చైనా వదిలిన రాకెట్ అదుపు తప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడది ఏ దేశంపై పడుతుందా అని జనాలు హడలి పోతున్నారు. ఇది మరి కొద్దీ గంటల్లో భూమిని తాకవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాకెట్ కు చైనా లాంగ్ మార్చ్ 5 బీ అని పేరు పెట్టింది. ఇది జనావాసాలపై పై పడితే భారీ స్థాయిలో విద్వంసం జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.ప్రస్తుతం రాకెట్ సెకను కి 4 మైళ్ళ వేగంతో భూమి వైపు దూసుకువస్తుందని చెబుతున్నారు.
భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాలలో ఎక్కడైనా కుప్పకూలవచ్చని అంటున్నారు. దాన్ని అదుపులోకి తేవడానికి , నిర్జన ప్రాంతాలకు మళ్లించే ప్రయత్నాలు చైనా చేస్తున్నదా ? లేదా ? తెలియడం లేదు.అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు జోనాథన్ మెక్ డొవెల్ అంచనాల ప్రకారం ఆ చైనా రాకెట్ బీజింగ్,ఆస్ట్రేలియా లోని సిడ్నీ ,బ్రెజిల్ లోని రియో డీజే నేరియా నగరాలపై, అలాగే భారత్ రాజధాని ఢిల్లీ పై పడే అవకాశాలు ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు. కాగా అమెరికా లోని న్యూయార్క్,యూరప్ లోని మాడ్రిడ్,ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ లలో ఏదో ఒక ప్రాంతాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి.
అదుపు తప్పిన ఈ చైనా రాకెట్ పొడవు 100 అడుగులు .. వెడల్పు 16 అడుగులు. బరువు 22 టన్నులు. దీన్ని అమెరికా ట్రాక్ చేస్తున్నది. శనివారం భూమిని తాకుతుందని సైంటిస్టులు చెబుతున్నారు కానీ ఖచ్చితంగా ఎక్కడ పడుతుందని చెప్పలేకపోతున్నారు. ఇది భూమిని తాకినప్పటికీ పెద్ద నష్టం ఉండదని .. భయపడాల్సిన అవసరం లేదని చైనా స్పేస్ ప్రోగ్రాం చెబుతోంది. గత ఏడాది ప్రయోగించిన రాకెట్ కూడా ఫెయిల్ అయి ఐవరీ కోస్ట్ లోని గ్రామాలపై శిధిలాలు పడ్డాయని .. ప్రాణ నష్టం జరగలేదని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. 2030 నాటికి స్పేస్ లో అమెరికా, రష్యాలను మించి పోవాలని చైనా భావిస్తోంది. అంతరిక్షంలో ఒక స్పేస్ స్టేషన్ ను కూడా నిర్మిస్తోంది. రకరకాల ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగానే పంపిన రాకెట్ అదుపు తప్పింది.