ఆమె … ఒక పేరున్న యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తోంది. తెలిసో .. తేలికో బికినీ దుస్తులతో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తర్వాత ఆ విషయం మర్చిపోయింది. అదే యూనివర్సిటీకి చెందిన 18 ఏళ్ల యువకుడు.. ఇన్స్టాగ్రామ్ లో బికినీలో ఉన్న తన ప్రొఫెసర్ ఫొటోలు చూడటం అతడి తండ్రి గమనించారు.
ఆయన ఊరుకోకుండా యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ‘ప్రొఫెసర్‌కు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన రీతిలో ఉన్న ఫొటోలను నా కుమారుడు చూడటాన్ని గమనించాను. వాటిని చూసి నిర్ఘాంతపోయాను. ఒక అధ్యాపకురాలు లోదుస్తులు ధరించి సోషల్ మీడియాలో చిత్రాలను అప్ లోడ్ చేయడం అవమానకరం.
ఇలాంటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఆమె తన విద్యార్థులకు ఏం బోధిస్తున్నారు. ఇది అసభ్యకరమైన చర్య’ అంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై యూనివర్సిటీ తీవ్రంగా స్పందించింది. దాంతో ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రెస్ కోడ్ కు సంబంధించి తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ప్రైవేట్ ఖాతాయేనని వివరణ ఇచ్చుకుంది. నా ఖాతాను ఎవరో హ్యాక్ చేశారేమోనని, అందుకే ఆ ఫొటోలు లీకయ్యాయంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.అనవసరంగా తనను ఉద్యోగంలో నుంచి తొలగించారని, విద్యార్థి తండ్రి ఫిర్యాదు కాపీని ఇవ్వాలని కోరుతూ యూనివర్సిటీ కి లీగల్ నోటీస్ పంపారు.
నోటీసుపై వర్సిటీ స్పందిస్తూ.. ఇది ‘చెడు ప్రేరేపిత’ చర్యగా పేర్కొంది. యూనివర్శిటీకి కోలుకోలేని నష్టం కలిగించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, రూ. 99 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిరిగి ఆమెకే వర్సిటీ నోటీసులు పంపింది. పెద్ద పెద్ద విద్యాసంస్థలు ఉద్యోగుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం శోచనీయమని ఆ ప్రొఫెసర్ వాపోతున్నారు.
యూనివర్సిటీ కమిటీ విచారణ కూడా సరిగ్గా జరగలేదని ఆ ప్రొఫెసర్ మీడియా ముందు కొచ్చి వర్శిటీ వైఖరిపై విమర్శలు కురిపించారు.ఈ సంఘటన 10 నెలల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఏ ఫోటోలు పడితే అవి పోస్ట్ చేస్తే ఇలా కొంప మునిగే ప్రమాదం ఉంటుంది.