పెనుతుఫాను తో ఆ పట్టణం రూపురేఖలు మారిపోయాయి. ఆ పట్టణం పేరే ధనుష్కోడి. తమిళనాడుకు తూర్పుతీరాన ఉన్న రామేశ్వరం దీవికి దక్షిణపు అంచులోని చిన్నపట్టణం.1964 కు ముందు భారతదేశానికి, శ్రీలంక కు వారధి గా ధనుష్కోడి ఉండేది. ఇక్కడ జాలర్లు ఎక్కువగా ఉంటారు. 1964 లో వచ్చిన తుఫానుకి పట్టణం కొట్టుకుపోయింది. డిసెంబర్ 21న రాత్రి వేళ 270 కి మీ వేగంతో పెనుగాలులు వీచాయి.
సముద్రంలో అలలు 20-30 అడుగుల పైకి లేచాయి. ధనుష్కోడి ఓడరేవు పట్టణాన్ని ఆ రాత్రి తుఫాన్ అతలాకుతలం చేసింది. తుఫాన్ ధాటికి పలువురు ప్రాణాలు కోల్పోయారు.అప్పటికి ధనుష్కోడి కి బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేవు. కమ్యూనికేషన్ సదుపాయాలు అసలు లేవు.
ఆ రోజుల్లో ధనుష్కోడికి రైల్వే స్టేషన్, చిన్న రైల్వే హాస్పిటల్, హయ్యర్ సెకండరీ స్కూల్, పోస్టాఫీసు, కస్టమ్స్ ..పోర్ట్ ఆఫీసు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ తుఫాన్ దెబ్బకు ధ్వంసమైనాయి. ద్వీపంలో ఉంటున్న 500 మంది నివాసితుల కోసం తిరిగి కొన్నింటిని పునరుద్ధరించారు.
అప్పట్లో పంబన్ రైలు వంతెన మాత్రమే ధనుష్కోడికి చేరుకోవడానికి ఏకైక మార్గం.ఆ రాత్రి 110 మంది ప్రయాణికులు.. 5 గురు రైల్వే సిబ్బందితో పంబన్ నుండి బయలుదేరిన పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ రైలు అలల తాకిడికి గురైంది. భారీగా సముద్రపు నీరు రైలు భోగీల్లోకి ప్రవేశించింది. ప్యాసింజర్లకు ఏమి జరుగుతున్నదో అర్ధం కాలేదు. అయ్యే లోగా మొత్తం రైలు కొట్టుకు పోయింది..అందరూ మరణించారు.
ద్వీపంలో 3000 మందికి పైగా చిక్కుకుపోయారు. ధనుష్కోడిలోనే 800 మందికి పైగా మరణించారు. చిన్న పట్టణం తుఫాన్ దెబ్బతో శిథిలావస్థకు చేరుకుంది. పంబన్ వంతెన కూడా ధ్వంసమైంది. ఇప్పటికి అక్కడ నాడు నేలమట్టమైన రైల్వే లైన్ అవశేషాలు..ఇళ్ల తాలూకు శిథిలాలను చూడవచ్చు.
ఇక పురాణాల ప్రకారం శ్రీరాముని ఆదేశాల మేరకు హనుమంతుడు వానర సైన్యం సహాయంతో శ్రీలంక చేరుకోవడానికి సముద్రం మీదుగా వంతెనను నిర్మించిన ప్రదేశమే ధనుష్కోడి.ఈ వంతెనను రామసేతు అంటారు. సముద్రంలో మునిగి పోయిన ఈ వంతెన ఇప్పటికి అక్కడే ఉందని కనుగొన్నారు. యుద్ధంలో గెలిచిన తరువాత శ్రీరాముడు రావణుడి సోదరుడు విభీషణుడిని లంక రాజుగా పట్టాభిషేకం చేశాడు.
విభీషణుడు తర్వాత రామసేతుని నాశనం చేయమని రాముడ్ని అడిగాడు. విభీషణుని కోరిక మేరకు రాముడు ధనుష్కోడి చేరాక తన విల్లు కొన భాగం తో వంతెన పై గీత గీస్తాడు. దాంతో వంతెన సముద్ర గర్భంలోకి జారిపోయిందని అంటారు. ధనుష్కోడి అంటే ‘విల్లు చివర (కొన) అని అర్ధమని చెబుతారు. ధనుష్కోడి రామేశ్వరం నుండి 20 కి.మీ..శ్రీలంక నుండి 31 కి.మీ.ల దూరంలో ఉంది.
ఈ పట్టణంలో 15 కిలోమీటర్ల పొడవునా విశాలమైన బీచ్ ఉంది. ధనుష్కోడి చుట్టూ ఒక వైపు బంగాళాఖాతం .. మరొక వైపు హిందూ మహాసముద్రం ఉన్నాయి. పర్యాటకులను బాగా ఆకట్టుకునే ప్రదేశమిది. రామేశ్వరం వెళ్లిన వారు ఇక్కడికి వెళ్లి బీచ్ చూడవచ్చు. తర్వాత కాలంలో పంబన్ కి రోడ్డు వంతెన కూడా నిర్మించారు. రామేశ్వరం నుంచి శ్రీలంక లోని తలైమన్నారు కి ఫెర్రీ సర్వీసులు గతంలో ఉండేవి.
Pl.read it also ఆ బ్రిడ్జి పై రైలు ప్రయాణం .. అరుదైన అనుభవం !