తొలగిస్తారేమోనన్న భయం తోనే తెగతెంపులు ?

Sharing is Caring...

Changing equations…………………………………………….

బీహార్ సీఎం జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్.. ఎన్డీయే కూటమితో  తెగతెంపులు చేసుకున్నారు. కుల గణన, జనాభా నియంత్రణ,  అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ వంటి వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కొంతకాలంగా బీజేపీ జేడీ(యు) ల  మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 

ఎనిమిదేళ్ల తర్వాత రెండోసారి మిత్రపక్షమైన బీజేపీతో నితీష్ సంబంధాలు తెంచుకున్నారు. రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకున్న నీతీశ్‌.. ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ క్రమంలోనే గవర్నర్‌ కార్యాలయం నుంచి నేరుగా నీతీశ్‌.. రబ్రీదేవీ నివాసానికి వెళ్లి అక్కడే ఆర్జేడీ నేత  తేజస్వీ యాదవ్‌తో ప్రభుత్వ ఏర్పాటుపై నీతీశ్ చర్చలు జరుపుతున్నారు.

వీరిద్దరూ కలిసి ఇవాళో రేపో గవర్నర్‌ను కలిసే అవకాశాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వీరు గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం.కాగా  కొత్త ప్రభుత్వంలో తేజస్వీ మళ్లీ ఉపముఖ్యమంత్రి అవ్వనున్నారు. తేజస్వి కి హోం శాఖ ఇవ్వొచ్చు అంటున్నారు. 

గతంలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేసి …  విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పట్లో తేజస్వీ డిప్యూటీ సీఎంగా ఉండగా.. లాలూ మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ కూడా మంత్రిగా పనిచేశారు.అయితే వివిధ కారణాల దృష్ట్యా రెండేళ్లకే ఈ కూటమి బంధం తెగిపోయింది.

2017లో ఆర్జేడీ- కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న దరిమిలా  నీతీశ్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ తో  కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జెడీకి 75, బీజేపీకి 74,జేడీ (యు  )కి 43 ,కాంగ్రెస్ కి 19 సీట్లు వచ్చాయి. కమ్యూనిస్టులకు 12 సీట్లు, మజ్లీస్ కి 5 సీట్లు వచ్చేయి. ఈ ఎన్నికల్లో జేడీ(యు) పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వానికి నీతీశ్‌ సారథ్యం వహించారు.

అయితే నితీష్ తన మాట చెల్లుబాటు కావడంలేదని గత కొంతకాలంగా ఆవేదనలో ఉన్నట్లు సమాచారం. తనను రాజకీయంగా బలహీనపరుస్తున్న బీజేపీ  నేతలు తనను ఆ పదవిలో కొనసాగించరనే అనుమానాలు .. ఫీలర్లు ఉండటంతో నితీష్ వేగంగా పావులు కదిపి ఆర్జేడీ తో చేతులు కలిపారు. వారం క్రితం నుంచే తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి. 
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!