గిరి ప్రదక్షిణలో తెల్ల దుస్తులే ధరించాలా ?

Sharing is Caring...

Is there a dress code for Giri Pradakshina?……………….

గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికి ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా? అని కొందరికి సందేహం రావచ్చు. ఫలితాల గురించి ఆలోచించకుండా మన పని మనం చిత్త శుద్దితో చేయాలి. భక్తుల ఆత్మవిశ్వాసం, అంకితభావం, అచంచల విశ్వాసంతో చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారు. 

ఆ విషయాలు అలా ఉంటే ..  కొన్ని చిట్కాలు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చని పెద్దలు చెబుతుంటారు. 
1. స్నానమాచరించిన తర్వాత తమ కులధర్మాన్ని బట్టి నుదుట విభూతి, సింధూరం, కుంకుమ ధరించి, దేహంపై దైవీక చిహ్నాలతో గిరి ప్రదక్షిణ చేస్తే శుభఫలితాలు అందుతాయి. 
2. సంప్రదాయ రీతిలో పురుషులు పంచలు , స్త్రీలు చీరలు ధరించి గిరి ప్రదక్షిణ చేయడం శ్రేయస్కరం.
3. గిరిప్రదక్షిణ చేసే రోజుకు  అనువైన రంగుల దుస్తులు ధరిస్తే మంచిది.

4. పురుషులు జంధ్యాలు, చెవిపోగులు ధరించి, మహిళలు ముక్కుపుడకలు ధరించి గిరి ప్రదక్షిణ  చేయాలి. 
5. నిర్ణీత లగ్నం, హోర, అమృతయోగం వంటి శుభముహూర్త సమయాల్లో గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. 
6 . గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడక్కడా పితృదేవతలకు తర్పణాలు, ధాన ధర్మాలు చేస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలు అధికంగా పొందుతారు.

7 . అరుణాచలంలో  ఒంటరిగా గిరి ప్రదక్షిణం చేయడం కంటే కుటుంబ సమేతంగా, బంధువులు, స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శ్రేష్ట ప్రదం. ప్రతీ సారి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు తమతో పాటు ఓ కొత్త వ్యక్తిని వెంటబెట్టుకుని తీసుకెళ్లడం కూడా మంచిది.

గిరి ప్రదక్షిణ నియమాలు ఇలా ఉన్నాయి. 

సాక్షాత్తు మహేశ్వరుడు స్థూల రూపంలో అవతరించిన అరుణాచల  గిరి ప్రదక్షిణ చేయడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటిని పాటించాలి. అవేమిటంటే.

1. పాదరక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ నియమానికి అసలు మినహాయింపులు లేవు.
అరుణాచలమంతా  కోటానుకోట్ల సంఖ్యలో లింగాలు సూక్ష్మరూపంలో ఉన్నాయి. కనుక అంతటి పవిత్రమైన మార్గంలో ఎట్టి పరిస్థితులలోనూ పాద రక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయడమే మంచిది.
2. వాహనాలతో గిరి ప్రదక్షిణ చేయరాదు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తమ శక్త్యానుసారం నెమ్మదిగా నడిచి అక్కడక్కడా సేదతీరుతూ, విశ్రాంతి తీసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. నడవలేని స్థితిలో ఉన్నవారు గిరి ప్రదక్షిణ చేయకుండా ఉన్న చోటు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు.

3. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కబుర్లు చెప్పుకోకూడదు. శివ నామ స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి.. సంస్కృతం, తెలుగు భాషలలోని దైవనామాలను నినదిస్తూ నెమ్మదిగా గిరి ప్రదక్షిణ చేయాలి. ‘అరుణాచల శివా! అరుణాచల శివా!’ అనే నామావళిని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది.4. మొక్కుబడులు తీర్చుకోదలచినవారు మాత్రమే అరుణాచల  శిఖరాగ్రాన్ని చేరుకోవచ్చు. కార్తీక దీపం రోజున పర్వతంపైకెక్కి నేతిని సమర్పించి  ప్రార్థన చేసి వెంటనే కిందకు దిగాలి. కొండపై నుండి వేడుకగా చూడకూడదు. మొక్కుబడులు లేనివారు అకారణంగా కొండెక్కరాదు. పాప చింతనలు కలిగిన వారు పర్వతం పైకి ఎక్కరాదు.

5. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఉన్న తీర్థాలు, నందులు, అష్టలింగాలు, ముఖ్యమైన దర్శన ప్రాంతాల వద్ద సాష్టాంగ నమస్కారాలు ఆచరించాలి. వంటిపై మట్టి అంటుకుంటుందన్న తలంపు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకూడదు. సిద్ధులు, మహర్షులు పాదాలు మోపిన పవిత్ర స్థలమన్న భావనతోనే సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

6. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఎదరుయ్యే నిరుపేదలకు, పశువులు, శునకాలు వంటి జంతువులకు ఆహార పదార్థాలను దానం చేస్తే మంచిది. గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు ముందుగానే వారి వెంట పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు  తదితర ఆహార పొట్లాలను తీసుకెళ్లడం మంచిది.

గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు ఆ రోజుకు సంబంధించి ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుని ఆ వర్ణపు దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేసి మరిన్ని ఫలితాలను పొందవచ్చు. ఆయారోజులకు అనువైన వర్ణాలు కలిగిన దుస్తులను నిరుపేదలకు దానం చేస్తే మరీ మంచిది.
ఆదివారం….  నారింజరంగు….  సోమవారం ….  తెలుపు + ఎరుపు
మంగళవారం…… ఎరుపు…..  బుధవారం….. పచ్చ
గురువారం….  పసుపు….   శుక్రవారం  …… లేత నీలం
శనివారం……   నలుపు లేదా నీలం దుస్తులు ధరిస్తే మంచిది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!