యోగం అంటే అదే మరి !

Sharing is Caring...

Good luck……………………………….

యోగం అంటే అదే మరి .. ఈ ఫొటోలో కనిపించే ఆరన్ సాండర్సన్  ఊహించని రీతిలో ఒక దీవికి రాజయ్యాడు.  అతగాడు ఒక సాధారణ ఎలక్ట్రిషియన్. ఇంతకూ ఆ దీవి ఎక్కడ ఉందంటే వాయువ్య ఇంగ్లాండ్ లోని కంబ్రియా కౌంటీ ఫర్నెస్ తీరానికి దాదాపు మైలు దూరంలో ఉంది. దీని పేరు ‘పీల్ ఐలాండ్’ . దీని విస్తీర్ణం 26 ఎకరాలు.

ఈ దీవిని సొంతం చేసుకోవడానికి సుమారు రెండువందల మంది పోటీ పడ్డారు. అదృష్టం వరించడంతో ముప్పయి మూడేళ్ల ఆరన్ సాండర్సన్  ఈ దీవిని 2022 జులై లో సొంతం చేసుకోగలిగాడు. అంతేకాదు, 170 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ‘కింగ్ ఆఫ్ పీల్ ఐలాండ్’గా 2022 సెప్టెంబర్ లో అతనికి పట్టాభిషేకం చేసారు. పదేళ్ల లీజ్ కాలం వరకు అతనే ఈ దీవికి .. పబ్ కి రాజు.

ఇదంతా ఒక సంప్రదాయ ప్రక్రియ ప్రకారం జరుగుతుంది. పర్యాటక కేంద్రమైన ‘పీల్ ఐలాండ్’లో ఒక పబ్ ఉంది. ఇంగ్లాండ్ నలుమూలల నుంచి ఇక్కడకు జనాలు తరచుగా వస్తుంటారు. అప్పుడప్పుడు చుట్టుపక్కల యూరోపియన్ దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ దీవిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

పర్యాటకులు ఇక్కడ టెంట్లలో బస చేస్తుంటారు. టెంట్లలో బస చేయడానికి రోజుకు 5 పౌండ్లు (సుమారు రూ.500) భోజనం,మందు ఖర్చులు అదనంగా పే చేయాలి. చిరకాల సంప్రదాయం ప్రకారం క్రంబియా కౌంటీ ఈ దీవిలోని పబ్ ను నడిపేందుకు టెండర్లు ఆహ్వానించింది. రెండు వందల మందికి పైగా దీని కోసం  పోటీ పడ్డారు. చివరకు ఆరన్ సాండర్సన్  కు ఇది దక్కింది.

పబ్ యాజమాన్యంతో పాటు, దీవికి రాజుగా పట్టాభిషేకం ఆరన్ సాండర్సన్ కి దక్కాయి.  పీల్ ఐలాండ్ లో పబ్ తో పాటు పురాతనమైన కోట కూడా పర్యాటక ఆకర్షణగా ఉంటోంది. ఫర్నెస్ ప్రాంతానికి చెందిన మత గురువులు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ పెద్ద రాతికోటను నిర్మించారు.

ఈ దీవి నుంచి ఫర్నెస్ తీరానికి రాకపోకలు జరిపేందుకు ఒక మరపడవ అందుబాటులో ఉంటుంది. ఈ మరపడవ లో పదిహేను నిమిషాల్లో ఫర్నెస్ తీరానికి చేరుకోవచ్చు.రాడ్ స్కార్ అనే వ్యక్తి  ఆగస్టు వరకు ఈ దీవికి రాజుగా కొనసాగాడు. పట్టాభిషేకం తర్వాత పబ్ నిర్వహణతో పాటు దీవి మొత్తం సాండర్సన్ ఆధీనంలోకి వచ్చింది.  అదృష్టం కలిసొచ్చి రాజ’యోగం పట్టడం అంటే ఇదేనేమో.

post updated on 4/8/23

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!