China Masta Devi………………………………………..
పై ఫొటోలో కనిపించే ‘తల లేని దేవత’ చిన్నమస్తా ఆలయం జార్ఖండ్ లోని రామ్‌గఢ్ జిల్లాలో ఉంది. దుర్గాదేవీ రూపాల్లో చిన మస్తాదేవి రూపం ఒకటి అంటారు. అమ్మవారి రూపం భయంకరంగా ఉంటుంది. ఈమెను దిగంబర దేవత గా కొలుస్తారు. ఈమెనే తలలేని దేవతగా కూడా పూజిస్తారు.
ఈ దేవికి ఇద్దరు సహచారిణులు ఉన్నారు.వారు ఢాకిని, వర్నిని. వీరు చిన్నమస్తా దేవి శరీరం నుంచి పుట్టినట్లు చెబుతారు. ఈ దిగంబర దేవత శృంగారంలో ఉన్న ఒక జంట మీద నిలబడి ఉంటుంది. తలను నరుక్కుని ఒక చేతిలో తలను పట్టుకుని దర్శనమిస్తుంది.
ఆమె మొండెం నుంచి మూడు రక్తధారలు వెలువడుతుంటాయి. వాటిలో ఒక రక్త ధార ఆమె చేతిలో ఉన్న నోట్లో పడుతున్నట్టు కనిపిస్తుంది..మిగిలిన రెండు ధారలను ఇరువైపులా ఉన్న ఢాకిని, వర్నినిలు తాగుతుంటాయి. చూసేందుకు ఆ రూపం భయంకరంగా ఉంటుంది.
కామం అనే కోరికను అణచివేసే శక్తిరూపం కాబట్టి దేవి ఇక్కడ దిగంబరంగా దర్శనమిస్తుందని అంటారు. ఈ ఆలయానికి సంబంధించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ తాంత్రిక పూజలు కూడా జరుగుతాయి.
అమ్మ వారి ఫోటోలు బయట ఎక్కువగా కనబడవు. దేవి చిత్రాలు ఇళ్లలో పెట్టుకోరాదని .. అశుభాలు జరుగుతాయని అంటారు. అందుకే దేవి చిత్రాలు అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ అది అసత్య ప్రచారమే అని స్థానికులు చెబుతారు.రామ్ఘడ్ జిల్లా రాఙరప్ప పట్టణంలోని రామ్‌గఢ్ కంటోన్మెంట్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో చిన్నమస్తా ఆలయం ఉంది.
దామోదర్ .. భేరా అనే రెండు నదుల సంగమం వద్ద ఒక చిన్న కొండపై ఆలయం ఉంది. ఏడాది పొడవునా భక్తులు దేవిని దర్శిస్తుంటారు. అక్టోబర్ .. మార్చి మధ్య వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది.ఈ ఆలయానికి సమీప విమానాశ్రయం రాంచీ. విమానాశ్రయం వెలుపల నుండి బస్సులు.. టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైలులో ప్రయాణించే వారు దేవాలయం నుండి 28 కి.మీ దూరంలో ఉన్న రామ్‌గఢ్ రైల్వే స్టేషన్ వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. స్టేషన్ నుంచి టాక్సీ… బస్సులు దొరుకుతాయి.