భోపాల్ ట్రాజెడీ ఇంకా సజీవమే !

Sharing is Caring...

The biggest industrial disaster…………………………………………….

భోపాల్ గ్యాస్ విషాద సంఘటన జరిగి 40 ఏళ్ళు అయింది. వేల మందిని బలిగొన్నఈ ఘటన తాలూకు బాధితులకు సరైన న్యాయం జరగ లేదు. బాధితులకు పునరావాస కల్పన పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి.1984 డిసెంబరు  2వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (బీఎంహెచ్చార్సీ)..బాధితుల ఆరోగ్య పరిస్థితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపణలున్నాయి. బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ఆరు ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 4,000 మందికి పైగా రోగులు వైద్య పరీక్షలు చేయించుకుంటారు.

బాధితుల్లో 30 శాతం మంది మనోవైకల్యానికి గురయ్యారు. మానసిక వైద్యులు అరకొరగా ఉండటం మూలాన సరైన వైద్యం,కౌన్సిలింగ్ దొరకక బాధితుల్లో  80% మంది ఇప్పటికీ కోలుకోలేదు. బాధితుల పునరావాసానికి కేంద్రం రూ.104 కోట్లు కేటాయించినట్లు ఆర్టీఐ ద్వారా అందిన సమాచారం.

ఈ మొత్తం సొమ్ము వెచ్చించడం లో కూడా అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. నిధుల కొరత పేరుతో 2018 నుంచి 473 మంది వితంతువులకు అధికారులు పెన్షన్ నిరాకరించారు. కాంగ్రెస్ హయాంలో నిలిపి వేసిన వితంతు ఫించను 2020 డిసెంబర్ నుంచి మళ్ళీ ఇస్తున్నారు.

విపత్తు తరువాత జన్మించిన మూడవ తరం బాలలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతమంది పిల్లలు కూర్చోలేరు.మాట్లాడలేరు.వినలేరు. చాలా మంది మహిళలు మళ్లీ గర్భం దాల్చలేకపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తు ఇది. భోపాల్ జిల్లాలో కోవిడ్ -19 కారణంగా 518 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 102 మంది భోపాల్ గ్యాస్ విషాదం నుండి బయటపడినవారు. 

అసలేం జరిగింది

1984 డిసెంబరు 2 అర్థరాత్రి భోపాల్ వాసులకు కాళరాత్రి. మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన భయంకర విషవాయువు వేల మందిని పొట్టన బెట్టుకుంది. లక్షలాది మంది జీవితాల్లో చీకట్లు నింపింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన మిథైల్ ఐసో సైనేట్  వాయువు కారణంగా లక్షలాది మంది జీవచ్ఛవాలుగా మారారు.

ఈ ఘటన జరిగి 40 ఏళ్లు అయినప్పటికీ దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ తరం పిల్లలపై కూడా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది.ఇక మహిళల సంగతి మరీ దారుణంగా ఉంది. ఈ వాయువు వల్ల కొత్తగా పెళ్లైన మహిళలకు రోజులు గడిచేకొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారిని అత్తింటి వారు నిర్దాక్షిణ్యంగా గెంటేశారు.

విష వాయువు కారణంగా రోగాల బారిన పడి ఇప్పటికీ అక్కడి వారికి వివాహాలు జరగడం లేదు. వివాహం జరిగినా సంతానం లేమి, ఒకవేళ గర్భం దాల్చినా పుట్టిన బిడ్డల ఆరోగ్యంపై  ప్రభావం చూపుతోంది. బాధితులు చాలా మంది తల్లిదండ్రులు, పిల్లలను కోల్పోయారు. 

నిందితుడు,కర్మాగారం యజమాని ఆండర్సన్ పట్టుబడినా,చాకచక్యంగా తప్పించుకున్నాడు.మరోవైపు ఆండర్సన్ ను అప్పగించాల్సిందే అని భారత్  చేసిన అభ్యర్థనను అమెరికా నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఒక్కో బాధితుడికీ పరిహారం కింద కేవలం రూ.25 వేలు ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి.

ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరికి ఇప్పటివరకూ శిక్ష పడలేదు.ఈ ఘటనలో కేవలం 3000 మంది మాత్రమే మరణించారని అధికారికంగా ప్రకటించినా, ఈ సంఖ్య 25 వేల వరకు ఉంటుందని అంచనా.పారిశ్రామిక భద్రత పై నియమ నిబంధనలు రూపొందించడానికి ఈ సంఘటన ఒక ప్రామాణిక మయ్యింది.

ఈ విషాద ఘటనకు సంబంధించి 1989 లో 705 కోట్ల రూపాయల నష్ట పరిహారం కేటాయించారు. మొదట్లో అంచనా వేసిన బాధితులు ఒక లక్షా అయిదు వేలమంది కాగా 2004 నాటికి అధికారికంగా ఆ సంఖ్య 5,73,588 కి పెరిగింది. దాంతో అతి తక్కువ నష్ట పరిహారం బాధితులకు అందింది. అది కూడా స్వచ్చంద సంస్థలు పోరాటం చేయబట్టి అనుకోవచ్చు.

——————-KNM

POST UPDATED ON 7-12-24

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!