ఆ చిరునవ్వులో ఏదో మెస్మరిజం !

Sharing is Caring...

ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారం లో ఉన్నాయి. అందులో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనలో  చాలామందికి తెలియని మానవతా కోణం ఉంది. ఆంధ్రజ్యోతి తిరుపతిలో( 1989 )  పని చేస్తున్న రోజులవి . ఒక రోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాప్రసాద్ ఫోన్ చేసి ‘కడప వస్తావా ?’అని అడిగేడు .”ఏం” అన్నాను .. ఒక  “డైనమిక్ లీడర్” ను ఇంటర్వ్యూ చేయాలి .. నువ్వుంటే బాగుంటుంది. వెంటనే బయలు దేరు”అన్నాడు.”ఎవరా ? ఆ డైనమిక్ లీడర్ ” అడిగాను. “సస్పెన్స్…  వచ్చేయి” అన్నాడు. మరుసటి రోజే కడపలో దిగా. జడ్పీ గెస్ట్ హౌస్ లో రూమ్ పెట్టారు.9 గంటలకల్లా రెడీ అయి కూర్చున్నా.కారులో వచ్చాడు ప్రసాద్. ఏదో టిఫిన్ సెంటర్ కి తీసుకెళ్లాడు.

కడప ఫేమస్  కారం దోశలు  తిన్నాం.”ఇపుడు మనం చిన్న సర్వే చేయడానికి వెళుతున్నాం … త్వరలో  ఎన్నికలు జరుగుతున్నాయి కదా ….  ఓటర్లు  ఏమనుకుంటున్నారు ? ఎవరికి ఓటేయబోతున్నారు అన్న అంశాలమీద ఫీడ్ బ్యాక్ తీసుకుని వద్దాం ” అన్నాడు. “ఎవరినో  ఇంటర్వ్యూచేయాలన్నావు”  అంటూ గుర్తు చేశా .
“సాయంకాలం 7 గంటలకు ఫిక్స్ అయింది”. అన్నాడు.  కడప రూరల్ ప్రాంతాల్లో చాలా చోట్ల తిరిగాం .  షాపులు,  టీ కొట్ల దగ్గర ఓటర్లతోమాట్లాడాం. కొంత సమాచారం సేకరించాం . అటునుంచి ఒక పల్లెటూరు వెళ్ళాం. అక్కడ  లోకల్ లీడర్స్ ను కలిసాం. కొందరితో నేను…  మరికొందరితో ప్రసాద్ వేర్వేరుగా మాట్లాడాం.  ఆ తర్వాత మైదుకూరు వెళ్ళాం . అలా మధ్యాహ్నం దాకా తిరిగాం. మొత్తం మీద కొంత ఫీడ్ బ్యాక్ వచ్చింది. మైదుకూరులో భోజనం చేసి తిరిగి సాయంకాలానికి కడప జ్యోతి ఆఫీస్ కొచ్చాము. ప్రసాద్ ఏదో  రాసుకుంటున్నాడు. టైమ్ 6. 30 దాటుతోంది. అంతలో ప్రసాద్ కి ఎవరో  ఫోన్ చేశారు.  ” వెళ్దాం పద” అన్నాడు . జడ్పి గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం. 

“7 గంటలకు ఎవరినో కలవాలన్నావు కదా.”“ఆయన దగ్గరకే వెళ్తున్నాం “అన్నాడు. నాకు టెన్షన్ మొదలయింది. అసలే కడప… ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నాడో ఏమో  చెప్పడం లేదు . పైగా ఇంటర్వ్యూ అంటున్నాడు. ఏమి ప్రిపేర్ కాలేదు అనుకున్నాను మనసులో.   గెస్ట్ హౌస్ లోపల మరో పెద్ద రూమ్ దగ్గర కొచ్చాము . అక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు.ఇద్దరు గన్ మెన్లు కూడా ఉన్నారు.  మేము గేటు దగ్గర కెళ్ళగానే అక్కడ నిలబడ్డ వ్యక్తి దుర్గాను చూసి  “నమస్తే సార్”అంటూ తలుపు తీసాడు. లోపలికి వెళ్లాం . అంతే… ఎదురుగా సోఫా లో కూర్చున్న వ్యక్తిని చూడగానే షాక్ తిన్నాను. ఆయనను చూడటం అదే మొదటి సారి. ఎన్నాళ్ళ నుంచో ఆయనను చూడాలనుకుంటున్నా .. ఇలా  అసలు ఊహించలేదు. ఆయన చాలా సాదా సీదాగా ఉన్నారు. తెల్లటి పంచె కట్టి .. ఫుల్ హాండ్స్ షర్ట్ వేసుకుని ఉన్నారు.ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 

ఆయన అవతలివారు చెబుతున్న మాటలను నవ్వుతూ వింటున్నారు . మేము లోపలికి వచ్చిన అలికిడికి  తల తిప్పి మా వైపు చూసారాయన.  నమస్కారం చేసాను. ఆయన కూడా ప్రతి నమస్కారం చేశారు . ” టూ మినిట్స్ కూర్చోండి “అన్నారు. “అలాగే అన్నా … మీరు చెప్పినట్టు చేద్దాం .. టచ్ లో ఉండండి ” అన్నాడాయన. ఆ ఇద్దరూ లేచి నమస్కారం చేసి వెళ్లిపోయారు.  దుర్గా ప్రసాద్ నన్ను పరిచయం చేస్తూ …” మూర్తి .. జర్నలిస్ట్ … మా ఇమ్మిడియట్ బాస్ … మా న్యూస్ నెట్ వర్క్ ఇంచార్జి” అని చెప్పాడు. ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ … “నైస్ టూ మీట్ యు మూర్తి” అన్నారు. మేము పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాం. అంతలో కాఫీ వచ్చాయి. “బయట ఎవరైనా ఉన్నారా ?” కాఫీ తెచ్చినతన్నిఅడిగేడు ఆయన. “ఎవరూ లేరు సార్” “సరే .. ఎవరు వచ్చినా … ఓ ఇరవై నిమిషాలు కూర్చోమను” అన్నారు. ఇండైరెక్టుగా మాకిచ్చిన  టైమ్ గురించి చెప్పాడు ఆయన.దుర్గా ప్రసాద్ ఇంటర్వ్యూ మొదలు పెట్టాడు. టక టక ప్రశ్నలు అడుగుతున్నాడు . ఆయనకూడా అదే వేగంతో జవాబులు చెబుతున్నాడు.

మధ్యలో జోక్యం చేసుకుంటూ “సర్ … నాకొక డౌట్” అన్నాను. “వాట్ ఈజ్ యువర్ డౌట్” అన్నాడాయన నా వైపు చూస్తూ. “రోడ్ ప్రయాణం చేసేటపుడు మీరు మధ్యలో రెండు మూడు కార్లు మారుతుంటారని జనం చెప్పుకుంటుండగా విన్నాను. అది కూడా సేఫ్టీ మెజర్స్ లో భాగంగా …నిజమేనా ?” అన్నాను.  నా ప్రశ్న విని ఆయన పెద్దగా నవ్వారు. నేను ఆశ్చర్య పోతూ ఆయన కేసి చూసాను .. ఏం చెబుతారా అని. “అదేం కాదు .. నేను ఎక్కువగా ట్రైన్ ప్రయాణమే చేస్తాను . అయితే ఒకసారి అర్జంటు పని మీద  హైదరాబాద్ వెళుతున్నాను. మార్గ మధ్యంలో నేను ప్రయాణిస్తున్న కారు ఆగిపోయింది.  వెనుక ఇంకో కారులో మిత్రులు ఉన్నారు కానీ వాళ్ళను ఆపి నేను ఆ కారులో వెళ్లడం ఇష్టం లేక ఆగాను . ఆ కారు లోనే ఒక మిత్రుడు వెళ్లి పక్కనే ఏదో ఊరు ఉంటే  అక్కడ తెల్సిన వాళ్ళ కారు తీసుకొచ్చాడు . ఆ వచ్చిన కారులో హైదరాబాద్ వెళ్ళాను. ఇది ఎవరికో తెలిసి అలా కథ అల్లారు.” క్లారిఫై చేశారాయన. 

ఇంకో ప్రశ్న అంటూ “ఎలాంటి వ్యక్తులు అంటే మీకు ఇష్టం ”  అడిగాను. “ఏవిషయమైనా సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్లంటే నాకు ఇష్టం .. కుట్ర తత్వం ఉన్నవాళ్లను భరించలేను.” స్పష్ష్టంగా చెప్పారాయన. చివరి ప్రశ్న  “మీకు వ్యవసాయం అంటే ఇష్టం .. కానీ డాక్టర్ అయ్యారు .. ఆ తరువాత పొలిటీషియన్ గా మారారు .  ఎందుకలా ఫీల్డ్ మార్చారు ? “మంచి ప్రశ్న. నాకు మా నాన్నంటే చాలా ఇష్టం .. ఆయన మాట కాదనే వాడిని కాదు .. నేను పాలిటిక్స్ ద్వారా ప్రజాసేవ చేయాలనేది రాజారెడ్డి గారి లక్ష్యం. ఆయన లక్ష్యమే నా లక్ష్యం గా మారింది. దట్సాల్ “. చెప్పారు ఆయన. 

తర్వాత దుర్గా తను అడగాలనుకున్న ప్రశ్నలు అడిగేడు.  ఆయన సమాధానాలు చెప్పారు. ఆ టైమ్ లో నేను ఒక పేపర్ పై చకచకా పది పాయింట్లు రాసి పెట్టుకున్నాను.  ఇంటర్వ్యూ అయిపొయింది. వెళ్ళడానికి లేచాం.  ఆయన కూడా లేచి  మరోమారు షేక్ హ్యాండ్ ఇచ్చారు.  నేను రాసి పెట్టుకున్న స్లిప్ ఆయన చేతిలో పెట్టాను.  “ప్లీజ్ రీడ్ ఇట్”. అన్నాను.  ఇంతలో ఒక వ్యక్తి గబగబా వచ్చి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ‘శేషయ్య ఏంటి ఇది’ అంటూ అతగాడిని లేపాడు ఆయన. ఆ శేషయ్య కళ్ళలో నీళ్లు  జలపాతపు ధారలా కారిపోతున్నాయి. అతగాడు ఏం చెప్పలేకపోతున్నాడు.  పక్కనున్న  ఒక వ్యక్తి కలుగజేసుకుని “శేషయ్య కొడుక్కి సీరియస్ గా ఉందయ్యా .. ఆపరేషన్ చేయాలట. బిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాడు … చేతిలో పైసా లేదు. చాలా ఖర్చు అవుతుందట ” అన్నాడు.

“సరే … నేను డాక్టర్ తో మాట్లాడతాను.. నువ్వు హాస్పిటల్ కెళ్ళు “… అంటూ జేబులోనుంచి వంద నోట్ల బొత్తి  తీసి శేషయ్య చేతిలో పెట్టాడు.అప్పటివరకు ఆయనకు సహాయం చేసే గుణం ఉందని తెల్సు కానీ చూడటం అదే మొదటి సారి. ఆ తర్వాత కూడా కొన్ని సార్లు చూసాను. “బై మళ్ళీ కలుద్దాం” అన్నారాయన .  మేము వచ్చేసాం. 

>>>>>>>>>>>>>>>>>

ఆ రోజు నాటికి  వైఎస్  అసెంబ్లీ కి పోటీ చేస్తారా ? పార్లమెంట్ కి పోటీ చేస్తారా ? అనేది తేలలేదు. ఆయన కైతే అసెంబ్లీ కి పోటీ చేయాలని ఉంది .  అయితే  రాజీవ్ గాంధీ  సూచన మేరకు కడప లోకసభ కు పోటీ చేశారు. 1,66,752 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అపుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది.

>>>>>>>>>>>>>>>>>>>

సరిగ్గా 6 నెలల తర్వాత  ఒకసారి కలసినపుడు “ఆ రోజు నువ్వు స్లిప్ లో రాసిచ్చిన అంచనా. అనాలసిస్ 100 శాతం కరెక్ట్.అభినందనలు” అన్నారాయన.ఆ తర్వాత  ఎన్నో సార్లు ఆయన ను కలిసినా అదే చిరునవ్వు.. అదే ఆత్మీయత తో కూడిన మాటలు. 

—————--KNM 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!