అగ్రగామి బ్యాంక్ ఎస్ బీ ఐ లాభాల బాటలో దూసుకుపోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. ఏప్రిల్ -జూన్ త్రైమాసికానికి గాను స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 55. 25 శాతం వృద్ధితో రూ. 6504 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ. 4189 కోట్లు మాత్రమే. 2008 తర్వాత ఒక త్రైమాసికంలో భారీ స్థాయిలో బ్యాంక్ లాభాలు ఆర్జించడం ఇదే మొదటి సారి.
అనుబంధ సంస్థల లాభాలను కూడా కలుపుకుంటే (కన్సాలిడేటెడ్ )తొలి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 5203. 49 కోట్ల నుంచి రూ. 7539. 22 కోట్లకు పెరిగింది.ఇక ఈ త్రైమాసికంలో బ్యాంకు కి కొన్ని అంశాలు కలిసి వచ్చాయి. స్థూల మొండి బకాయిలు భారం తగ్గింది. స్థూల బకాయిలు 5. 44 శాతం నుంచి 5. 32 శాతానికి … నికర బకాయిలు 1. 86 శాతం నుంచి 1. 77 శాతానికి తగ్గాయి. ఫలితంగా కేటాయింపుల భారం 5.88 శాతం తగ్గి రూ. 12471 కోట్లకు పరిమితమైంది.
అలాగే నికర వడ్డీ ఆదాయం, వడ్డీ యేతర ఆదాయం వృద్ధి చెందాయి. కింగ్ ఫిషర్ బకాయిలు రూ. 1692 కోట్ల మేరకు వసూలు అయ్యాయి. కింగ్ ఫిషర్ యజమాని మాల్యా కు చెందిన షేర్లను స్వాధీనం చేసుకుని వాటిని విక్రయించి ఈ మొత్తాలను బ్యాంకు రాబట్టుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 15 వేల కోట్ల రాని బాకీలను వసూలు చేయాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. కాగా మార్చితో ముగిసిన వార్షిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో ఎస్బీఐ షేర్ల లో పెద్ద ర్యాలీ రావచ్చని అంచనా వేశారు.
కానీ ర్యాలీ లాంటి దేమి రాక పోయినా కొంచెం మెల్లగా షేర్ల ధరలో కదలిక వచ్చింది. మే 27 న రూ. 413–415 వద్ద ఈ షేర్ ట్రేడ్ అయింది. రెండు రోజుల క్రితం త్రైమాసిక ఫలితాలు ప్రకటించినప్పుడు రూ. 460 వద్ద ట్రేడ్ అయిన ఈ షేర్లు లాభాల స్వీకరణ తో ప్రస్తుతం 438 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుత ధర వద్ద దీర్ఘకాలిక వ్యూహంతో ఈ షేర్లలో మదుపు చేయవచ్చు. అమ్మకాల వత్తిడి ఎక్కువగా ఉండటంతో షేర్ ధర ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. స్వల్పకాలంలో షేర్ ధరలో అంత వృద్ధి ఉండకపోవచ్చు అంటున్నారు. షేర్ ధర తగ్గితే మరిన్ని కొనుగోలు చేయవచ్చు. బాగా తక్కువ ధరలో కొన్నవారైతే ప్రస్తుతం లాభాలు స్వీకరించడం మంచి వ్యూహమే.
————KNM