తాంత్రిక దేవతలు! (1 )

Sharing is Caring...

Tantrik temples and Deities…………………………..

తాంత్రిక పూజలకు మనదేశంలో కొన్ని ఆలయాలు పేరు గాంచాయి.ఈ తాంత్రిక పూజలను అందరూ విశ్వసించరు. మరికొంతమంది గట్టిగా నమ్ముతారు. నమ్మేవారు అత్యంత నియమ నిష్టలతో ఈ పూజలు చేస్తుంటారు. ఈ పూజలు చేయడానికి అనువైన ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి. వీటినే తాంత్రిక ఆలయాలు అంటారు.

ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి తాంత్రిక మంత్రాలతో నియమ బద్దంగా కొంతమంది దేవతలను పూజిస్తారు. వాస్తవానికి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి .. మంచి ఫలితాలను పొందడానికి తంత్రాన్ని ఉపయోగించాలి.కానీ దురదృష్టవశాత్తూ చాలా మంది వ్యక్తులు తంత్రాన్ని ప్రతికూలంగా భావిస్తారు.

ఈ తాంత్రిక పూజలు ఇప్పుడేదో కొత్తగా మొదలైనవి కావు.  వేల ఏళ్ళ నుంచి ఇవి జరుగుతున్నాయి.  కొన్ని దేవాలయాలు కేవలం ఆధ్యాత్మికను పెంపొదిస్తుండగా మరికొన్ని ఆలయాలు తాంత్రిక శక్తిని పొందే కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి.ఈ ఆలయాలకు అఘోరాలు ..తాంత్రికులు ఎక్కువగా వస్తుంటారు. దేశవ్యాప్తంగా ఈ ఆలయాలున్నాయి.

తాంత్రిక దేవతలలో చాముండి ఉగ్ర రూప ధారిణి.. శక్తి స్వరూపిణి. అమ్మవారి సప్త మాతృకలలో ఒకరు. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో యోగిని చాముండి కీలక దేవత అని చెబుతారు. తాంత్రిక ప్రక్రియలో ఉపాసకులు ఎక్కువగా చాముండిని కొలుస్తారు. సప్త మాతృకలలో మిగిలిన వారిని వారి వారి భర్తల శక్తి స్వరూపాలుగా పూజిస్తారు. ఒక్క చాముండిని మాత్రం ప్రత్యేకంగా కొలుస్తారు.

మన దేశంలో ఉన్న చాముండేశ్వరి ఆలయాలలో రెండు ఆలయాలు ప్రత్యేకమైనవి .. వాటిలో మొదటిది హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా కు దగ్గరలో ఉన్న పాలంపూర్ లో ఉన్నది.ఇక్కడ దేవిని రుద్ర చాముండి గా కొలుస్తారు. ఈ చాముండీని గిరిజన దేవతగా భావిస్తారు. జంతు బలులు ఇస్తారు. తాంత్రిక పూజలు చేస్తూ ఈ దేవిని ప్రార్ధిస్తారు. ఇదే ప్రాంతంలో మరో చాముండి ఆలయం కూడా ఉంది. యాత్రికులు పెద్ద సంఖ్యలో ఈ దేవిని దర్శిస్తుంటారు.

ఇక రెండవ చాముండి ఆలయం కర్ణాటక రాష్ట్రం మైసూరులో ఉన్నది. ఇక్కడ దేవిని చాముండేశ్వరి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు మైసూర్ రాజ వంశీకుల కులదేవతగా పూజలందుకుంటున్నది. దసరా ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి.  పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు మరణం లేని వరాన్ని కోరుతూ ఘోర తపస్సు చేస్తాడు..

అయితే అది అసాధ్యమని బ్రహ్మ చెప్పగా  స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణం లేని వరం కావాలని అడుగుతాడు మహిషాసురుడు. నాడు బ్రహ్మ ఇచ్చిన వరం ప్రభావంతో ముల్లోకాలను జయించి దేవతలను, ఋషులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు.

ప్రజాకంటకుడిగా మారిన మహిషాసురుడిని  సంహరించడానికి  ఆ జగన్మాతే చాముండేశ్వరిగా అవతరించి … అతగాడిని సంహారిస్తుంది. ఈ క్రమంలోనే చాముండేశ్వరి ని  మహిషాసుర మర్ధినిగా కూడా కొలుస్తారు. ఈ మహిషాసురుడు పాలించిన ప్రాంతం మహిషాసుర పురం గా మారింది. అదే కాలక్రమేణా మైసూరుగా స్థిరపడింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!