భండారు శ్రీనివాసరావు………………………………………………
ఆరేళ్ల క్రితం ఒక బుధవారం అర్ధరాత్రి యావత్ దేశం నిద్రావస్థలో వున్న వేళ, దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ తన కర్తవ్య పాలనలో మునిగి తేలింది. స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళలో ఏనాడు కనీ వినీ ఎరుగని రీతిలో సుప్రీం కోర్టు అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఒక కేసుని తెల్లవారుఝాము వరకు విచారించి, తన తుది తీర్పుని వెలువరించింది. అదీ ఒక ఉగ్రవాదికి సంబంధించిన కేసు కావడం ఓ విశేషం అయితే, ఆ ముద్దాయికి కింది కోర్టు విధించిన మరణ దండనను ఖరారు చేయడం అన్నది మరో అపూర్వ సంఘటన.
కేవలం సినిమాల్లో, కాల్పనిక సాహిత్యంలో మాత్రం కావవచ్చే ఇటువంటి సన్నివేశం ఆ రాత్రి చోటు చేసుకుందన్న సమాచారం దేశ ప్రజలకు గురువారం ఉదయం కానీ తెలియరాలేదు.సుప్రీం కోర్టు అసాధారణ రీతిలో తీసుకున్న ఈ చర్యకు కారణ భూతమైన కేసు, దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. ఏళ్లతరబడి సాగిన ఈ కేసు విచారణ నత్త నడకకు పర్యాయపదంగా మారడం, తిరిగి అదే కేసు చివరి అంకంలో లేడి పరుగు అందుకోవడం ఇందుకు ఉదాహరణ.
ఇరవై ఎనిమిదేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన మారణ హోమానికి సూత్రధారులు అయిన వ్యక్తులు ఈ కేసులో ముద్దాయిలు. నాటి నరమేధం తరువాత దేశంలో ఈ మాదిరి ఉగ్రవాద దాడులు పదుల సంఖ్యలో జరిగాయి. మరెంతో మంది వాటికి బలయ్యారు. 1993 లో ముంబై లో విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదులు హఠాత్తుగా తెగబడి ఒకే ఒక్క రోజున, కొన్ని గంటల వ్యవధిలో నగరంలో జన సంచారం అధికంగా వుండే ప్రాంతాలలో, కార్యాలయాల్లో బాంబులు అమర్చి వరుస పేలుళ్లు జరిపి 257 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. వందల సంఖ్యలో అమాయకులు క్షత గాత్రులై, కళ్ళూ, కాళ్ళూ పోగొట్టుకుని ఇన్నేళ్ళుగా జీవచ్చవాల్లా జీవనం సాగిస్తున్నారు.
ఈ స్థాయిలో నరమేధానికి పధకం వేసిన వ్యక్తులు మాత్రం హాయిగా విదేశాల్లో కాలం గడుపుతున్నారు. పైపెచ్చు మరిన్ని దాడులకు పధక రచనలు చేస్తున్నారు. పట్టుబడిన వారిలో పదిమందికి మరణ శిక్ష పడింది. వారిలో తొమ్మిది మందికి, పై కోర్టులో ఊరట లభించింది. ఉరి శిక్ష యావజ్జీవ శిక్షగా మారింది. ఇక ఒకే ఒక ముద్దాయి అయిన యాకూబ్ మెమన్ మాత్రం మరణ దండన తప్పించుకోలేకపోయాడు. అయితే, పలు మానవ హక్కుల సంఘాలు, సమాజాల మద్దతుతో, భారత శిక్షాస్మృతిలో వున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ దశాబ్ద కాలానికి పైగా న్యాయపోరాటం చేస్తూనే వచ్చాడు. ఈ పోరాటంలోని చివరి మలుపులే ముందు పేర్కొన్న అసాధారణ సన్నివేశాలకు వేదికగా మారాయి.
ఈ కేసులో ప్రధాన ముద్దాయి టైగర్ మెమన్ సోదరుడే ఈ యాకూబ్ మెమన్. తొలుదొల్త, టాడా కోర్టు ఈ కేసును విచారించింది. అనేక వందలమంది ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కారణం అయ్యాడన్న హేతువు చూపి న్యాయస్థానం అతడికి మరణ శిక్ష విధించింది. అతడు అంతటి కఠినశిక్షకు అర్హుడా కాదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే, వరుస బాంబు పేలుళ్ళతో సుమారు మూడువందలమంది ఉసురు తీసిన ముష్కరులకు సాయపడ్డారన్న అభియోగాన్ని సుదీర్ఘ కాలం విచారించిన పిమ్మటే, టాడా కోర్టు అతడికి మరణ దండన విధించింది.
హైకోర్టు ఆ తీర్పును ఖరారు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు, ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, సాంకేతిక కారణం చూపి భిన్న స్వరాలు వినిపించడంతో, కేసు భారత ప్రధాన న్యాయమూర్తి చెంతకు చేరింది. దానితో సహజ న్యాయ సూత్రాలకు లోబడి త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు కావడం, ఆ ముగ్గురు న్యాయమూర్తులు వెనువెంటనే విచారణ జరిపి అతడికి ఉరిశిక్షను ఖాయం చేయడం, క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి సైతం తిరస్కరించడం జరిగి పోయాయి. మరునాడు గురువారం ఉదయం యాకూబ్ మెమన్ ను ఉరి తీయడానికి నాగపూరు కేంద్ర కారాగారంలో నిబంధనల ప్రకారం ఓ పక్క ఏర్పాట్లు జరుగుతుంటే, మరో పక్క దేశ రాజధాని ఢిల్లీలో ఈ కేసు అర్ధరాత్రి వేళ అనేక కీలక మలుపులు తిరిగింది.
క్షమాభిక్ష అభ్యర్ధనను తిరస్కరిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేసరికే బుధవారం చాలా పొద్దుపోయింది. దరిమిలా, యాకూబ్ న్యాయవాదులు సుప్రీం తలుపు తట్టారు. నిబంధనల ప్రకారం ఉరి శిక్షను రెండు వారాలు వాయిదా వేయాలని కోరారు. దానితో, అసాధారణ రీతిలో రాత్రికి రాత్రే సుప్రీం ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. ఉభయ పక్షాల వాదనలు గురువారం తెల్లవారుఝాము వరకు సాగాయి. ఎట్టకేలకు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో యాకూబ్ ఉరి శిక్షను సర్వోన్నత న్యాయస్థానం ఖరారు చేయడంతో, ముద్దాయి తరపు న్యాయవాదులు కడకంటా చేసిన న్యాయపోరాటం బూడిదలో పోసిన పన్నీరు చందం అయింది.
కోర్టు నిర్ణయానికి అనుగుణ్యంగా గురువారం ఉదయం ఏడుగంటల లోపే నాగపూరు కేంద్ర కారాగారంలో యాకూబ్ మెమన్ ను ఉరితీసారు. 1962లో ముంబై లో జన్మించి,1986 లోఎం.కాం. పట్టా పుచ్చుకుని, సీఏ పూర్తి చేసి చార్టర్డ్ అక్కౌంటెంట్ గా ప్రాక్టీసు ప్రారంభించిన ఒక యువకుడి జీవితం, ఉగ్రవాదులతో సాన్నిహిత్యం పుణ్యమా అని యాభయ్ మూడేళ్ళ వయస్సులో, ఆ విధంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది. అందులో సింహభాగం జైలు జీవితంలోనే గడిచిపోయింది. ఈ యువకుడి పేరు యాకూబ్ మెమన్ అనే ముస్లిం నామం కావడం కేవలం యాదృచ్చికమే. ముస్లిం మతానికి, ఉగ్రవాదానికీ ఎటువంటి సంబంధం లేదు. అదే నిజమయితే అనేక ముస్లిం దేశాల్లో ఉగ్రవాదుల మారణ హోమానికి వందల సంఖ్యలో ముస్లింలు మరణించే అవకాశమే వుండదు.
ఉగ్రవాదులకు మతమౌడ్యం తప్పిస్తే వారికి మతం అంటూ లేదు. తాము నమ్మిన మార్గంలో, ఆ మార్గాన్ని నమ్మని వారిని తెగనరుకుంటూ పోవడం ఒక్కటే వారికి తెలిసింది. వారి చేతిలో పేలే తుపాకీ తూటాలకి ఎదుటి వ్యక్తి ఏ మతంవాడు అన్న సంగతే పట్టదు. అందుకే మతం పేరుతొ ఉగ్రవాదులు సాగించే దుశ్చర్యలకి మతం రంగు పులమడం తగని పని. నిజానికి దేశాన్ని ప్రేమించడానికి మతంతో నిమిత్తం లేదు. అలాగే దేశాన్ని ద్వేషించడానికి మతం అక్కరలేదు.ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంతకు ఒకరోజు ముందు కన్నుమూసిన ఓ మహానీయుడు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.ఆయన ఆకస్మిక మరణ వార్త విని యావత్ భారతం కులమతాలతో నిమిత్తం లేకుండా ఆ మహనీయుడ్ని తలచుకుంటూ భోరున విలపించింది.
ఆ అకళంక దేశభక్తుడి భౌతిక కాయాన్ని గురువారం నాడే, అంటే యాకూబ్ మెమన్ ని ఉరితీసిన కొన్ని గంటల తరువాత తమిళనాడులోని రామేశ్వరంలో సమస్త అధికార లాంఛనాలతో ఖననం చేశారు. పసిపిల్లలనుంచి వయోవృద్దులవరకు, నిరక్షరాస్యుల నుంచి మేధావులవరకు కంట తడిపెట్టని మనిషంటూ లేడు.ఏపీజే అబ్దుల్ కలాం అన్న పేరు వున్నంత మాత్రాన ఆయనకు మతాన్ని ఆపాదించలేము. భారత దేశాన్ని అనుక్షణం ఆరాధించే, దేశం బాగుండాలని అహరహం తపించే గొప్ప దేశ భక్తుల వరుసలో ఆయన ప్రధముడు. పేరు చూసి ఆయన్ని ముసల్మాన్ అని అనుకుంటే అంతకంటే మూర్కత్వం మరోటి వుండదు. అబ్దుల్ కలాం ముస్లిం కావచ్చు కాని ఆయన సర్వోత్తమ భారతీయుడు.
మెమెన్ యాకూబ్ కూడా అదే మతానికి చెందిన వాడు. కాని, దేశ ద్రోహులతో చేతులు కలిపిన వాడు. బాంబులు పేల్చి, అమాయకుల ప్రాణాలు హరిస్తూ, అస్తవ్యస్త పరిస్థితులు సృష్టించి దేశాన్ని బలహీన పరుస్తూ భారత దేశ సార్వ భౌమత్వానికీ, సమగ్రతకూ ముప్పు తెస్తున్న విదేశీ ముష్కరులకు ఏదో ఒక రూపంలో సహాయ హస్తం అందించిన వ్యక్తి. యాకూబ్ పేరును బట్టి, జన్మను బట్టి ముస్లిం కావచ్చు కానీ, ఆయన సామాన్య జనం దృష్టిలో, సర్వోన్నతన్యాయస్థానం దృష్టిలో కరడు గట్టిన ఉగ్రవాది.
చనిపోయిన ఇద్దరూ ఒకే మతానికి చెందిన వారు అయినప్పటికీ వారిలో ఒకరు నిష్కళంక దేశ భక్తులు. దేశ రక్షణకు కవచంలా ఉపయోగపడే అణుక్షిపణుల రూపశిల్పి. మరొకరు దేశాన్ని నిర్వీర్యం చేయాలనే దుష్ట శక్తులతో చేతులు కలిపిన దేశ ద్రోహి. భారత శిక్షా స్మృతి ప్రకారం విచారణ జరిగి వుండవచ్చు. కానీ ఇది మనదేశంపై పొరుగు దేశం జరిపిన ప్రచ్చన్న యుద్ధంగానే పరిగణించాలి. కేసు దర్యాప్తులో అధికారులకు యాకూబ్ మెమన్ సహకరించాడనే కారణంతో శిక్షను తగ్గించినంత మాత్రాన, ముంబై పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాల గర్భశోకం తీరదు.
‘ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం’ అనే నాయకుల ఉద్ఘాటనలకు అర్ధం వుండదు. ‘వెయ్యిమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు కాని, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడరాదు’ అనే సినిమా డైలాగులు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించవచ్చునేమో కానీ, దేశం మీద ఇలా దొంగ దెబ్బలు తీసేవారి పట్ల ఏమాత్రం వర్తించవు.ఈ తేడా ఒక్కటే భారతీయుల మనస్సుల్లో వారిద్దరి స్థానాలను వేరు చేసింది. అబ్దుల్ కలాం చనిపోతే కుటుంబంలో ఒక ఆత్మీయుడు చనిపోయినట్టుగా దేశ ప్రజలు దుఖపడ్డారు. పరలోకంలో ఆయనకు సద్గతులు లభించాలని అన్ని మతాలవాళ్ళు వారి వారి దేవతలను వేడుకున్నారు. అదే యాకూబ్ మరణం పట్ల ప్రజల స్పందన మరో రకంగా వుంది.
ఓ పక్క మతాన్ని ప్రేమిస్తూ, మత విశ్వాసాలకు కట్టుబడి జీవనం సాగిస్తూ అబ్దుల్ కలాం తన జీవితాన్ని దేశ సౌభాగ్యం కోసం పణంగా పెట్టి పనిచేశారు. ఒక శాస్త్రవేత్తగా ఆయన తన మేధస్సును యావత్తు, భారత దేశాన్ని రక్షణ పరంగా పటిష్టం చేయడానికి ఉపయోగించారు. ‘గొప్ప కలలు కనండి, వాటిని నిజం చేసుకుని దేశాన్ని మరింత గొప్ప దేశం చేయండి’ అంటూ అబ్దుల్ కలాం ఇచ్చిన సందేశంతో లక్షలాదిమంది భారత యువజనులు స్పూర్తి పొంది ఉత్తెజితులయ్యారు.
నదుల్లో పారే నీటికి కులం లేదు. ఒంట్లో పారే నెత్తురుకు మతం లేదు. జనం పీల్చే గాలికి కులం లేదు, మతం లేదు.
రామేశ్వరంలో నేలతల్లి ఒడిలో ఒదిగి దీర్ఘ నిద్రలో మునిగిన అబ్దుల్ కలాం చనిపోయి ప్రజల మనస్సుల్లో జీవిస్తున్న మహా మనీషి. కుల మతాల చట్రంలో చిక్కని మహనీయుడు.అదే రోజున నాగపూరు జైల్లో ఉరితీతకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న యాకూబ్, దేశ భద్రతకు ముప్పుగా తయారయిన విదేశీ ఉగ్రవాదులకు సహకరించిన స్వదేశీ ఉగ్రవాది. ఆయన్ని ముస్లిం అనడం తప్పు. అలా ఎవరయినా అంటే, భారత దేశాన్ని ఇతర మతాలవారితో సమానంగా ప్రేమిస్తున్న ముస్లిం మతస్తులను ఘోరంగా అవమానించడమే అవుతుంది.
అందుకే వీరిద్దరిలో ఒకరు దేశ ప్రజల హృదయాల్లో శాశ్విత స్థానం సంపాదించుకుంటే, మరొకరు వారికి భౌతికంగా, మానసికంగా కూడా దూరం అయ్యారు.ఒకరు అజరామరమైన కీర్తిని మూటగట్టుకుని పరలోకాలకు తరలిపోయారు. మరొకరు జన్మజన్మలకూ జనాలు మరచిపోలేని అపకీర్తిని వెంటబెట్టుకుని వేరే లోకానికి వెళ్ళిపోయారు.ఒకరి కోసం దేశం మొత్తం ఒక్కటై కన్నీరు మున్నీరు అవుతుంటే, మరొకరికోసం రెండు కన్నీటి బొట్లు రాల్చేవాళ్ళు కూడా లేకుండా పోయారు.