నాట్యరాణిగా ఒక దశాబ్దం ఆమెదే !

Sharing is Caring...

famous dancer l.vijayalakshmi …………………………………

విమెన్ ఆర్ మల్టీ టాలెంటెడ్ అని నిరూపించిన మహిళల్లో ప్రఖ్యాత నర్తకి ఎల్ విజయలక్ష్మి ఒకరు. వెండి తెర మీద ఆమె పలు భాషలలో…నటించి, నర్తించి…ప్రేక్షకుల హృదయాలను రంజింపజేశారు. హీరోయిన్స్ గా…డాన్సర్లు గా….ఎందరో నటీమణులు ఒక వెలుగు వెలిగారు. వీరిలో కొద్దిమందే  లైం లైట్ లో ఉన్నప్పుడే…పేరు , ప్రతిష్ట సంపాదించి పక్కకు తప్పుకుని మిగిలిన జీవితాన్ని కూడా ఆనందంగా గడిపారు.

ఎల్ విజయలక్ష్మి కూడా ఆ కోవలోని వారే . జస్ట్ పదేళ్లు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆ పదేళ్ల కాలంలో మంచి సినిమాలు చేశారు. డబ్బు,కీర్తి,పురస్కారాలు సంపాదించారు.నటిగా కంటే నర్తకిగా ఆమెకు గుర్తింపు ఎక్కువ.కేవలం నృత్య తారగానే కాదు…వాంప్ గా…సెకండ్ హీరోయిన్ గా, తమిళ్ లో హీరోయిన్ గా కూడా చేశారు. క్లబ్ డాన్స్ చేసినా…ఆ తీరే వేరు. ఎక్కడా వెగటు కలిగించని రీతిలో చేశారు. అప్పట్లో ఆమె ఎందరో అభిమానుల కలల రాణి గా వారి గుండెల్లో నిలిచిపోయారు.  

విజయలక్ష్మి ఎర్నాకుళం లో పుట్టి తిరునల్వేలి లో పెరిగారు. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా పూనా వెళ్లారు. 8 ఏళ్ళచిన్నవయసులో విజయలక్ష్మి పూనా లో నటి వైజయంతిమాల నృత్య ప్రదర్శన ను చూసారు. అద్భుతమైన ఆ డాన్స్ ఆమె మైండ్ లో అలాగే నిలిచి పోయింది. మర్నాటి నుంచి ఇంచుమించు అవే భంగిమలతో ఇంట్లో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించేది.

అది చూసి తండ్రి లక్షణన్  ముచ్చట పడ్డాడు. పూనాలో ఒక డాన్స్ మాస్టారు దగ్గర నాట్యం నేర్పించారు. ఒక్కసారి చెప్పగానే అర్ధం చేసుకుని వేగంగా నర్తించే ఆమె తీరును గమనించిన ఆ మాస్టారు మద్రాస్ లో ఎవరైనా మంచి గురువు దగ్గర చేర్పిస్తే భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని సూచించారు.

దీంతో లక్ష్మణన్ మద్రాస్ కి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఊటీకి బదిలీ చేశారు. మద్రాస్లోని మైలాపూర్ లో కుటుంబాన్నిఉంచి తాను ఒక్కడే ఊటీ లో ఉద్యోగం చేసేవారు.విజయలక్ష్మి వి. రామయ్య పిళ్ళై దగ్గర రెండేళ్లు అన్ని నృత్య రీతులను అభ్యసించారు.

ఆ తర్వాత తొలి ప్రదర్శన ఇచ్చారు. కమలా మీనన్, వి.శాంతారాం వంటి సుప్రసిద్ధులు మొదటి ప్రదర్శన ను తిలకించారు. 8వ తరగతి చదువుతున్న ఆమెకు అప్పుడే మరుమగల్ (1953)లో మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది.తెలుగులో మాత్రం సిపాయి కూతురు మొదటి సినిమా. అక్కడ నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు.

మలయాళం,తమిళం,తెలుగు,హిందీ  సినిమాల్లో నటించారు. ప్రేమ నజీర్, ఎంజీఆర్,శివాజీ గణేశన్,ఎన్టీఆర్, నాగేశ్వరరావు వంటి హీరోల చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. తెలుగులో జగదేకవీరుని కథ, నర్తనశాల, గుండమ్మ కథ వంటి హిట్ సినిమాల్లో నటించారు.1959 నుంచి 1969 వరకు ఆమె నాట్యం లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు.

1969లో ఆమె జీవితం పెళ్లితో మరో మలుపు తిరిగింది. విజయలక్ష్మి పెద్దన్నయ్య సహోద్యోగి సూరజ్ కుమార్ ఆమెను ఇష్టపడి మరీ పెళ్లాడాడు. ఫిలిప్పైన్స్ లో అగ్రికల్చరల్ సైంటిస్ట్ గా చేస్తున్న అతను పెళ్ళయాక  తనను మనిలా కు తీసుకెళ్ళిపోయాడు. నటిగా ..నర్తకిగా అలా అర్ధాంతరం గా ఆమె కెరీర్ ముగిసింది.

ఆ తర్వాతే కొత్త డాన్సర్లు వెలుగులోకి వచ్చారు. మనీలా వెళ్ళాక విజయలక్ష్మి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.దూర విద్యద్వారా బెనారస్ నుండి మెట్రిక్…మద్రాస్ యూనివర్సిటీ నుండి బీఏస్సి కోర్సులు చేశారు.అడపా దడపా డాన్స్ ప్రదర్శనలిస్తూనే ఉన్నారు.

భర్త అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ కి మారాక…అక్కడే మాస్టర్స్ ఇన్ కామర్స్ కూడా చేసి…అక్కడే  బడ్జెటింగ్ కం ఫైనాన్స్ డైరెక్టర్ గా 14 ఏళ్ళు వర్క్ చేసి…రిటైర్ అయ్యారు.  ఆవిధంగా సెకండ్ ఇన్నింగ్స్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఎల్. విజయలక్ష్మి. ఆమె కుమారుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలోనే స్థిరపడ్డారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!