అనుకోకుండా కొన్ని సుందరమైన దృశ్యాలు మన కళ్ళకు సాక్షాత్కరించినపుడు ఉన్నపళంగా మనసు మధురోహాల్లో తేలిపోతుంది.గుండె గదిలో చెరగని చిత్రమై జీవితాంతం గుర్తుండిపోతుంది.నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాను. చీకటి తెరల్ని చీల్చుకుని వెలుతురు కిరణాలు నెమ్మనెమ్మదిగా భువికి చేరుతూ, తూరుపు తెల్లారుతున్న వేళ… ఆ సమయంలో…డాబాపైకి వచ్చిన నాకు పక్కింట్లో సాంప్రదాయ దుస్తులైన లంగా ఓణిలో తులసికోటకు పూజచేస్తూ, అప్పుడే తుషార బిందువులతో స్నానించి అరవిరిసిన ముద్ద మందారంలా ముగ్ధ మనోహరంగా కనిపించిందా అమ్మాయి.
చందమామ వెళుతూ వెళుతూ నేలపైకి దిగి ఓసారలా తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లనిపించింది నాకు.ఆ అందమైన దృశ్యాన్నే చూస్తూ అలా ఉండిపోయాను. ఎంతసేపలా ఊహల లోకంలో విహరించానో నాకే తెలియదు.చింటూ పిలవడంతో ఈ లోకంలోకొచ్చి డాబాదిగి కిందికి వెళ్ళిపోయాను.చింటూ మా అక్క కొడుకు.మా పక్కింట్లో ఇంతకుముందు ఉండేవాళ్ళు ఉద్యోగ నిమిత్తం ట్రాన్స్ ఫర్ అయ్యి ఆ ఇంటిని ఖాళీచేసి చాలా రోజులయ్యింది.నేనెప్పుడు చూసినా ఆ ఇల్లు మనిషి అలికిడిలేక నిశ్శబ్దంగా ఉండేది. టిఫిన్ చేస్తున్నప్పుడు ఆ విషయమే అడిగాను అక్కని.
“ఓహ్ అదా… వాళ్ళు ఆ ఇంట్లోదిగి వారం రోజులవుతోందిరా విక్కీ! పరిచయం చేసుకుందామంటే ఇంట్లో పనుల వత్తిడి వలన కుదరలేదు.మొన్నెప్పుడో బట్టలు ఆరేద్దామని డాబాపైకి వెళ్ళినపుడు ఆ ఇంట్లో ఓ ముసలాయన, ముసలావిడ, వాళ్ళ మనవరాలనుకుంటా…ఓ అమ్మాయి కనిపించింది.అన్నట్లు…ఆ అమ్మాయి చాలా అందంగా ఉందిరా విక్కీ…” తనకు తెలిసిన సమాచారాన్ని చెబుతోంది అక్క. ‘తొలిచూపులోనే ప్రేమలో పడటం’ అన్న ఫీలింగ్ ఇంతకుముందు సినిమాల్లో చూడటం, కథల్లో చదవడమే తప్ప స్వతహాగా నేనెప్పుడూ అనుభూతించలేదు.ఇదిగో ఇప్పుడు ఆ అమ్మాయిని చూశాక ఆ ఫీలింగ్ నా మనసు మొత్తం కమ్మేసింది.
******************
అప్పటివరకు ప్రశాంతంగావున్న నగరం ఆ వార్తవిని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో అలెర్ట్ ప్రకటించడంతో ప్రధాన రహదారులన్నీ జన సంచారంలేక నిర్మానుష్యంగా మారిపోయాయి.ఏదైనా ముఖ్యమైన పని పడితేతప్ప నగర ప్రజలు ఇంటి గుమ్మందాటి బయటికి రావడంలేదు. అనుక్షణం భయం భయంగా…రేపెలా ఉంటుందో తెలియక అగమ్యగోచరంగా ఉంది ప్రజల పరిస్థితి.
భారత దేశానికి తీరని ప్రాణ నష్టం చేకూర్చి, తద్వారా తమ ఉనికిని చాటుకోవాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఐ ఎస్ ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ) భారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు, అందుకనుగుణంగా తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంలో భాగంగా ‘స్లీపర్ సెల్స్’ నగర కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ఎవరికీ అనుమానం రాకుండా సైలెంటుగా పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరించడంతో నగర ప్రజలందరూ తుఫానులో చిక్కుకున్న చిగురుటాకుల్లా నిలువెల్లా వణికిపోయారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం నగరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుని జల్లెడ పడుతోంది పోలీసు వ్యవస్థంతా.
***************
సమయం ఉదయం తొమ్మిది దాటింది. రాత్రి డాక్టరుగారు రాసిన ప్రిస్క్రిప్షన్ చీటీని జేబులో పెట్టుకొని మందులు తీసుకురావడానికి మెడికల్ స్టోరుకి బైకుపై బయలుదేరాను. రాత్రి చింటూకి విపరీతంగా జ్వరం రావడంతో, మా కాలనీలో ఉండే ప్రాథమిక వైద్యంచేసే డాక్టరుకి ఫోను చేస్తే వచ్చాడు.చింటూ టెంపరేచర్ చెక్ చేసి, కంగారు పడాల్సిందేమీలేదని ఇంజెక్షన్ చేసి, కొన్ని మందులు తెచ్చుకోమని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి వెళ్ళిపోయాడతను. తెల్లారేసరికి కాస్త కోలుకున్నాడు చింటూ.
బైకు మా కాలనీ మలుపు తిరిగి, మెయిన్ రోడ్డు ఎక్కగానే నా కళ్ళలో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లనిపించింది. ఎల్లో కలర్ చుడీదార్ లో ఎల్లోరా శిల్పంలా రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళుతోంది నా కలల రాణి.ఆమె అందాన్ని చూడడానికి రెండు కళ్లు చాలడంలేదు.తులసికోట దగ్గర లంగా ఓణిలో ప్రదక్షిణలుచేస్తూ ఎంతందంగా కనిపించిందో… ఈరోజు ఎల్లో చుడీదార్లో అంతే అందంగా ఉంది నా ఏంజెల్.అదృష్టం, ఆకాశం రెండూ ఒకేసారి కలిసివచ్చాయి కాబట్టి, తనతో మాట్లాడే అవకాశాన్ని మిస్ చేయ దలుచుకోలేదు.అనుకున్నదే తడవుగా ఆమె పక్కన బైకు ఆపాను. కొత్త కదా…నా వైపు సంశయంగా చూసిందామె.
నా గురించి వివరాలు చెప్పేసరికి…”అవునండీ తెలుసు! మీరు మా పక్కింట్లో ఉంటారు కదా!” అందామె.షాకవ్వడం నా వంతయ్యింది.అంటే నన్ను నిశితంగా గమనిస్తోందన్నమాట.స్వగతంగా చిన్నగా నవ్వుకున్నాను.
“ఏదో పనిమీద బయలుదేరినట్లున్నారు.రండి…బైకుపై డ్రాప్ చేస్తాను” అన్నాను.ఆమె తటపటాయించి నావైపు చూసింది.ఆమె ఇబ్బంది గమనించి, “మీరు పూర్తిగా నన్ను నమ్మొచ్చు.నా దగ్గర డాక్టరు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంది.ఈ పరిస్థితుల్లో మీకు బయట పోలీసులతో ఇబ్బంది ఉండదు” నవ్వుతూ అన్నాను. నావైపు చూసి ఏమనుకుందో ఏమో… వచ్చి బైకుపై వెనక కూర్చుంది.ఆమె చేతిలో సంచి, సంచిలో క్యారియర్ ఉన్నాయి.తనని ఎక్కడ దింపాలో చెప్పింది. నాకైతే బైకుపై ఆమెతో వెళ్తున్నప్పుడు హుషారు రెట్టింపై మనసు చిన్నగా ‘గాల్లో తేలినట్లుందే… గుండె పేలినట్లుందే…’ పాట పాడుకోవడం భలే థ్రిల్లింగుగా అనిపించింది.
*************
అది నగరంలో బాగా పేరున్న కార్పొరేట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్ ముందు బైకు ఆపాను. బయట అద్దాల్లోంచి చూస్తుంటే హాస్పిటల్ లోపల ఉన్నవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా కీ ఇచ్చిన బొమ్మల్లా తిరుగుతున్నట్లనిపించింది నాకు. బైకు దిగిన నా ఏంజెల్ నావైపు చూస్తూ, “నన్ను డ్రాప్ చేసినందుకు చాలా థాంక్సండీ! ఈ హాస్పిటల్లో మా దూరపు బంధువొకాయనకు వెన్నుముక ఆపరేషన్ జరిగింది.తనకు హోటల్ భోజనం పడదు.అందుకే ఇంటి దగ్గర్నుంచి క్యారియర్ తీసుకొచ్చాను.” టకటకా చెప్పేసి, నా బదులు కోసం చూడకుండా గబగబా హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళినవైపు తాదాత్మ్యంతో చూస్తూ హాస్పిటల్ బయటే చాలాసేపు ఉండిపోయాను… మళ్ళీ ఆమె బయటకు వస్తుందేమోనన్న చిన్న ఆశతో! కానీ ఆమె రాలేదు… నా ఆశ తీరలేదు. చింటూకి మందులు తీసుకెళ్ళాలన్న సంగతి గుర్తొచ్చి బైకు స్టార్ట్ చేసి కాస్త ముందుకెళ్ళానో లేదో, చెవులు చిల్లులుపడేలా పెద్ద శబ్దంచేస్తూ బ్లాస్టింగ్… మొదలు నరికిన మహావృక్షంలా హాస్పిటల్ కుప్పకూలిపోవడం ఒకేసారి జరిగాయి. చుట్టూతా ఏం జరుగుతూందో అర్థంకాని పరిస్థితి.
జనాలు హాహాకారాలు చేస్తూ చెరో దిక్కుకు పరిగెడుతున్నారు.రక్తంలో ముంచి విసిరేసినట్లు చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి.కళ్ళెదుటే ఆ హృదయవిధారక సంఘటన నన్ను షాక్ కి గురిచేసింది. కాసేపటికి ఆ ప్రదేశమంతా పోలీసు వాహనాలతో నిండిపోయి, వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయింది. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి కళ్ళెదుటే ఆ బ్లాస్టింగులో చనిపోవడం నా మనసు తట్టుకోలేకపోయింది.ఆ షాక్ లో ఎలా ఇంటికి చేరానో నాకే తెలియదు.
**************
ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది.ఆరోజు నా గదిలో టీవీలో వస్తున్న న్యూస్ చూస్తున్నాను. రెండు రోజుల క్రితం జరిగిన బాంబు దాడి దృశ్యాల్ని హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎక్స్ క్లూజివ్ గా చూపిస్తున్నారు.కింద వస్తున్న స్క్రోలింగు చూశాక నాలో చిన్న అనుమానం మొలకెత్తింది. స్లీపర్ సెల్ గా మారి, బాంబు బ్లాస్ట్ చేసిన వ్యక్తిని స్క్రీనుపై జూమ్ చేసి క్లోజ్ గా చూపిస్తున్నారు.
ఆ వ్యక్తిని స్క్రీనుపై చూసేసరికి నా మెదడంతా మొద్దుబారిపోయింది. ఆ బాంబు బ్లాస్ట్ చేసిన వ్యక్తి…’ఎల్లో కలర్ చుడీదార్ వేసుకున్న నేను ప్రేమించిన మా పక్కింటమ్మాయి…’ అంటే…తను క్యారియర్లో తీసుకెళ్ళింది భోజనం కాదు, అమర్చిపెట్టిన బాంబు అన్నమాట…ఆ అందం వెనుక ఎంతటి విషం దాగుంది. నా ఒళ్ళు ఒక్కసారి గగుర్పాటుకు గురికావడంతో అలాగే సోఫాలో కూలబడిపోయాను.
కధా గమనాన్ని అద్బుతంగా మలిచారు నేటి పరిస్థితులకు అనుగుణంగా మీ అనుభవాన్ని రంగరించి…👏👏👏👏👏
Thanq very much sir 🌹🙏
పక్కింటి అమ్మాయి కధ చాలా ఆసక్తి గా సాగింది. కథను నడిపించిన తీరు చాలా బాగుంది
.రచయిత రమణ వాడపర్తి గారికి అభినందనలు.
Thanq very much sir 🌹🙏