శేషన్ స్టయిలే వేరు కదా !

Sharing is Caring...

టీఎన్ శేషన్  ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్ కై ఉత్తర ప్రదేశ్‌లో ఒక ప్రదేశానికి వెళ్లారు. మార్గమధ్యం లో  పిచ్చుక గూళ్ళతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు.అవి చూసి ముచ్చటపడిన శేషన్ భార్య రెండు గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలనుకుంది.

అక్కడికి సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుడిని పోలీసు ఎస్కార్ట్ వారితో పిలిపించి,పిచ్చుక గూళ్ళను తీసిస్తే పది రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. ఆ కుర్రవాడు ఒప్పుకోక పోవడంతో  రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామన్నారు శేషన్. వెంట ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గూళ్ళు తియ్యమని యువకుడిని ఆదేశించారు.

అయినా తొణకని,బెదరని  ఆ యువకుడు “మీరు 50  కాదు,ఎంత ఇచ్చినా, పిచ్చుక గూళ్ళను తీసి ఇవ్వలేను. నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచ్చుక గూళ్ళను తొలగిస్తే,’ఆ గూళ్ళ లోపల ఉండే పిల్ల పిచ్చుకలు ఏమి కావాలి ?అలాగే  సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకు వచ్చినప్పుడు పిల్లలు కనిపించక పోతే ఎంత బాధపడుతుంది?!” అన్నాడు. 

ఇది విన్న శేషన్ దంపతులు షాక్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఆ విషయం వారు మర్చిపోలేదు.ఒక మేనేజ్‌మెంట్ సెమినార్‌లో ప్రసంగం చేయడానికొచ్చినపుడు  తన అనుభవాన్ని అక్కడి విద్యార్థులతో పంచుకున్నారు .

పై కథ అంతా చెప్పి  “నా స్థానం, నాహోదా,నా సర్వీసు, నా చదువు, నా IAS అన్నీ కూడా ఆ ఆవులను కాసే యువకుని విజ్ఞత ముందు ఎందుకు కొరగావనిపించిది. తిరిగి వచ్చిన తరువాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధభావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది.విద్య, స్థానం లేదా సాంఘిక హోదా అన్నవి మానవత్వం కొలతల ముందు దిగదుడుపే !!” అని వివరించారు.అది టిఎన్ శేషన్ చెప్పిన గొప్ప అనుభవం.

ఇక శేషన్ గురించి చెప్పుకోవాలంటే …..  ఆయన ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు అయ్యేలా చూసారు.
తమిళనాడు ప్రభుత్వంలో MG రామచంద్రన్ సీఎం గా ఉన్నపుడు (1977-80) పరిశ్రమల కార్యదర్శి, వ్యవసాయ కార్యదర్శి వంటి పదవులను నిర్వహించారు. రాజకీయ నాయకులతో విభేదాల కారణంగా సెంట్రల్ పోస్టింగ్‌ని ఎంచుకున్నారు.చంద్ర శేఖర్ ప్రధానమంత్రి అయినప్పుడు, 1990 డిసెంబర్‌లో శేషన్‌ CECగా నియమితులయ్యారు. ఆ తర్వాత తన సత్తా ఏమిటో చూపించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి, ఎన్నికల చట్టాలకు లోబడి ప్రతి ఎన్నిక జరగాలన్న తన వైఖరిలో శేషన్ ఎపుడూ రాజీ పడలేదు.డిసెంబర్ 1994లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినందుకు గాను శేషన్ అప్పటి కేంద్ర మంత్రులు సీతారాం కేసరీ, కల్పనాథ్ రాయ్‌లను తప్పుబట్టారు. ఇలాంటి సమస్య మళ్లీ రాదని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హామీ ఇచ్చారు.

1996లో ఆయన చేపట్టిన ఎన్నికల సంస్కరణలకు గుర్తింపుగా రామన్ మెగసెసె అవార్డు లభించింది. 
జూలై 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో KR నారాయణన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. రెండేళ్ల తర్వాత గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్‌కే అద్వానీపై కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. కానీ ఓడిపోయారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!