Wandering through that valley of flowers is a sweet experience…………………..
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ .. ఒక అద్భుత వనం.. దీనినే దేవతల ఉద్యానవనం అంటారు. ఇక్కడ లక్షల రకాల పుష్పాలు, ఔషధ మొక్కలు ఉండటంతో ఆ ప్రాంతమంతా సువాసనలతో ఎప్పుడూ గుభాళిస్తుంటుంది. ఈ ఉద్యానవనం జూన్ నుండి అక్టోబరు వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని చమోలిలో ఉంది.
హిమాలయ సానువుల్లో వుండే ఈ పుష్పలోయకు సమీపంలోనే హేమకుండ్ సాహిబ్ గురు ద్వారా ఉంది. సిక్కు యాత్రీకులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. దాని పరిసరాల్లో బ్రహ్మకమలం, నాగపుష్పం వంటి అరుదైన పూలు విస్తారంగా పూస్తాయి. ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తుంది. ఎండాకాలం లోనూ విపరీతమైన చలి, నిరంతర వర్షం వుంటుంది.
మనం నడుస్తుంటే మేఘాలు మనల్ని కమ్మేస్తుంటాయి. మనలను తాకుతూ ప్రయాణిస్తుంటాయి. ఆ మేఘాలు మన శరీరాన్ని తాకి వెళుతుంటే ఏదో తెలీని అనుభూతికి లోనవుతాం . సముద్ర మట్టానికి సుమారు 4 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ పూల లోయను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు.
తూర్పు ,పశ్చిమ హిమాలయాల పూల జాతులకు మధ్య ఈ లోయ వారధిగా నిలుస్తోంది. ఈ పూల వనం నందాదేవి జీవారణ్య రిజర్వ్ లో భాగం. ఈ ప్రాంతమంతా వ్యాపించిన పూల పరిమళాలు ఏదో మత్తుకు గురిచేస్తాయి. తెలియని తన్మయత్వం మనల్ని ఆవహిస్తుంది.
ఆ పచ్చిక మైదానాల్లో గడ్డి పూల సౌందర్యాన్ని సూర్యకాంతి లో తిలకించడం ఒక అద్భుతం. ఒక అరుదైన అనుభవం. మంచు ముత్యాలతో మిల మిల మెరిసే పర్వత సానువుల అందాలను వర్ణించలేము. వాటిని కంటి తో చూసి తరించాలి. ఆ పూలపై గుండా వీచే మలయ మారుతాలు మనసుని ఉయ్యాలలూపుతాయి.
జీవితంలో ఒకసారి అయినా చూడదగిన ప్రదేశాల్లో ఇదొకటి అనడం లో సందేహమే లేదు. ఈ వ్యాలీకి చేరుకోవడం కొంత శ్రమతో కూడిన విషయమే. డెహ్రాడూన్ నుండి జోషిమఠ్ కి రోడ్డు మార్గాన 11 గంటల ప్రయాణం, ఆపై గోవింద్‌ఘాట్‌కు మరో గంట ప్రయాణం చేయాలి. లేదా రిషికేష్ నుంచి కూడా గోవింద్ ఘాట్ కి రావచ్చు. గోవింద్‌ఘాట్ నుండి ఘంగారియా వద్ద బేస్ క్యాంప్‌కు చేరుకోవాలి.
అక్కడ నుంచి పర్వత మార్గంలో 13-కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. అయితే అక్కడికి చేరిన పిదప క్షణంలో ఆ శ్రమను ఇట్టే మరిచిపోతాం. ఘంగారియా లో హోటల్స్ కూడా ఉన్నాయి. పలు రకాల ప్యాకేజీల్లో వసతి, ఫుడ్ లభిస్తాయి.