Bhoot Bungalow ...........................
ప్రపంచంలో దెయ్యాలు, భూతాల కథలతో ముడిపడిన మహళ్ళు ,ప్యాలెసులు,పురాతన భవనాలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ పట్టణంలోనూ అటువంటి మహల్ ఒకటి ఉంది. సూర్యాస్తమయం తర్వాత ఈ మహల్ వద్దకు ఎవరూ వెళ్లరు. అక్కడికి వెళ్లాలంటే భయంతో వణికిపోతారు.
ప్యాలెస్ పరిసరాల్లో రాత్రివేళ విచిత్రమైన శబ్ధాలు వస్తుంటాయి. భవనంలో పెద్ద ఎత్తున పార్టీలు జరుగున్నట్లు రాత్రి వేళ ఏవో శబ్ధాలు వస్తుంటాయని స్థానికులు చెబుతారు. 1927లో రాజస్థాన్‌కు చెందిన ఒక హిందూ వ్యాపారి నిర్మించిన ఈ ప్యాలెస్‌ను పాకిస్తాన్ సర్కారు మ్యూజియంగా మార్చివేసింది. అయినప్పటికీ ఇపుడు కూడా రాత్రి వేళ ఇక్కడకు వెళ్లే సాహసం ఎవరూ చేయరని పాకిస్తాన్‌కు చెందిన లోకల్ డిజిటల్ పబ్లికేషన్ బ్రాండ్ సినారియో చెబుతోంది.
ఈ ప్యాలెస్ నిర్మాణ విషయానికి వస్తే 1927లో రాజస్థాన్‌కు చెందిన శివరతన్ చంద్రరతన్ అనే మార్వాడీ వ్యాపారి భార్యపై తనకున్న ప్రేమకు గుర్తుగా ఈ ప్యాలెస్ ను కట్టించారు. శివరతన్ చంద్రరతన్ దంపతుల ప్రేమ కథ అటు పాక్‌లోనూ, ఇటు భారత్‌లోనూ వినిపిస్తుంటుంది. పెళ్లయిన కొన్నాళ్ళకు శివరతన్ చంద్రరతన్ మొహట్టా భార్య తీవ్రమైన వ్యాధి బారిన పడింది.
సముద్రపు గాలి తగిలే ప్రాంతంలో ఆమెను ఉంచితే, ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు ఆ వ్యాపారికి సూచించారు. వారి సలహా మేరకు ఆ వ్యాపారి రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ప్రముఖ కళాకారులను పిలిపించి, ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ఆ సమయంలో ఈ ప్యాలెస్‌లో లెక్కకుమించిన సంఖ్యలో విందువినోద కార్యక్రమాలు జరిగేవని చెబుతుంటారు. ఈ ప్యాలెస్ ను మొహట్టా ప్యాలెస్ లేదా హిందూ వ్యాపారి ప్యాలెస్ అని పిలుస్తారు.
ఈ మొహట్టా మహల్ కింది భాగంలో ఒక సొరంగం ఉంది. అందులోంచి కరాచీలోని ఒక ప్రముఖ హిందూ దేవాలయానికి చేరుకోవచ్చు. శివరతన్ చంద్రరతన్ మొహట్టా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆలయానికి చేరుకునేందుకే ఈ సొరంగం నిర్మించారట.
ఈ మార్గం గుండానే మొహట్టా ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తుండేవారట. స్థానికుల సమాచారం ప్రకారం బ్రిటీష్ పాలనా కాలంలో ఈ ప్యాలెస్ పలు అక్రమ కార్యకలాపాలకు నిలయంగా ఉండేదని, అందుకే దీనికి భూతాల నిలయం అనే పేరు వచ్చింటారు. ఈ మ్యూజియం సందర్శనకు ప్రజలు ఓ మాదిరి సంఖ్యలో వస్తుంటారు.