ప్రముఖ కవి సినారె అన్నట్టు ‘ఇంతేలే నిరుపేదల బ్రతుకులు/ అవి ఏనాడూ బాగుపడని అతుకులు’ .
కొంతమంది పాలిట పేదరికం పెద్ద శాపం గా మారింది. పేదరికం .. దిగజారిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా వ్యభిచారం పెరిగిపోతున్నది.పేదరికం లో ఉన్న అమ్మాయిలివి కనీసం చదువులకు కూడా నోచని బతుకులు. కొందరు ఎలాగోలా కష్టపడి హైస్కూల్ విద్య ముగించి కాలేజీ చదువు కోసం పట్టణానికి వెళితే అక్కడ కొంతమంది వీరిని ట్రాప్ చేసి వ్యభిచారం లోకి దించుతున్నారు.
ఫ్రెండ్స్ .. తెలిసినవారు తెలివిగా ఎరవేసి,మభ్యపెట్టి అమ్మయిలను సెక్స్ వృత్తిలోకి లాగుతారు. అడపా దడపా చేస్తే తప్పేమి లేదు. ఆర్ధిక ఇబ్బందులు ఉండవని మభ్య పెడతారు. విలాసవంతమైన జీవితం గడపవచ్చు అంటూ మాయ మాటలు చెప్పి అమ్మయిలను ఆకర్షిస్తారు.అడపా దడపా అన్నది కొన్ని రోజులు పోయాక రెగ్యులర్ అయిపోతుంది. తర్వాత ఆ ఊబిలో అమ్మాయిలు చిక్కుకుపోతారు.
ఈజీ మనీ , తద్వారా వచ్చే సౌకర్యాలకు ఆకర్షితులై చాలామంది అమ్మాయిలు సెక్స్ వర్కర్లుగా మారిపోతారు. పోతున్నారు. ఎవరికి తెలియ కుండా గుట్టు చప్పుడుగా వృత్తి కొనసాగిస్తారు. సాగిస్తున్నారు. పగళ్లు కాలేజీలకు వెళ్లి చదువుకుంటూ .. రాత్రిళ్ళు సెక్స్ వృత్తి చేస్తారు. తమ అవసరాలకు సరిపడా సంపాదించుకుంటారు. మరి కొంతమంది ఈ వృత్తి తో కుటుంబాలను కూడా పోషిస్తారు. కుటుంబాలకు ఆ విషయం తెలీకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
కొంతమంది అమ్మాయిలు పార్ట్ టైం వర్క్ గా సెక్స్ వర్క్ చేస్తూ చదువులు పూర్తయ్యాక వృత్తిని వదిలేసి ..ఏదో ఒక ఉద్యోగం /ఉపాధి వెతుక్కుని పెళ్లి కూడా చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతుంటారు. ఇంకొంతమంది డబ్బు ద్వారా వచ్చే లక్జరీ లైఫ్ కి అలవాటు పడిపోతారు.ఈ తరహా కొత్త జీవితానికి అలవాటు పడ్డ వారు ఇక వృత్తి వదలలేరు. అందులో మగ్గిపోతుంటారు.
ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకు మారుతూ అంద చందాలు కరిగిపోయే వరకు అదే వృత్తిలో జీవిస్తారు. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోయిందో అప్పటినుంచి కొత్త అమ్మాయిలను ఆకర్షించి .. వాళ్ళను వృత్తిలోకి దించుతుంటారు. వాళ్ళను అడ్డం పెట్టుకుని సంపాదిస్తుంటారు. వీళ్ళనే బ్రోతల్ మేడమ్స్,బ్రోకర్లు,దళారులు, పింప్ అంటారు.
వీళ్ళలో కూడా స్థాయి బేధాలు ఉంటాయి. కొంతమంది ఒకరిద్దరితో .. మరికొంతమంది ఎక్కువమందితో వ్యాపారం చేస్తుంటారు. టెక్నాలజీ పెరిగాక …సెల్ ఫోన్లు అందుబాటు లో కొచ్చాక సెక్స్ వృత్తిలో కూడా ఆధునిక పోకడలు మొదలైనాయి. పేస్ బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాలు సెక్స్ వర్కర్లకు బాగా ఉపయోగ పడుతున్నాయి.
ప్రస్తుతం చదువుకునే అమ్మాయిలలో, కొంచెం అందం చందం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువ. ఈ తరహా వ్యాపారం వాస్తవానికి కొత్తదేమీ కాదు. గత కొంత కాలంగా బాగా పెరిగిపోయింది. చదువుకుంటున్న అమ్మాయి అంటే విటులకు అదో క్రేజ్ అంతే.
ఈ బలహీనతను అడ్డం పెట్టుకుని బ్రోకర్లు జోరుగా బిజినెస్ సాగిస్తుంటారు. పగలు స్టూడెంట్స్ గా రాత్రిళ్ళు సెక్స్ వర్కర్స్ గా చేసే అమ్మాయిలంతా తమ ఐడెంటిటీని సీక్రెట్ గానే ఉంచుకుంటారు. అందుకనే వీరిని సీక్రెట్ సెక్స్ వర్కర్స్ అంటారు. వీరంతా పొట్ట కూటి కోసమే ఇందులోకి దిగుతారు.
ఇక జల్సాలు .. విలాసాల కోసం సెక్స్ వర్కర్స్ అవతారమెత్తే వారు కూడా లేకపోలేదు. పేదలంతా ఈ వృత్తిలోకి రావడం లేదు కానీ కొంతమంది ఆర్ధిక పరిస్థితుల మూలంగా .. అవసరాల నిమిత్తం ఈ వృత్తిలోకి వచ్చి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. కొంతమంది పోలీసులుకు దొరికి పోయి రెస్క్యూ హోమ్స్ కి వెళుతున్నారు.
అక్కడ నుంచి బయటపడ్డాక కొందరు ఇళ్లకు వెళ్లి పెళ్లి చేసుకుని కాపురాలు చేసుకుంటారు. మరి కొందరు మళ్ళీ ఇదే వృత్తిలోకి దిగుతుంటారు. కేవలం కొద్దీ మంది మాత్రమే కొంత కాలం వృత్తిలో ఉండి సంపాదించుకుని తర్వాత వృత్తికి దూరంగా ఉంటున్నారు. ఏదైనా అవసరాల కోసం ఈ వృత్తి లోకి దిగేవారి జీవితాల్లో మనకు తెలియని ఎన్నో వ్యధలు .. కథలు ఉంటాయి.
————– KNM