Trapped heroin ………………
చిత్ర సీమ .. నిజమే అది చిత్రసీమే. అక్కడ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఈ చిత్రాలలో కొన్ని మాత్రమే వెలుగు చూస్తుంటాయి. చిత్ర సీమలో వేషాలు వస్తున్నంత వరకు బాగానే ఉంటుంది. ముఖ్యంగా తారల విషయంలో… ఎప్పుడైతే అవకాశాలు రావో అపుడే కష్టాలు మొదలవుతాయి.
ఈ దశ చాలా ప్రమాదకరమైనది. కష్టాలు తట్టుకుని సత్తా చాటుకునే వారు కొద్దిమందే. కొందరు సినీ రంగం నుంచి బయటకు వెళ్లడం ఇష్టం లేక అక్కడే చిన్న పాత్రలు వేస్తూ బతుకుతుంటారు. కొందరైతే అవకాశాలు ఇక కష్టం అనుకున్నపుడు వెంటనే పరిశ్రమకు దూరమవుతారు.
తళుకు,బెళుకులు మసి బారకముందే ఎవరో బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని జీవితం లో సెటిల్ అయిపోతారు. అలా చిత్ర పరిశ్రమకు దూరమైనవారు ఎంతో మంది ఉన్నారు. ఇంకొందరైతే రాంగ్ స్టెప్ వేసి పతనం వైపు అడుగులు వేస్తుంటారు. అప్పటికే ఖరీదైన జీవితానికి అలవాటు పడి దాని నుంచి బయటకు రాలేక ..చేతిలో డబ్బులు లేక చీకటి తప్పులకు అలవాటు పడతారు.
వ్యక్తుల ట్రాప్ లో ఇరుక్కుంటారు. గ్లామర్ ప్రపంచం లో ట్రాప్ వేసేందుకు కొందరు ఎపుడూ సిద్ధంగా ఉంటారు. వారి చేతిలో పడ్డారా అంతే సంగతులు. చాలామంది తారలు అలా ఇరుక్కుపోయిన వారున్నారు. అలాంటి వారిలో నిషా నూర్ ఒకరు. తమిళనాడులోని నాగపట్టణం లో ఆమె జన్మించింది.
1980 నుంచి 95 వరకు నిషా.. తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో నటించింది. కమల్ హాసన్, మమ్ముట్టి,రజనీకాంత్,మోహన్‌లాల్, రాజేంద్రప్రసాద్ లాంటి హీరోల సరసన నటించింది.కమల్‌తో ‘టిక్ టిక్ టిక్’ సినిమాలో,రాజేంద్రప్రసాద్‌తో ‘ఇనిమై ఇదో ఇదో’ సినిమాలో .. రజనీకాంత్‌తో ‘శ్రీ రాఘవేంద్ర’ లో …మమ్ముట్టితో ‘అయ్యర్ ద గ్రేట్’.. మోహన్‌లాల్‌తో ‘దేవసురమ్’ లాంటి సినిమాల్లో నిషా నూర్ నటించారు.
మొదట్లో అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ.. ఎందుకో క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఛాన్సెస్ కోసం ప్రయత్నించింది.. కానీ దొరకలేదు.. 1995 తర్వాత నిషా సడెన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆ సమయంలోనే ఒక తమిళ నిర్మాత ఆమె బలహీనతలను గమనించి చేరదీశాడు.
కొత్త సినిమాలన్నాడు, షూటింగ్ లు అన్నాడు.. మాయ మాటలు చెప్పి లొంగ దీసుకున్నాడు. అతని వలలో చిక్కుకుని సర్వం పోగొట్టుకుంది. చివరికి అతగాడు ఆమెను వ్యభిచారం లోకి కూడా దించాడు. కొన్నాళ్లు ఆమెతో ఆ నిర్మాత బాగానే గడిపాడు. తర్వాత మొహం చాటేశాడు.
ఆ తర్వాత గత్యంతరం లేక వ్యభిచార వృత్తిలోనే కొన్నాళ్ళు గడిపింది. అందచందాలు ఉన్నంతవరకే ఆ వృత్తిలో డిమాండ్ ఉంటుంది. అక్కడ ఆదరణ తగ్గిపోవడంతో కొన్నాళ్ళు రోడ్ల పై ముష్టి ఎత్తుకుని బ్రతికింది.
సరిగ్గా అలాంటి దశలో ‘ముస్లిం మున్నేట్ర కజగం’ అనే ఎన్జీవో వర్కర్ ఆమెను గుర్తించి ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. వైద్య పరీక్షలు చేయగా ఆమెకు ఎయిడ్స్ సోకిందని తేలింది. అలా ఎయిడ్స్ కి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే దిక్కు లేని అనాధలా తాంబరం ఆసుపత్రిలో 2007 లో నిషా కన్నుమూసింది.
క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోక.. సినిమా మోజులో ఓ మోసగాడి చేతిలో పడి సర్వం కోల్పోయిన నూర్ కథ. ఇలా ఎందరో ఉన్నారు.. వెలుగు చూసిన విషాద కథల్లో ఇదొకటి.