Bhagalamukhi Devi …………………………
తాంత్రిక ఉపాసనలలో భగళాముఖీ దేవి స్థానం చాలా విశిష్టమైనది. భగళాముఖీ దేవి నే బగల,భగళా,వగళ అని కూడా అంటారు. పీతాంబర దేవి, బ్రహ్మాస్వరూపిణి అనే పేర్లతో కూడా పిలుస్తారు. భగళాముఖి దేవి పసుపు వస్త్రాలను ధరించి, గదాధారిణియై మాదనుడనే రాక్షసుని నాలుకను ఛిద్రం చేస్తున్న రూపం లో కనబడుతుంది.
మరి కొన్ని చోట్ల అమ్మవారి రూపం నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. కాళికాదేవి దశ అవతారములలో భగళాముఖీ అవతారం ఒకటని చెబుతారు.పూర్వం భూమండలంపై పాపభారం వలన ప్రళయం సంభవించగా బ్రహ్మ రుద్రాదులు సౌరాష్ట్ర ప్రాంతం లో సమావేశమై పరిష్కారం కొరకు అన్వేషించారు. ఆ సమయం లో అక్కడి హరిద్రా సరోవరం నుండీ భగళాముఖీ దేవి ఉద్భవించి భూమండలాన్ని పరిరక్షించిందని పురాణకథనం.
దేవీ పురాణంలో ప్రస్తావించిన హరిద్రా సరోవరాన్ని పోలిన సరోవరం మధ్యప్రదేశ్..
దాటియాలోని పీతాంబర పీఠం లో ఉంది.భగళాముఖి అవతారానికి సంబంధించి మరొక కథ కూడా ప్రచారం లో ఉంది. మాదనుడనే రాక్షసుడు ఘోర తపస్సుని ఆచరించాడు.
అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు వరం కోరుకోమని అడుగగా, తాను ఏది మాట్లాడితే అది జరగాలని అజేయమైన వాక్శుద్ధి ని కోరుకున్నాడు. అందుకు త్రిమూర్తులు గత్యంతరం లేక సమ్మతించారు. వరం సహాయంతో ఆ రాక్షసుడు ముల్లోకాలనూ నాశనం చేయనారంభించాడు. అప్పుడు ఉగ్రరూపిణియైన కాళిక భగళాముఖి గా అవతరించి అతని నాలుకను ఛిద్రం చేసింది.
శత్రువులను స్థంభింపచేయడం భగళాముఖి లక్షణం. శత్రుపీడలు, ప్రమాదాలు తొలగి పోతాయి. భగళాముఖి దేవి తాంత్రికంగానే కాకుండా సాత్వికంగానూ పూజిస్తారు. భగళాముఖీ దేవిని తాంత్రిక ఉపాసన చేయదలచిన వారైనా, సాత్విక ఉపాసన చేయదలచినవారైనా తప్పని సరిగా గురువు ద్వారా చేయాలి.అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్టించి నియమ నిష్టలతో స్తోత్రాన్ని పఠించాలి.అపుడే దేవి కరుణిస్తుందని అంటారు.
గౌహతి లోని కామాఖ్య ఆలయం లో దశమహా విద్యల ఆలయాలు ఉన్నాయి. వాటిలో భగళాముఖి ఆలయం ఒకటి. హిమాచల్ ప్రదేశ్ లోని బంఖండి లో భగళాముఖి ఆలయం ఉన్నది. మధ్యప్రదేశ్ లోని నల్ఖెడా లోనూ, దాటియా లోనూ భగళాముఖి దేవి ఆలయాలు ఉన్నాయి. తమిళనాడు లో తిరునల్వేలి జిల్లాలో పాపంకుళం లోనూ, కళ్ళిడై కురిచ్చి లోనూ భగళాముఖి దేవిని దర్శించవచ్చు.
ఉత్తర కర్ణాటక లోని సోమాల్పురా లో భగళాముఖి సిద్ధ పీఠం ఉంది. అమ్మవారు అక్కడి సిద్ధుని భక్తికి మెచ్చి స్వయంగా కొలువై ఉన్నదని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయం సుమారు 300 యేళ్ళ నాటిది. నేపాల్ లోని పఠాన్ లో భగళాముఖి ఆలయం ఉంది.అక్కడికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. వైశాఖ శుక్ల అష్టమి భగళాముఖీదేవి అవతరించిన రోజు. ఆరోజుని భగళాముఖి జయంతిగా జరుపుకుంటారు.