Attractive Interest Rates………………….
ప్రైవేటురంగానికి చెందిన పెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) కొత్తగా రెండు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చింది.అధిక వడ్డీ రేట్లతో పరిమితకాలానికి గానూ ఈ డిపాజిట్ పథకాలను మార్కెట్లోకి తెచ్చింది.
35 నెలల స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ పై సాధారణ పౌరులకు 7.2 శాతం, 55 నెలల కాలవ్యవధి గల ఎఫ్‌డీ స్కీమ్ పై 7.25 శాతం చొప్పున వడ్డీ చెల్లించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకరించింది. అలాగే ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సైతం సవరించింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ అందజేస్తుంది. కొత్త ఎఫ్‌డీ రేట్లు మే 29 నుంచి వర్తిస్తాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకొచ్చిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో ఒకటి 35 నెలలు (2 సంవత్సరాల 11 నెలలు) కాలవ్యవధి కలిగి ఉంటుంది. ఈ పథకం కింద సాధారణ పౌరులకు 7.20 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 7.70 శాతం వడ్డీని ఇస్తుంది.
బ్యాంక్ తీసుకొచ్చిన మరో ఎఫ్‌డీ పథకం 55 నెలల (4 సంవత్సరాల 7 నెలలు) కాలవ్యవధి కలిగి ఉంటుంది. ఈ పథకం కింద సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ గిట్టుబాటు అవుతుంది. ఈ రెండు స్పెషల్ ఎఫ్‌డీ పథకాలు కాకుండా 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు రూ.2 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 నుంచి 7 శాతం వరకు వడ్డీని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
మరోవైపు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు గరిష్ఠంగా 7నుంచి 7.20 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం 8- 9 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. ఇన్వెస్టర్లు పూర్తి వివరాలు తెలుసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది.