తెలుగు రాజకీయాలు vs భాషా దుర్గంధం !

Sharing is Caring...

రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల శ్రేణుల మధ్య కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ దుర్భాషలు, వ్యక్తిగత హననాలు, భావదారిద్య్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. అందులో వున్న భాష ఫలానాది అని నిర్వచించడం కష్టం. అది దుర్భాష అని మాత్రం నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే తెలంగాణ రాజకీయ శ్రేణుల పరిస్థితి చాలా చాలా మెరుగు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండుతో ఒక రాజకీయ ఉద్యమం రావడం ఈ మెరుగైన పరిస్థితికి కారణంగా భావించవచ్చు.

ప్రతి రాజకీయ పార్టీకి ఏర్పాటు లక్ష్యం వుంటుంది. పార్టీ ఏర్పాటు సమయంలోనే దీనికి సంబంధించిన ముసాయిదా ప్రకటన చేస్తారు. అలాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా సార్వత్రిక ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టో ప్రకటిస్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పార్టీ అవగాహన, పరిష్కారానికి తమ విధానంతో పాటు, దీర్ఘకాలిక లక్ష్యాలను, తక్షణ ఉపశమనాలను ఈ పత్రాలలో పొందుపరుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పత్రాలు ఆయా రాజకీయ పార్టీల తాత్విక చింతనను, సామాజికార్థిక రాజకీయ అంశాలపట్ల తమ దృక్పథాన్ని తెలియజేసే ప్రామాణిక పత్రాలు.వర్తమానంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పక్షాలకు, వాటికి ప్రాతినిధ్యం వహించే నాయకులకు ఒహోం ఒహోం అంటూ గుడ్డిగా పల్లకీలు మోస్తున్న శ్రేణులు.. తాము విశ్వాసం కలిగివున్న పార్టీల రాజకీయ చింతన ఏమిటన్న పట్టింపు లేకుండా పోయింది.

రాజకీయ ప్రత్యర్థిపై అవసరం వున్నా లేకపోయినా, సకారణంగా అయినా అకారణంగా అయినా బురదజల్లడం, బట్టకాల్చి మొహంమీద వేయడం ఈ శ్రేణులకు సోషల్ మీడియాలో ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా, ఒక దుర్వ్యసనంగా మారింది. విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని 1988లో తెలుగుదేశం ప్రభుత్వం తీర్మానించి, కాంపసుల్లో విద్యార్థి ఎన్నికలను నిషేధించింది. ఆ నిర్ణయాన్ని చంద్రబాబు ఖాతాలోనే కచ్చితంగా జమచేయాలి. తర్వాత కాలంలో విద్యార్థులకు కూడుపెట్టని ఆర్ట్స్ సబ్జెక్టులు దండగ అని నిర్ధారించి, సైన్సు సబ్జెక్టులకు మాత్రమే ఊతమిచ్చిన ఘనత కూడా చంద్రబాబుదే.నాడు తెలుగుదేశం హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తక్షణ ఫలితాలు అనేకం కలిగిన మాట వాస్తవం. కాలేజీలు అంటే డిగ్రీలు ఇచ్చే కర్మాగారాలు అనే ఎర్రజెండా నినాదాలకు కాలం చెల్లింది. సైన్సు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ విద్యార్థులను కోర్సు పూర్తికాకముందే, క్యాంపసుల్లోనే గాలం వేసి, ముక్కున కరచుకుని వెళ్లే పరిస్థితి అంతర్జాతీయంగా నెలకొని వున్న రోజులవి. సైన్సు డిగ్రీలు చేసిన వాళ్లను వేలు, లక్షల సంఖ్యలో నియమించుకోవడానికి, ఆకర్షణీయ వేతనాలు ఇవ్వడానికి అమెరికా కేంద్రంగా ఐటీ కంపెనీలు పోటీపడుతున్న రోజులవి.

సైన్సు సబ్జెక్టులు తప్ప మరేమీ బోధించని, మరే అవసరాలు నెరవేర్చని శ్రీచైతన్య, నారాయణలాంటి విద్యాసంస్థలు ఈ ఐటీ కొలువుల పండగను ఘనంగానే చేసుకున్నాయి. ఆర్ట్ సబ్జెక్టుల్లో చేరవలసిన తమ పిల్లలను తల్లిదండ్రులు బలవంతంగా ఇంజనీరింగ్ కోర్సులకు మళ్లించారు.ఇవన్నీ నాటి యువతకు అలవోకగా అందివచ్చిన విజయాలు. తమ రాజకీయాలకు పట్టుకొమ్మలాంటి విద్యార్థుల పునాదిని కోల్పోవడం అన్ని రాజకీయ పార్టీలకు మిగిలిన అపజయం.అయితే ఇదే సమయంలో.. నవభారత నిర్మాతలు కావాల్సిన విద్యార్థులు.. డాలరు వ్యామోహంలో గొర్రెల మందలా కొట్టుకుపోయినప్పటికీ, నవ కరెన్సీ కట్టలను భారత ఆర్థిక వ్యవస్థకు అలవాటు చేసింది. అప్పటిదాకా రాజకీయ సంస్కారం, విలువలు, అంతర్జాతీయ పరిణామాల పట్ల లోతైన అవగాహన, భారతదేశ వికాసానికి అవసరమైన విధానాలపై మల్లగుల్లాలు పడి తర్కించి, తమలో తామే సైద్ధాంతిక ఘర్షణ పడే యువతరం కనుమరుగు కావడం మొదలైంది.

మూడు పూటలా కడుపుకి ఆహారభద్రత కల్పించే కొలువులు, వారానికోసారి పొరుగువాడిని తలచుకునే వీలున్న ‘వీకెండ్ మెదళ్ల’తో కొత్త తరం ఆవిర్భవించి, వేళ్లూనుకోవడం మొదలైంది. కడుపు నిండిన ఈ ఐటీ కూలీలే.. తర్వాత కాలంలో సోషల్ మీడియాలో రాజకీయ కూలీల అవతారం ఎత్తారు. మేస్త్రీ కూలీలుగా ప్రమోషన్లు పొందారు, పొందుతున్నారు.మనిషి సంఘజీవి. మనిషి రాజకీయ జీవి. ప్రతి మనిషికి సంఘజీవనం, రాజకీయ జీవనం వుంటుంది. రాజకీయ విశ్వాసాలు వుంటాయి. రాజకీయ విశ్వాసాలు అంటే వైసీపీ పట్ల విశ్వాసం, టీడీపీ పట్ల విశ్వాసం కాదు. నేను ప్రస్తావిస్తున్నది పరస్పరం వేర్వేరు రాజకీయ విశ్వాసాలకు సంబంధించి. రాజకీయ విశ్వాసాన్ని ఏర్పరచుకోవడానికి, నిబద్ధతగా వుండడానికి ఒక వ్యక్తికి ఎంత భావస్వాతంత్య్రం వున్నదో, అందుకు విరుద్ధమైన విశ్వాస నిబద్ధతలు ఏర్పడడానికి వేరొక వ్యక్తికి కూడా అంతే భావస్వాతంత్య్రం వుంటుంది. వుండి తీరాలి.చీటికి మాటికి ఊ అంటూ ఉసిగొల్పుతున్నమేస్త్రీ కూలీలను.. నీవల్ల దేశానికి ఏమిరా ప్రయోజనం బాలరాజూ? అని ప్రశ్నించే రోజులు ఎక్కువ దూరంలో లేవన్నది సత్యం.

రాజకీయ యవనికనుంచి విద్యార్థులను తొలగించాక తెలుగునాట కొత్త రాజకీయ ఈక్వేషన్లు మొదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీలపై చిరకాలంగా గుత్తాధిపత్యం కలిగిన కాంగ్రెస్ పార్టీనుంచి తమకూ కోటా కావాలని మిగతా పార్టీలు మారాం చేయడం మొదలుపెట్టాయి. కులసంఘాల సమావేశాల ద్వారా రాజకీయ మనుగడ నెరపడం కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో వేళ్లూనుకుంటే, దానికి అగ్గిరాజేసి పరాకాష్టకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబునాయుడిది. కులాలను సమీకరించి, కులసంఘాలను బలోపేతం చేసి, రెడీమేడ్ ఓటు బ్యాంకులుగా మలచుకోవడంలో రెండు ప్రధాన పక్షాలు పోటీపడ్డాయి. ఆ రొంపిలోంచి తెలుగు రాజకీయాలు బయటపడి బట్టకట్టడం అసాధ్యమైన వ్యవహారంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత మరికొన్ని రాష్ట్రాలు విద్యార్థి సంఘాల ఎన్నికలను నిషేధించాయి.

విద్యా సంస్థల్లో గుర్తింపు విద్యార్థి సంఘం ఎన్నికలను నిర్వహించి తీరాల్సిందేనని లింగ్డో కమిషన్ ఇచ్చిన నివేదికకు దిక్కులేదు. అటకెక్కిన ఆ ఫైలు బూజు దులపడానికి ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికీ ఆసక్తి లేదు.‘‘యువత రాజకీయాల్లోకి రావాలి’’ అన్న లోక్ సత్తా నినాదం విన్నప్పుడల్లా కొంచెం నవ్వొస్తుంది. ఏ యువత రాజకీయాల్లోకి రావాలి? ఎముకలు కుళ్లిన, వయసు మళ్లిన యువతనా జయప్రకాష్ గారు ఆహ్వానిస్తున్నది? ఇవాళ యువత రాజకీయాల్లోకి రావడం అంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఎంలు, సీఎంల కుమారులు, కుమార్తెలు రాజకీయాల్లోకి రావడం అని కొత్తగా నిర్వచించుకోవాలి.ఏమిరా బాలరాజూ ఈ రాజకీయ యువత వల్ల దేశానికి ప్రయోజనం? అని కొత్తగా ప్రశ్నించుకోవాలి.ప్రజల డబ్బు ప్రజలకే ఇవ్వడానికి మ్యానిఫెస్టోలు అవసరమా శర్మగారూ అని అంటాడొక లీడర్ ఓ సినిమాలో.ఎన్నికలప్పుడు ఓటర్లకు నగదు పంచడం అన్ని పార్టీలకు ఆనవాయితీ. ఈ ప్రక్రియను మరో పెద్ద అడుగు వేయించిన ఘనత మాత్రం తెలుగు రాజకీయ పార్టీలదే.

ఐదేళ్లకోసారి, అది కూడా అభ్యర్థి జేబులోంచి నగదు పంచడం ఒక ఎత్తయితే.. ఐదేళ్ల పాటు ప్రతి నెలా ఫలానా మొత్తాన్ని కోశాగారంనుంచి ప్రజలకు నేరుగా మళ్లించడం వర్తమాన పరిణామం. వీలైనంత ఎక్కువ మందికి నగదు లబ్ధి చేకూరేలా రకరకాల స్కీములు. నగదు లబ్ధి అధికంగా చేకూర్చడమే పరమావధిగా రాజకీయ పార్టీలు ఏడాదికేడాది కొత్త స్కీములు రచిస్తున్నాయి. ఎంత క్యాష్ కొడతారు అన్నదే ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ప్రధానంగా మారిపోయింది. తక్షణ, మధ్యకాలిక సంక్షేమ పథకాలు కొత్త పుంతలు తొక్కి క్యాష్ పార్టీ అయిపోయింది.ఇలాంటి వర్తమాన పరిస్థితుల్లో రాజకీయ విమర్శ అంటే భావ దారిద్య్రాన్ని వెలిబుచ్చడం, భాషా దుర్గంధం వెదజల్లడం తప్ప మరొకటి కాజాలదు.ఏమిరా బాలరాజూ, నీ పార్టీ వల్ల దేశానికి ఏమిటి ఉపయోగం అని గొణుక్కోవడానికి కూడా అవకాశంలేని దీనావస్థ ఓటరు మహాశయులది.

———–  Vasireddy Venugopal  ( last post in face book )

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!