ఆ ఆలయ నిర్మాణమే ఒక మిస్టరీ !

Sharing is Caring...

A temple of secrets………………………..

పెద్ద రాతి కొండను తొలిచి నిర్మించిన దేవాలయం అది. రాళ్లతో, ఇటుకలతో నిర్మించిన ఆలయం కానే కాదు. అక్కడ మనకు అడుగడుగునా అద్భుతాలు కనిపిస్తాయి. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. గైడ్ విషయాలు చెబుతుంటే ఇది సాధ్యమేనా అని ఆలోచనలో పడతాం. ఆ దేవాలయమే కైలాస దేవాలయం.

ఇది ఎల్లోరా గుహల్లో ఉంది. ఈ ఆలయం నిర్మించడానికి అప్పట్లో నాలుగు లక్షల టన్నుల రాతిని తొలిచారని అంటారు. ఈ ఆలయంలో ఎక్కడా చూసినా అద్భుత శిల్ప సంపద కనువిందు చేస్తుంది. కొన్నివందల ఏళ్ళ క్రితం ఇంతటి అద్భుత ఆలయాన్ని అది ఏక రాతి నిర్మాణంగా తీర్చిదిద్దారంటే చాలా గొప్ప విషయమని చెప్పుకోవాలి.

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా నిర్మాణంగా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయ నిర్మాణం లో పాల్గొన్న శిల్పుల పేర్లు,తేదీలు , ఎలాంటి పరికరాలు వాడారో ఎవరికి తెలీదు. క్రీ.శ 760 లో రాష్ట్రకూట రాజవంశం రాజు కృష్ణుడు నిర్మించిన ఈ ఆలయంలో  మిస్టరీలు ఎన్నో ఉన్నాయి.

ఆలయంలో ఉన్న శివలింగం పై పొసే నీరు ఎటు వెళుతుందో ఎవరికి తెలియదు. ఆలయం కింద ఉన్న భూగర్భంలోకి ఆ నీరు వెళుతుందని అంటారు. ఆలయం నేలపై ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవని చెబుతారు.వాటివల్ల ప్రమాదం జరుగుతుందని ప్రభుత్వం వాటిని మూయించివేసింది. ఈ ఆలయ నిర్మాణంలో భౌద్ధులు, జైనులు,ఇతర మత పెద్దలు రాజులు పాల్గొన్నారు.

శిల్పులు ఆలయాన్ని రాతి పై నుంచి కిందకు చెక్కుతూ వెళ్లడం గొప్పవిషయం. అదెలా సాధ్యమైందో అంతుచిక్కని విషయం. గుడి లోపల నేటికీ చీకటిగా ఉంటుంది. ఆ రోజుల్లో వెలుతురు కోసం బయటినుంచి అద్దాలు వాడారని పరిశోధకులు అంటారు.

ఈ ఆలయంలో వాటర్ హార్వెస్టింగ్ సదుపాయం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ , రహస్య మార్గాలు ఉన్నాయి. అలాగే బాల్కనీలు .. వాటికి కింద నుంచి మెట్లు చూస్తుంటే అబ్బురమనిపిస్తుంది. అప్పట్లోనే అంత పక్కా ప్లానింగ్ తో ఆలయం నిర్మించారు.

ఆలయ నిర్మాణం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. స్థానిక రాజు అనారోగ్యానికి గురి కాగా అతని భార్య శివుడిని ప్రార్ధించి .. భర్త ఆరోగ్యం మెరుగుపడి, త్వరగా కోలుకుంటే ఆలయం కట్టిస్తామని మొక్కుకుందట. అలాగే ఆలయ గోపురం  చూసేవరకు తాను ఉపవాసం ఉంటానని దీక్షకు దిగింది.రాజు కోలుకున్నాడు. రాణి గారి మొక్కు తీర్చేందుకు కొండను కింది నుంచి తొలచి ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు.

అంతలో ఒక శిల్పి ఇలా నిర్మాణం చేపడితే రాణి గారు ఆలయ గోపురం చూసేందుకు కొన్ని వందల ఏళ్ళు పడుతుందని చెప్పాడట. మరేమి చేయాలనీ రాజు అడగగా ఆ శిల్పి కొండ పై నుంచి చెక్కుకుంటూ వెళితే త్వరితగతిన ముందు గోపురం పూర్తి అవుతుందని చెప్పాడట. వెంటనే పైభాగం నుంచి నిర్మాణం మొదలు పెట్టి గోపురం నిర్మించి రాణి గారు ఉపవాస దీక్ష విరమించేలా చేశారు.

కొన్ని వందలమంది శిల్పులు,సహాయకులు ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారని అంటారు. వేద సంప్రదాయాన్ని పాటిస్తూ శిల్పులు ఒక మహాయజ్ఞం చేసి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. వేద మంత్రాల ద్వారా శిలను పవిత్రం చేసి శక్తివంతంగా మార్చారు.

గుడిలో మంత్రాలు పఠించినపుడు …విచిత్రమైన రీతిలో అవి  ప్రతిధ్వనిస్తుంటాయి. ఇది కూడా ఈ ఆలయం ప్రత్యేకత. ఇక ఆలయం నిర్మాణానికి ఎన్ని ఏళ్ళు పట్టిందో సరైన సమాచారం లేదు. కొందరు వందేళ్లు అని … మరి కొందరు ఇంకా తక్కువని అంటారు.

ఇంత గొప్ప ఆలయాన్ని 1680 లో ద్వంసం చేసేందుకు ఔరంగజేబు పూనుకున్నాడట. ఇందుకోసం వెయ్యి మంది కూలీలను పెట్టారని అంటారు. మూడేళ్లు కష్టపడినా ఆలయాన్ని కూల్చలేకపోయారని .. విగ్రహాలకు గాట్లు  పెట్టడం మినహా ఏమి చేయలేకపోయారట. గర్భగుడి లోకి కాలు కూడా పెట్టలేకపోయారని స్థానికుల కథనం. అక్కడ విగ్రహాలు దెబ్బతిన్న ఆనవాళ్లు ఇప్పటికి కనిపిస్తాయి. ఇది కూడా ఒక మిస్టరీ అంటారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!