టంగ్ స్లిప్ అయితే అంతే …..

Sharing is Caring...

 Slip…………………………………

దూలలందు నోటి దూల మహా ప్రమాదం అన్నారు శాస్త్ర కారులు. కొంతమంది దాన్ని వదిలించుకోలేరు. ఏది బడితే మాట్లాడేస్తారు. తర్వాత విమర్శల హోరు తట్టుకోలేక నేను ఆఉద్దేశ్యం తో అనలేదు లేదా మీడియా వక్రీకరించింది అంటారు. ఇండియా లో ఇలాంటి నోటిదూల ఉన్న నాయకులు చాలామందే ఉన్నారు. అప్పుడప్పుడు తమ వాచాలతను వారంతా బయట పెట్టుకుంటుంటారు.

ఆ కోవలోని వ్యక్తే కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ కుమార్.‘‘ఒకవేళ అత్యాచారం అనివార్యమైతే ఆనందంగా ఆస్వాదించాలి” అని అసెంబ్లీ లో వ్యాఖ్యానించి వార్తల్లో కెక్కారు. దీంతో బయట పార్టీ వాళ్ళే కాదు సొంత పార్టీ వాళ్ళు కూడా అక్షింతలు వేశారు. ఎడాపెడా విమర్శించారు. శాసనసభలో అతివృష్టి, వరద నష్టంపై చర్చ జరుగుతుంటే ఏదో చెప్పాలనుకుని పై మాటలు అనేసారు. దీంతో సభ అట్టుడికింది.

ముఖ్యంగా ఒక హోదా లో ఉన్నపుడు చాల జాగ్రత్తగా మాట్లాడాలి. బ్యాలెన్స్ తప్పకూడదు. ఈ వ్యవహారంపై లోకసభలో కూడా దుమారం చెలరేగింది. ఇలాంటి వాళ్ళను పార్టీ లో ఎలా ఉంచుకున్నారని రాహుల్.. ప్రియాంక లపై విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. దీంతో ప్రియాంక కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. చివరాఖరికి రమేశ్ కుమార్ “ఇంగ్లీషులోని ఓ సామెతను ప్రస్తావించాను తప్ప మహిళలను అవమానించాలని, సభా గౌరవాన్ని తగ్గించాలని కానీ తనకు లేద”ని ..  మహిళలకు క్షమాపణలు చెప్పారు. అనాలోచితం గా ఏదిబడితే అది మాట్లాడితే ఇలాంటి ఉపద్రవాలు తలెత్తుతాయి.

ఆ మధ్య మహిళలు టోన్‌జీన్స్‌ (చిరుగుల జీన్స్‌) ధరించడంపై ఉత్తరాఖండ్‌ సిఎం చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పద మైనాయి. ఆతర్వాత పశ్చిమ బెంగాల్  బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సీఎం మమతా బెనర్జీపై నోరుపారేసుకున్నారు. మమతా గాయమైన కాలును ప్రజలకు చూపించాలని కోరుకుంటే .. చీరకు బదులుగా బెర్ముడా జీన్స్‌ ధరిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై కూడా రచ్చ జరిగింది.

అలాగే కొన్నాళ్ల క్రితం  కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌. “మన దేశ ఆధునిక మహిళ ఒంటరిగా ఉండాలని ఆశిస్తుంది. వివాహబంధానికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కనడానికి ఆమె ఇష్టపడటం లేదు.”అని ఒక సభలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు ఉదాహరణలున్నాయి. ఏపార్టీ నేతలు కూడా ఇందుకు అతీతం కాదు. అందుకే టంగ్ స్లిప్ కాకూడదు. అయితే మాత్రం …..

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!