రమణ కొంటికర్ల ……………………………………………………
అది 2014 జూలై 31… మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో మూడు పోలీస్ బృందాలు సాగించిన 65 మైళ్ల దూరపు ఛేజింగది. కట్ చేస్తే… యూఎస్ లోని అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీసులతో పాటు… ఎఫ్బీఐని కూడా ముప్పుతిప్పలు పెడుతున్న బందిపోటు గురించే ఆ వార్తలు.
ఆమె ఆచూకీ కోసం ప్రజలనూ నిఘా శాఖలు అర్థించేలా చేసి.. వారితో బాంబ్ షెల్ బ్యాండిట్ గా పిలిపించుకున్న ఓ భారతీయ ఆడ లేడీ కథ ఇది. కాదు కాదు హాలీవుడ్ సినిమాను తలదన్నేలా సాగి… బాలీవుడ్ లోనూ సిమ్రన్ పేరుతో కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన వన్నెలాడి కథ.
పేరు సందీప్ కౌర్. పంజాబ్ చండీగఢ్ ఆమె స్వస్థలం. ఏడేళ్ల వయస్సులోనే తల్లీ, సోదరుడితో కలిసి అప్పటికే అక్కడ బిజినెస్ లో ఉన్న తండ్రి వద్దకు కాలిఫోర్నియాకు పయనమైంది కౌర్. ఆ తర్వాత తల్లి కూడా వ్యాపారంలో కుదురుకోవడంతో… తల్లిదండ్రులిద్దరూ వ్యాపారాల్లో మునిగితేలడంతో… సోదరుడితో పాటే, తనూ పేరెంట్స్ లాలనకు కాస్త దూరమైంది. సరిగ్గా అప్పుడే 2001, 9/11 ఉగ్రదాడులు జరిగి జాతివివక్ష ఎదుర్కొంటున్న కాలమది.
స్కూల్ లో తోటి విద్యార్థులు కొందరు మీ నాన్న ఉగ్రవాదా అని తెలిసీ తెలియనితనంతో అడిగిన ప్రశ్నలు ఆమెని మరింత నెగటివ్ మోడ్ లోకి లాక్కెళ్లాయి. దాంతో అలా ఓవైపు కన్నవాళ్ల లాలనకు దూరమై…కౌర్ లో తన కుటుంబంపై ఏదో అసంతృప్తి రాజుకుని అది కాస్తా పెరిగి పెద్దదైంది.
సరిగ్గా ఆ సమయంలోనే సమీప బంధువైన అమున్ దీప్ కౌర్ స్నేహం ఆమెకు తోడైంది. అమున్ కు అప్పటికే బాహ్యప్రపంచపు పోకడలు బాగా తెలిసుండటంతో… ఇంకేం ఇద్దరు స్నేహితుల షికార్లు చెట్టాపట్టాలేసుకున్నాయి.
తన తల్లి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిపాలైన సమయంలోనే సందీప్ కౌర్ ఓ నర్స్ స్పూర్తితో 19 ఏళ్లకే నర్సింగ్ కోర్స్ పూర్తి చేసింది. ఎప్పుడెప్పుడు బయటపడతామా అన్నట్టున్న సందీప్ కౌర్ కు ఇంట్లో ఉండటం రామచిలుక పంజరంలో ఉన్నట్టుగా అనిపించేదట.
అదే సమయంలో ఓ ఆరువేల డాలర్లు సంపాదించే నర్స్ ఉద్యోగం రావడంతో పాటు… తన ఆశలు, కలలు నెరవేర్చుకోవాలంటే డబ్బు మరింత సంపాదించాలన్న కోరిక మాత్రం బలంగా రగిలేది కౌర్ లో. దాంతో ఆమె మూడు ఉద్యోగాలు చేసింది.
అమెరికన్ వాణిజ్యరంగంలో వస్తున్న పెనుమార్పులను గమనిస్తూ తెలిసినవాళ్ల సూచనలు, సలహాల మేరకు.. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం మొదలెట్టింది. షేర్ మార్కెట్ లో కలిసి రావడంతో… రెండు మిలియన్ డాలర్ల డబ్బుని సంపాదించింది.
సరిగ్గా 20 ఏళ్ల వయస్సులోనే ఆమె అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా సాకారమవుతున్న వేళ… కోరికలు గుర్రాలయ్యాయి. అసలే పబ్బులు, క్లబ్బులు, క్యాసినోలకు కేరాఫ్ అయిన అమెరికాలో… 20 వస్తే మందు పుచ్చుకోవడంతో పాటు… అన్నింటికీ లైసెన్స్ వచ్చినట్టేనాయె! అలా 21లోకి అడుగిడే ఓ పుట్టినరోజు వేళ కౌర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది.
ఇంట్లో అబద్ధం చెప్పి బయటపడ్డ కౌర్… రెక్కలొచ్చిన గువ్వలా క్యాసినోలకు పేరొందిన ల్యాస్ వేగాస్ లో వాలిపోయింది. ఇంకేం చేతుల్లో బోలెడంత డబ్బు.. షాపింగ్.. అసలే ఫ్యాషన్లకు నెలవైనటువంటి ప్రదేశం.
అలా పొట్టి పొట్టి కురచ దుస్తులు వేసుకుని అక్కడి ట్రెండ్ ను ఆకళింపు చేసుకుని క్యాసినోల్లోకి ఎంట్రీ ఇచ్చింది కౌర్. అక్కడ బ్లాక్ జాక్ జూదానికి అలవాటు పడింది. అలా ప్రతీ నెలాఖరు రోజుల్లో ల్యాస్ వేగాస్ ఆమె జీవితంలో ఓ పార్టై పోయింది.
అలా ఆ జూదమాట కౌర్ కు కలిసి రావడంతో… జేమ్స్ బాండ్ తరహాలో జూదాన్ని ఎంజాయ్ చేసింది. కౌర్ కు కలిసి రావడాన్ని తల్లి కూడా పాజిటివ్ గా తీసుకుని కాస్త ప్రోత్సహించింది. ఎందుకంటే ఎప్పటికైనా ఓ మంచి భవంతి కొనాలన్న తపన ఆ తల్లీబిడ్డలది.
అలా ఆమె క్యాసినోల్లో జూదమాట ఇంతింతై పెరుగుతూ వచ్చి… కొన్నిసార్లు ఆమె ఇచ్చిన చెక్స్ బౌన్సైనా క్యాసినో మేనేజ్ మెంట్స్ అడ్డు చెప్పలేకపోయేంత స్థాయిలో బంధం పెనవేసుకుంది.కానీ విధి వక్రించింది. క్రమంగా డబ్బు పోవడం మొదలైంది. ఓసారి ఏకంగా 60 వేల డాలర్లను పోగొట్టుకుంది.
తన ఫ్రెండ్ అమున్ దీప్ తో ఆ డబ్బును షేర్ మార్కెట్ లో పోగొట్టుకున్నట్టు అబద్ధమాడింది. కానీ సోదరుడి ద్వారా ఆ విషయాలన్నీ అమున్ దీప్ కు తెలియడంతో… ఇక స్నేహితురాలితో నిజాలు చెప్పక తప్పలేదు సందీప్ కౌర్ కు.
సాధారణంగా జూదరుల్లో ఎక్కువ మంది ఆలోచించే రీతిలోనే మళ్లీ పోగొట్టుకున్న చోటే డబ్బు సంపాదించాలనుకున్న కౌర్ కు క్యాసినోల్లోనే మరికొందరు పరిచమయ్యారు. మీ ఆట చూశాం ముచ్చటేసింది… మీకప్పిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మళ్లీ అలా అప్పులు మొదలెట్టింది.
ఆ అప్పులు పేరుకుపోయాయే కానీ… హ్యాండ్ కలిసిరాలేదు. కౌర్ కి. దాంతో నోటోరియస్ గ్యాంగ్స్ నుంచి కౌర్ కి తీవ్ర ఒత్తిడి మొదలైంది. చంపేస్తామని… కుటుంబాన్నే లేపేస్తామన్న బెదిరింపులూ మొదలయ్యాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు కలిసి బారెడయ్యాయి.
ఇక చేసేదిలేక తామున్న ఇంటిని ఖాళీ చేసి తల్లితో సహా టికాణా మార్చేసింది. అయినా నోటోరియస్ ముఠాలంత సులభంగా వదులుతాయా ఏంటీ…? కౌర్ ను వెతుక్కుంటూ రానే వచ్చాయి. అప్పు తీరుస్తారా సరేసరె.. లేదంటే కుటుంబాన్నే లేకుండా చేస్తామన్న బెదిరింపులు తీవ్రమయ్యాయి.
ఆ క్రమంలో బ్యాంకులను కొల్లగొట్టడమొక్కటే నీ అప్పులు తీర్చేందుకు మార్గమని ఆ గ్యాంగులిచ్చిన సూచనలు, సలహాల మేరకు అప్పటివరకూ ఓ జాదరిగా మాత్రమే తన రూపాన్ని ప్రదర్శించిన కౌర్… బ్యాంక్ దొంగతనాలతో బందిపోటుగా కొత్త అవతారాన్నెత్తింది. పలు బ్యాంకులకు కన్నం వేసి తప్పించుకుని తిరిగింది.
చాలామంది దొంగలు బ్యాంక్ రాబరీ కేసుల్లో పోలీసుల కాల్పుల్లో తన కళ్లముందే చనిపోవడం చూసినా… తనకు వేరే మార్గం లేదని భావించి బ్యాంక్ దొంగతనాలను కంటిన్యూ చేసింది. అలా అమెరికాలో అత్యధిక బ్యాంక్ దోపిడీలకు పాల్పడ్డ ఓ బందిపోటుగా.. పోలీస్ వ్యవస్థనే గడగడ లాడించింది.
అప్పటికే ఆరురోజుల్లోపే రెండు పేరుమోసిన బ్యాంకుల్లో దోపిడీ చేసిన కౌర్ వద్ద 8 వేల డాలర్లు మాత్రమే ఉండగా.. అది అప్పులోళ్లకిచ్చేందుకు సరిపోకపోవడంతో… మూడో బ్యాంక్ రాబరీకి ప్లాన్ గీసింది. ఉటా లోని సెయింట్ జార్జ్ బ్యాంక్ లో రాబరీకి సరిగ్గా 2014, జూలై 31న ప్రణాళిక రచించింది.
కానీ అమెరికా ఎఫ్బీఐ అధికారుల లెక్కల ప్రకారం సరిగ్గా సోమవారాలే అక్కడ గతంలోనూ దోపిడీలు జరిగిన క్రమంలో… అదే సోమవారం రోజు ప్లాన్ చేసిన కౌర్ ను పట్టుకోవడానికి పోలీస్ శాఖ అప్రమత్తమైంది.ఇంకేం అనుకున్నట్టే కౌర్ అక్కడికొచ్చింది.
మారువేషంలో కళ్లకు గాగుల్స్.. విగ్ ధరించి ఆమె రూపం కాస్తా పోల్చుకోలేకుండా కనిపించినప్పటికీ.. ఆమె కదలికలు మాత్రం అనుమానాస్పదంగా కనిపించడం.. క్యాషియర్ ను బెదిరించి డబ్బులు తీసుకెళ్తుండటం చూసి వెంటనే క్యాబిన్ లోంచి చూసిన మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు జాగ్రత్తపడ్డారు.
అయితేనేం…? అంత సులువుగా దొరికిందా ఏటీ కౌర్…? సుదీర్ఘమైన ఛేజింగ్ అనంతరం పోలీసులకు చిక్కింది. ఆ సమయంలో అక్కడున్న తీవ్రమైన తుఫాన్ పరిస్థితులు కూడా కౌర్ ను పోలీసులకు పట్టించాయి. చివరాఖరకు అమెరికా పోలీసుల చేతికి చిక్కి.. 66 నెలల జైలు శిక్ష పడి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తోంది కౌర్.