సుమ పమిడిఘంటం……………………………..
ప్రముఖ నాటకరంగ దర్శకుడు, విలక్షణ నవలారచయిత, మిత్రుడు, శ్రేయోభిలాషి, నాటకం, సాహిత్యం తప్ప వ్యక్తిగత జీవితం బొత్తిగా తెలియని అమాయకుడు . ఈ మాటంటే చాలమంది నోరెళ్ళబెడతారు కానీ నిజజీవితంలో నిస్సందేహంగా అమాయకుడే, సాహిత్య నాటకరంగాలలో ఉద్దండుడే గావచ్చు.
ఆత్మవిశ్వాసం, పొగరనుకోవచ్చు. నిజానికి పొగరు అనేమాటకు అర్ధం తెలియనివాడు సుందరం ప్రయోగశీలి, నాటకంలోకి జొరబడి చేజిక్కిన రచనా విన్యాసాన్ని చేతులారా జారవిడిచిన వాడు తల్లావజ్ఝల సుందరం అందరిని వదిలి కనిపించని లోకాలకు వెళ్ళిపోయాడు.
ఇద్దరు మహాకవుల మనుమడు సుందరం. పితామహులు శివశంకర స్వామిగారైతే .. మాతామహులు బారిష్టర్ పార్వతీశం రాసిన మొక్కపాటి నరసింహశాస్త్రి.సుందరం తండ్రి కృత్తివాస తీర్థులు గారు గొప్పకవి రచయిత. వీరు అనేక గ్రంథాలతోపాటు హిందూమహాయుగం, బౌద్ధమహాయుగం రెండు పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలు రాశారు.
వారు M.A(history),M.A(tel), M.A(sans) చదివి ఒంగోలు శర్మాకాలేజీలో సంస్కృత అధ్యాపకులుగా చేశారు.సుందరం తాత గారు శివశంకరస్వామి వారు పలుభాషలలో కవి, పండితులు. వీరిని సాహితీ సభాపతి అంటారు.వీరు బౌద్ధ జాతక కథలను పాళీభాషనుంచీ తెలుగులోకి అనువదించారు.
బోలెడు కవిత్వం, నాటకాలు, వ్యాసాలు రాశారు. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలకు చలం యోగ్యతాపత్రం ఎలాగో అలాగ చలం ‘శశిరేఖ’ నవలకు ముందుమాట, దేవులపల్లి వారి కవితాఖండికలకు ముందుమాట రాసి ఆంధ్రదేశానికి పరిచయం చేశారు.
తల్లావజ్ఝుల సుందరానికి వారి తాతగారు పెట్టిన పేరు సుందరేశ్వర్. సుందరం ఒంగోలులో మెట్రిక్ ఆపై మేనమామవద్ద అనకాపల్లిలో B.Sc. చదివి హైదరాబాదు నిజాం కాలేజిలో థియేటర్ ఆర్ట్స్ తనికెళ్ళ భరణి తో పాటు చదివాడు. అక్కడ వారిద్దరి స్నేహం పెనవేయబడింది.
1970 లలో సుందరం రాసిన గొప్ప నవల ‘ఉదయాగమం’ జ్యోతి మంత్లీ నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. ఆరోజుల్లో ఐదువేల రూపాయల నగదు ఇచ్చారు.తనికెళ్ళ భరణి రాసిన అన్ని నాటకాలకు సుందరమే దర్శకత్వం వహించి పేరుప్రఖ్యాతులు పొందారు ఉమ్మడిగా .
ప్రయోగ నాటకానికి, వీధి నాటకానికి పెద్దగా పేరుమోసి ‘పెద్దబాలశిక్ష’, ‘కొక్కొరకో’ నాటికలను పలుప్రదర్శనలిచ్చి ప్రఖ్యాతి పొందాడు.భరణి రాసి సుందరం దర్శకత్వం చేసిన ‘గోగ్రహణం’ జాతీయ స్థాయిలో (NSD) తిరువనంతపురంలో ఆడి తెలుగు నాటకసత్తా ను చూపాడు సుందరం.
కేవలం రెండు మూగ పాత్రలతో ‘జంబూద్వీపం’ భరణి చేత రాయించి అద్భుతమైన ప్రయోగంచేశాడు. నాటకంలో దేశానికి సందేశం, జనానికి ఏమీ తెలిదయనుకుని మనం హితోపదేశం ఇవ్వటమంత అవివేకం లేదని చాలా ఎర్లీ గా తెలుసుకున్న ఏకైక తెలుగు నాటక దర్శకుడు తల్లావజ్ఝుల సుందరం.
పతంజలి శాస్త్రి రాసిన ‘సూదిలోనుంచి ఏనుగు’, మాధవి నాటకాలు, నాచేత రాయించిన ‘రాళ్ళెత్తని కూలీలు’ నాటికలు సుందరం ఆఖరి ప్రయోగాత్మకాలు. నిమ్మగడ్డ నరసింహయ్య మేనల్లుడు ఎడ్యుకేషన్ టి.విలో ఉద్యోగించే ఏ.వి.యస్ చలపతిరావు చేత ‘ఈహామృగం’ రాయించాడు సుందరం.
రొటీన్ నాటకంమీద మొహంమొత్తిన సుందరం చేవకు, తెలుగునాటక ప్రేక్షకులకు హాస్యంమీదున్న యావకు అదృష్టవశాత్తు ‘శంకరమంచి పార్థసారధి’ అనే బ్రహ్మాండమైన హాస్య నాటక రచయిత దొరికాడు. ఇకచూడండి! ఒకటే హస్యనాటకాల జోరు. నవ్వులకొద్దీ హాస్యాన్ని ప్రేక్షకులమీద కుమ్మరించీ, కుమ్మరించి, కుమ్మరించీ…… ఇకరాయలేను సుమా!