Real Leader……………………………….
ప్రముఖ గాంధేయ వాది, నీతి నిజాయితీలకు మరో పేరు .. విద్యాదాత మూర్తి రాజు గురించి ఈ తరంలో చాలా మందికి తెలియదు.ఆయన పూర్తి పేరు చింతలపాటి సీతారామచంద్ర వర ప్రసాద మూర్తి రాజు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురంలో ఆయన జన్మించారు. చిన్నవయసు నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
కళలంటే ఆయనకు ప్రాణం. మద్యపాన మహమ్మారిపై పెద్ద ఎత్తున పోరాడారు. అప్పట్లోనే 965 కి. మీ పాదయాత్ర చేశారు. ఆంధ్రా గాంధీ గా పేరు తెచ్చుకున్నారు. సామాజిక, రాజకీయ, సేవారంగాల్లో గొప్ప సేవలు అందించారు. భావితరాలకు స్ఫూర్తి దాతగా నిలిచారు.
మూర్తిరాజు చిన్నతనంలో ఒకరోజు చేబ్రోలు వెళ్లారు. అనుకోకుండా అక్కడి రైల్వేస్టేషన్‌లో మహాత్మాగాంధీని చూశారు. ఆ క్షణంలోనే ఆయనంటే ఎనలేని అభిమానం ఏర్పడింది. అప్పటినుంచి గాంధేయ వాది గా మారారు. అప్పటి నుంచి మూర్తిరాజు శాకాహారమే తీసుకునేవారు. ఖద్దరు దుస్తులు ధరించేవారు.
ఆ రోజుల్లో ప్రజలపై గాంధీ ప్రభావం ఎక్కువగా ఉండేది. గాంధీ సిద్ధాంతాలపై తరచుగా చర్చలు జరుగుతుండేవి. కొంతమంది ఈ సిద్ధాంతాలపై అధ్యయనం కూడా చేసేవారు. అలాంటి వారి కోసం అన్ని సౌకర్యాలతో కూడిన భవనాన్ని పెదనిండ్రకొలను లో గాంధీ భవన్ పేరిట కట్టించారు. ఇది చూడటానికి పార్లమెంట్ భవనంలా కనిపిస్తుంది.
1969లో ఆనాటి ఉపప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ భవన శంకుస్థాపనకు వచ్చి వెళ్లారు. ఇలాంటి భవనం సౌత్ ఇండియాలో మరెక్కడా లేదు. మహిళలు చదువుకుంటే కుటుంబంలో చైతన్యం తెస్తారని ..ఇంటిల్లిపాదికీ జ్ఞానం అందిస్తారని మూర్తిరాజు నమ్మకం. మహిళలను చదువుకోమని ఆయన ప్రోత్సాహించేవారు. ఆ రోజుల్లో ప్రభుత్వపరంగా విద్యా సౌకర్యాలు లేకపోవడం తో తానే స్వయం గా రంగంలోకి దిగి తండ్రి పేరిట ‘బాపిరాజు ధర్మసంస్థ’ను ప్రారంభించారు.
68 విద్యాసంస్థలను భవనాలతో సహా నిర్మించారు. వాటిని ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పటికీ ఆ విద్యా సంస్థలలో విద్యార్థులు చదువుకుంటున్నారు. తండ్రి బాపిరాజు నుంచి వచ్చిన 1,800 ఎకరాల భూమిని పూర్తిగా సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు.
ఏలూరులో సెయింట్ థెరిసా విద్యాసంస్థలకు వంద ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చారు. నాటి భూదాన ఉద్యమంలో పాల్గొని వినోబాభావేకు వంద ఎకరాల భూమి ఇచ్చారు. ఎందరో పేద కళాకారులకు ఆర్థిక సహాయం అందించారు. ఎన్నోసేవా కార్యక్రమాలు నిర్వహించిన మూర్తి రాజు మరణించే నాటికి ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. పుట్టుకతో కోటీశ్వరుడు అయిన మూర్తి రాజు ప్రజాసేవకు ప్రాధాన్యమిచ్చేవారు.
1952-1982 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓ పర్యాయం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీవీ క్యాబినెట్లో గిడ్డంగులు, దేవాదాయ శాఖల మంత్రిగా చేశారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించారు. 70 వ దశకంలో జిల్లాలో ఆయన మాటే వేదం. ఎమర్జెన్సీ అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు మూర్తి రాజు ఇందిరా కాంగ్రెస్‌లో చేరారు.
పార్టీని విజయపథంలో నడిపించారు. 1978లో తాడేపల్లిగూడెం నుంచి ఎన్నికైన ఆయన.. రాజకీయాలకు పలువురు కొత్త ముఖాలను పరిచయం చేశారు. అప్పట్లో పశ్చిమగోదావరి జిల్లా నుంచి మొత్తం 16 అసెంబ్లీ స్థానాలను ఇందిరా కాంగ్రెస్ గెలుచుకుంది. నెహ్రు కుటుంబం అంటే ఆయనకు చాలా అభిమానం. ఢిల్లీ వెళ్లి ఇందిరా గాంధీ ని కూడా పలుమార్లు కలిశారు.
మూర్తి రాజు విద్యా జోతి అనే విద్యా మాసపత్రికను కూడా తీసుకొచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో ప్రచురించేవారు. భూదాన్ ఉద్యమ సమయంలో సర్వోదయ మాసపత్రిక సంపాదకత్వ బాధ్యతలు ఆయన స్వీకరించారు. నాస్తిక ఉద్యమ నేత లవణం తో కల్సి మూర్తి రాజు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మద్య నిషేధం కోసం ఆయన అనేకసార్లు ఉద్యమించారు. 1919 డిసెంబరు 16న ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా లో జన్మించిన మూర్తిరాజు 2012 నవంబరు 12న 93వ ఏట కన్నుమూశారు.