాండవులు.
అని గట్టిగా అనరాదు. వేరొకరు వినరాదు..

ముల్లును ముల్లుతోనే తియ్యాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి
అయ్యారే! భ్రమ! ఇది నా భ్రమ! హ్హహ్హహ్హ్హహ్హ్హ… కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ! భళా సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగు యీ కురుభూకాంతుని సంభావనా సంభాషణభూషణములచే యీ సభాభవనము ధన్యమూ, ధన్యము!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!