Telangana Hero…………………….
పైడి జయరాజ్ … తెలుగు సినిమాల్లో నటించని తెలంగాణకు చెందిన హీరో..ఆయన బాలీవుడ్ తొలి తరం హీరో అంటే ఆశ్చర్యపోతారు.ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు.
మూకీ యుగంలోనే బొంబాయి చిత్రసీమ కి వెళ్లి సంచలన విజయాలు సాధించిన ఖ్యాతి పైడి జయరాజ్ ది..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లాకు చెందిన జయరాజ్ భారత కోకిల సరోజినీనాయుడు భర్త గోవిందరాజులు నాయుడు కి మేనల్లుడు అవుతారు.చిన్న తనంలోనే వారి కుటుంబం హైదరాబాద్ కొచ్చింది. నిజాం కాలేజీలో చదువుకున్న పైడి జయరాజ్ సినిమాపై మోజుతో 1928 లో బొంబాయి వెళ్లి హీరో అయ్యారు.
హిందీ , ఉర్దూ తదితర భాషల్లో 170 సినిమాల్లో నటించారు. నిర్మాత దర్శకుడిగా కూడా పేరు గడించారు. భారతీయ చిత్ర పరిశ్రమపై తమ ముద్ర వేసిన కొద్దీ మందిలో పైడి జైరాజ్ ఒకరని చెప్పుకోవచ్చు. తెలుగు పరిశ్రమ ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. ఆ కారణంగానే చాలా మందికి ఆయన గురించి తెలియదు.
1931 లో వచ్చిన టాకీ సినిమా ‘ఆలంఆరా’ కంటే ముందు మూకీ సినిమాల్లో జైరాజ్ నటించారు. 1931 లో టాకీల యుగం మొదలైన కొత్తల్లో జైరాజ్ ‘షికారీ’ ఉర్దూ చిత్రంలో నటించారు. తర్వాత శాంతారాం ,పృథ్విరాజ్ కపూర్ హీరోలు గా వెలుగుతున్న కాలంలో జైరాజ్ కూడా పెద్ద హీరోగా పరిశ్రమ చేత గుర్తింపు పొందారు. నిరుపారాయ్,శశికళ, దేవికారాణి ,మీనా కుమారి వంటి హీరోయిన్ల సరసన నటించారు.
జైరాజ్ సుమారు ౩౦౦ అటు మూకీ సినిమాల్లో ఇటు టాకీ సినిమాల్లో నటించారు. హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. 1945 లో ప్రతిమ ,1951లో సాగర్ ,1959 లో రాజఘర్ సినిమాలను డైరెక్ట్ చేశారు. గుజరాతీ, మరాఠీ భాషల్లో కూడ జైరాజ్ నటించారు.షాజహాన్, పృధ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్, చంద్రశేఖర ఆజాద్ లాంటి చారిత్రక పాత్రలను పోషించి ప్రేక్షకులచే శభాష్ అనిపించుకున్నారు.
సావిత్రి అనే పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఈ పెళ్లి కుదిర్చింది పృద్వీ రాజ్ కపూర్. ఆ నాటి ప్రముఖ హీరోలు నిర్మాతలందరికీ ఆప్తుడిగా మెలిగినవాడు ఈ జైరాజ్. 1972 -73 ప్రాంతాల్లో సుప్రసిద్ధ తెలుగు నటుడు చిత్తూరు నాగయ్య తో ఒక సినిమా నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే నాగయ్య మరణంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆయన హీరోగా ఉన్న కాలంలో తెలుగు సినిమాలలో నటించలేకపోవడానికి కారణాలేమిటో తెలియదు.
హిందీ ,ఉర్దూ భాషలపై జైరాజ్ కు మంచి పట్టు ఉండటం మూలానే ఆయన అక్కడే తన కెరీర్ ను కొనసాగించాడని అంటారు. జైరాజ్ బొంబాయి లో ప్రవేశించేనాటికి హిందీ పరిశ్రమలో పోటీ బాగానే ఉంది. ధనిక కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా సినిమాల్లో నటించేవారు.
జైరాజ్ కొన్నాళ్ళు ఒక ఫిలిం కంపెనీలో స్టెంట్ మ్యాన్ గా పనిచేశాడు. ప్రొడక్షన్ కి సంబంధించిన వ్యవహారాలు కూడా నేర్చుకున్నారు.హీరో గా ఉన్న రోజుల్లో మూడు అంతర్జాతీయ చిత్రాల్లో కూడా నటించారు.
భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వం ఆయనను 1980 లో ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ పురస్కారంతో సత్కరించింది. 90 సంవత్సరాల వయసులో 2000 .. ఆగస్టు 11 న జైరాజ్ కన్ను మూసారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆయన గౌరవార్ధం హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతి రెండవ అంతస్తులోని హాలును ఆధునీకరించి ‘పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్’గా నామకరణం చేశారు.
—————KNM