మయన్మార్‌లో సైనికులు తిరుగుబాటు ప్రకటించారు. ఈ పరిణామంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ప్రముఖ నాయకురాలు అంగ్‌సాన్ సూకీని సైనికులు అదుపులోకి తీసుకుని … నిర్బంధంలో పెట్టారు. మయన్మార్ మిలటరీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. మయన్మార్‌లో ఎన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వానికి, మిలటరీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత ఏడాది నవంబర్ లో జరిగిన ఎన్నికలలో అంగ్ సాన్ సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ మొత్తం 476 సీట్లలో 396 స్థానాలను కైవసం చేసుకుంది, మరో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత సాధించింది. సైనిక మద్దతు ఉన్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ కేవలం 33 సీట్లను మాత్రమే గెలుచుకుని దారుణంగా పరాజయం పాలైంది. అప్పటినుంచే కుట్రలు మొదలైనాయి.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీ పార్టీ 2015 లో జరిగిన ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించింది. ఆమె వరుస విజయాలను ఓర్వలేని మిలిటరీ లో కొన్ని శక్తులు తిరుగుబాటు కు నాయకత్వం వహించాయి. ఈ నేపథ్యంలో అంగ్‌సాన్ సూకీతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆంగ్ సాన్ సూకీ బహిరంగ నిరసనలకు పిలుపునిచ్చారు. మయన్మార్‌లోని ప్రధాన నగరమైన యాంగోన్ సిటీలో పలుచోట్లా సైనికులు మోహరించారు. అల్లర్లు జరగకుండా చూస్తున్నారు. దేశమంతటా ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు.
ఇదిలా ఉంటే మయన్మార్ మిలటరీ కుట్రపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాల ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో తాము జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆస్ట్రేలియా కూడా అంగ్ సాన్ సూకీతో సహా ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని కోరింది. కాగా ఆంగ్ సాన్ సూకీ పాలక పార్టీ మోసాలతో ఘన విజయం సాధించిందని మిలటరీ చేసిన ఆరోపణలను మయన్మార్ ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్కు అధికారాన్ని అందజేయడంతో పాటు సైన్యం ఒక సంవత్సరం పాటు దేశంపై నియంత్రణ సాధించినట్లు మిలటరీ టెలివిజన్ సోమవారం ప్రకటించింది.