Increased death sentences ……………………………………
గతేడాది దేశవ్యాప్తంగా విచారణ కోర్టులు (Trail Courts) వివిధ కేసుల్లో 165 మందికి మరణ శిక్షలు (Death Sentences) విధించాయి.2000వ సంవత్సరం తర్వాత ఒక ఏడాదిలో ఇన్ని మరణ శిక్షలు విధించడం ఇదే మొదటిసారి. శిక్షల విధానాలను సంస్కరించాలని సుప్రీం కోర్టు పిలుపునిచ్చినప్పటికీ , ట్రయల్ కోర్టులు 2022లో 165 మరణ శిక్షలను విధించాయి.
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీకి చెందిన క్రిమినల్ రిఫార్మ్స్ అడ్వకసీ గ్రూప్ ప్రాజెక్ట్ 39A ఈ నివేదికను విడుదల చేసింది . ఆ నివేదిక ప్రకారం మరణ శిక్ష ఖైదీల సంఖ్య 2022 చివరి నాటికి 539కి చేరుకుంది. 2016 నుంచి ఇదే అత్యధికం. మరణ శిక్ష ఖైదీల సంఖ్య సైతం 2015 నుంచి 2022 నాటికి 40 శాతం పెరిగింది.
మరణ శిక్ష విధించిన కేసుల్లో 50 శాతానికిపైగా (51.28 శాతం) లైంగిక నేరాలకు సంబంధించినవేనని నివేదిక చెబుతోంది. అహ్మదాబాద్ బాంబు పేలుడు కేసులో 38 మందికి మరణ శిక్ష విధించడం.. 2022లో అత్యధిక మరణ శిక్షల సంఖ్యకు కారణమైంది. 2016 నుంచి ఒకే కేసులో అత్యధిక సంఖ్యలో మరణ శిక్షలు పడింది కూడా ఇందులోనేనని నివేదిక సమాచారం.
ఉ త్తరప్రదేశ్లో అత్యధికంగా 100 మంది మరణ శిక్ష పడిన ఖైదీలు ఉన్నారు. గుజరాత్ (61), ఝార్ఖండ్ (46), మహారాష్ట్ర (39), మధ్యప్రదేశ్ (31) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి లలిత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, మరణశిక్షను పునఃపరిశీలించే అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించింది.
మరణ శిక్షలకు సంబంధించి సుప్రీం కోర్టు 11 కేసులు, హైకోర్టులు 68 కేసులను పునర్వివిచారణ చేపట్టాయి. 15 మంది ఖైదీలతో సంబంధం ఉన్న 11 కేసుల్లో సుప్రీం కోర్టు.. ఐదుగురిని అన్ని అభియోగాల నుంచి విముక్తి చేసింది. ఎనిమిది మంది శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇద్దరికి మరణ శిక్షను నిర్ధారించింది.
101 మంది ఖైదీలతో కూడిన 68 కేసుల్లో హైకోర్టులు.. ముగ్గురికి మరణశిక్షను సమర్థించాయి. 48 మంది శిక్షను జీవిత ఖైదుగా మార్చాయి. 43 మందిని నిర్దోషులుగా ప్రకటించాయి. ఆరుగురి కేసులను ట్రయల్ కోర్టుకు తిప్పిపంపాయి’ అని నివేదిక చెబుతోంది.బాంబే హైకోర్టు.. ఓ దోపిడీ, హత్య కేసులో ఒక ఖైదీ శిక్షను జీవిత ఖైదు నుంచి మరణ శిక్షకు పెంచిందని, 2016 తర్వాత శిక్ష పెంపుదలకు సంబంధించి ఇది రెండో కేసు అని నివేదిక వెల్లడించింది.