Vilaskar Ch……………………………………………….
సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. వయసు..శరీరం కూడా ఆటోమేటిక్ గా సహకరిస్తాయి. ఈ ఫొటోలో ఉన్న రాజ శిఖామణి సాహసాలు చేయడంలో దిట్ట. వయసు పైబడే దశలో పర్వతారోహణ చేసి సత్తా చాటాడు. 58 ఏళ్ల వయసులో విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ పరుగుదీశారు. 50 కిలోమీటర్లు దూరం అలవోకగా ఆగకుండా పరుగెత్తారు.63 ఏళ్ళ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
విశ్రాంత పోలీస్ అధికారి అయిన శిఖామణి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమళ్లపాడు గ్రామానికి చెందినవారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఒంగోలులో స్థిరపడ్డారు. ఒంగోలు శర్మా కాలేజీ లో డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత అథ్లెటిక్స్ పై దృష్టి సారించారు. మొదటి ప్రయత్నంలోనే 1977లో ఇంటర్ కాలేజి స్పోర్ట్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించి యూనివర్సిటీ చాంపియన్‌గా నిలిచారు.
తర్వాత ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. తర్వాత ఇంటెలిజెన్స్, సివిల్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2016లో విజయనగరం పోలీస్ శిక్షణ కేంద్రానికి ప్రిన్సిపాల్ అయ్యారు. ఆరు నెలలు అనంతపురం పీటీసీలో కూడా ప్రత్యేకాధికారిగా సేవలందించారు. శిఖామణి సర్వీసులో 5 వేల మంది ఎస్‌ఐలు, 150 మంది డీఎస్పీలు, 55 మంది ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చారు. ఇండియన్ పోలీస్ మెడల్‌తో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. కాలిఫోర్నియాలోని రెక్లెన్ యూనివర్సిటీ ఆయనకుగౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.
శిఖామణి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కమాండో శిక్షణ తీసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రులు ఎన్‌టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, హోం మంత్రి మైసూరారెడ్డిలకు భద్రతాధికారిగా పనిచేశారు. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ రాష్ట్రానికి వచ్చినపుడు ఆయన రక్షణ బాధ్యత శిఖామణికే అప్పగించేవారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సహా ఏడుగురు ఐఏఎస్‌లను దారగడ్డలో మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు శిఖామణి రెవెన్యూ అధికారిగా వారిని పరిచయం చేసుకుని వారితో చర్చలు జరిపారు.
పర్వాతారోహణం అంటే శిఖామణికి ఎంతో ఇష్టం. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ సారధ్యంలో ఆరుగురు సభ్యుల బృందం గా ఈ నెల ప్రారంభంలో లుక్లాకు చేరుకున్నారు. అక్కడి నుంచి అందరిలా హెలికాప్టర్‌లో వెళ్లకుండా 70 కిలోమీటర్లు అదనంగా నడిచి మొత్తం 6 వేల మీటర్ల ఎవరెస్ట్ పర్వతాన్ని (బేస్ క్యాంప్ వరకూ) ఏడు రోజుల్లో అధిరోహించారు.
సాధారణంగా ఆ వయసున్న వారు పర్వతారోహణ చేయడం చేయడం కష్టం. భారతీయులెవరూ ఆ వయసులో పర్వతారోహణ చేయలేదు. కాగా 62 ఏళ్ళ వయసులో ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన, ప్రమాదకరమైన పర్వతం కిలిమంజారోను కూడా అధిరోహించారు. అంతకు ముందు యూరప్‌లోనే ఎత్తయిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రోస్ పర్వతాన్ని కూడా అవలీలగా ఎక్కేసి వచ్చారు.
‘అత్యంత కష్టమైన పర్వతారోహణను చేయడానికి శరీర దృఢత్వంపై పెట్టిన శ్రద్ధ, కఠోర శ్రమ, ఆహార అలవాట్లే కారణం’అంటారు శిఖామణి. ‘అలాగే మానసికంగా కూడా బలంగా ఉండాలి. పర్వతారోహణ మార్గాల్లో ఎక్కడా సరైన ఆహారం దొరకదు. పైకెళుతున్నకొద్దీ ఒంట్లో శక్తి తగ్గిపోతుంటుంది. మైనస్ 27 డిగ్రీల వద్ద అడుగు కూడా ముందుకు వేయలేం. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పొరపాటున అడుగు ఏమాత్రం తప్పినా లోయల్లో పడిపోతాం. బాడీని ట్రేస్ చేయడం కూడా కష్టమే. చాలా మంది యువకులే మధ్యలో వెనక్కి వచ్చేస్తుంటారు. నాకైతే వెనక్కి వెళ్లాలన్న యోచనే రాలేదు. పట్టుదలతో ముందుకు నడిచి గమ్యం చేరుకున్నాను’ అంటూ తన అనుభవాన్ని వివరించారు శిఖామణి.