మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలిపి వేసింది. నవనీత్ కౌర్ హైకోర్టు తీర్పును సవాల్ చేయడం తో సుప్రీం స్టే ఇచ్చింది.
కాగా 75 ఏళ్ళు గడిచిపోయినా….. ఇంకా.. వ్యవస్థ బాలారిష్టాల్లోనే ఉన్నది. వినడానికి, చెప్పడానికి అంగీకరించడానికి, మనస్కరించకపోయినా, బాధ కలిగించినా, ఆశ్చర్యకరమైనదైనా, ఇది మాత్రం నిజం. 1947 తరువాత దాదాపు 15 సార్వత్రిక ఎన్నికలను నిర్వహించుకున్న ఘనత స్వతంత్ర భారతం . ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద జనాభా కలిగిన దేశం.అనేక భాషలతో, భిన్నసంస్కృతులతో ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ ఒకే దేశంగా నిలిచిన ఆదర్శ సమాజం. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.
‘తెల్ల’ పాలకులు వెళ్లిపోయినప్పటికీ చాలా వ్యవహారాలను చక్కదిద్దుకోలేకపోయాం. అని చెప్పడానికి నవనీత్ కౌర్’ ఉదంతం ఓ ఉదాహరణ అని చెప్పాలి.ఆమె రెండేళ్ల క్రితం అమరావతి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికయ్యారనేది ఆమె పై మోపిన అభియోగం. ఈ మేరకు ఒకాయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ కు ఆమె సమర్పించినవి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలేనని కోర్ట్ నిర్దారించింది. ఆ ఎన్నిక చెల్లదని న్యాయస్థానం ప్రకటించింది కూడా. నిజానికి ఆమె పంజాబీ. ఆ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తే. ఓ మరాఠీని పెళ్లాడి మహారాష్ట్ర లోని అత్తవారింటికి వచ్చారు. మహారాష్ట్రలో మాత్రం ఆ కులం షెడ్యూల్డ్ కులాల్లో లేదట.లేక పోవచ్చు. కాకపోవచ్చు. అది ఆవిడకు సంబంధం లేని అంశం. ఆవిడ మాత్రం షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తే కదా.
మహారాష్ట్రలో ఆ కులం షెడ్యూల్డ్ కులాల్లో లేకపోయినంత మాత్రాన ఆవిడ ఆ వర్గానికి చెందకుండా పోతుందా? కానీ ఇదే అక్కడ సమస్యగా మారింది.ఇది మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఒక వేళ తెలియకున్నా ఆ కులం మహారాష్ట్రలో షెడ్యూల్డ్ కులం అని ఎలా నిర్దారించింది. సర్టిఫికెట్ ఇచ్చే ముందు క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలి కదా. కుల,ఆదాయ సర్టిఫికెట్లు పొందడానికి ఎంత ప్రయాసపడతారో దేశంలోని కోట్లాది మంది సాధారణ పొరులకు అనుభవపూర్వకంగా తెలుసు. మరి ఈవిడకు రాష్ట్ర జాబితాలో లేని కులానికి సర్టిఫికెట్ ఎలా ఇచ్చారనేది ఇక్కడ ప్రశ్న.
ఆవిడ పోటీ చేయడం తొలి సారి కూడా కాదు ఆవిడ అంతకు ముందు కూడా అసెంబ్లీ కీ పోటీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి కేసోకటి తేలేసరికి ఏళ్ళు గడిచిపోయాయి. తెలంగాణ ఎమ్మెల్యే ఒకరు విదేశీ పౌరుడు అనే కేసు అనేక ఏళ్లుగా నడుస్తూనే ఉన్నది. ఆయన ఇప్పుటి వరకు మూడు మార్లు అసెంబ్లీకీ ఎన్నికయ్యారు. ఆయన భారతీయుడా? జర్మనీ పౌరుడా? అనేది ఇంకా తేలలేదు. ఇంకా ఇలాంటి కేసులెన్నో కోర్టుల్లో నలుగుతూనే ఉన్నాయి.
కొన్ని కేసులైతే ఎన్నికైన వారి పదవీ కాలాలు ముగిసిన తరువాత తీర్పులు వచ్చిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. లోపం ఎక్కడ ఉన్నట్లు? ఎన్నికల వ్యవస్థలోనేనా? ఇన్ని కేసులు నలుగుతున్నా సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదేందుకు?విశాలమైన దేశం,విస్తృతమైన యంత్రాంగం కలిగిన అతి పెద్ద ఈ ప్రజాస్వామ్యానికి ఇదొక సమస్యే కాదు. సంకల్పం లోపించడం, చిత్తశుద్ధి లేకపోవడం , ఏవో సంకుచిత రాజకీయ ప్రయోజనాలే కారణం అని భావించవలసి వస్తున్నది. ఇలాంటి చిన్న లోపాలను కూడా సరిదిద్దుకోలేకుంటే ఈ దేశం ప్రజాస్వామ్యంగా ఎలా మన గలుగుతుంది? నిజమైన ప్రజాప్రాతినిధ్య వ్యవస్థగా ఎలా నిలబడుతుంది?
——————— Govardhan Gande