ఐఓసీ షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా ?

Sharing is Caring...

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  జూన్ 2021 తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది.  ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాభం రూ. 5,941 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం రూ .1,911 కోట్లు మాత్రమే. అలాగే కంపెనీ ఆదాయం 74 శాతం పెరిగి రూ.155,056 కోట్లకు చేరింది. స్థూల రిఫైనింగ్ మార్జిన్ (GRM) ఒక బ్యారెల్‌కు $ 1.98 నెగటివ్ నుండి $ 6.58 కి పెరిగింది. ఇన్వెంటరీ లాభాలను ఆఫ్‌సెట్ చేసిన తర్వాత కోర్ GRM బ్యారెల్‌కు $ 2.24 కి వస్తుంది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చమురు ధరలలో 17 శాతం పెరుగుదల కంపెనీ లాభాలను  పెంచింది. త్రైమాసికంలో పెట్రో కెమికల్స్ వ్యాపారం లో వడ్డీ, పన్ను ముందు ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ. 1738 కోట్లకు చేరింది.గత ఏడాది ఇదే త్రైమాసికంలో అది 495 కోట్లు మాత్రమే.లాక్డౌన్ ఆంక్షలను సడలించిన తరువాత కంపెనీ ఆయిల్ అమ్మకాలు పుంజుకున్నాయి. మూడవ కోవిడ్ వేవ్ వ్యాప్తి జరగక పోతే దీపావళి నాటికి డీజిల్ డిమాండ్ సాధారణ స్థితికి చేరుకుంటుందని కంపెనీ అంచనా వేస్తున్నది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి జెట్ ఇంధన డిమాండ్ కూడా పెరుగుతుందని అంచనా.

ప్రభుత్వ రంగానికి చెందిన మహారత్న కంపెనీలలో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆయిల్ రిఫైనింగ్, పైప్‌లైన్ రవాణా,మార్కెటింగ్, ముడి చమురు, గ్యాస్, పెట్రో కెమికల్స్, గ్యాస్ మార్కెటింగ్, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది.  శ్రీలంక, మారిషస్, యుఎఇ, స్వీడన్, యుఎస్ఎ,  నెదర్లాండ్స్‌లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. ప్రముఖ విదేశీ వ్యాపార భాగస్వాములతో 15 కి పైగా జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలో దూసుకుపోతోంది. పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రస్తుత 70.05 మిలియన్ టన్నుల వార్షిక రిఫైనింగ్ సామర్ధ్యాన్ని 2024/25 నాటికి 87.55 మిలియన్ టన్నులకు పెంచే యత్నాల్లో ఉంది.

ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు రూ. 105 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 52 వారాల గరిష్ట ధర 117 కాగా కనిష్ట ధర 72 మాత్రమే. ప్రస్తుత ధర వద్ద ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చని  ICICI direct ,Motilal Oswal,Sharekhan వంటి బ్రోకింగ్ సంస్థలు కూడా రికమండ్ చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో కంపెనీ షేర్లు 120 నుంచి 150 వరకు పెరగవచ్చని చెబుతున్నాయి. దీర్ఘ,మధ్యకాలిక వ్యూహంతో ఈ షేర్లలో మదుపు చేయవచ్చు. ధర తగ్గినపుడు మరిన్ని కొనుక్కుని యావరేజ్ చేసుకోవచ్చు. చిన్న ఇన్వెస్టర్లకు అనుకూలమైన షేర్ ఇది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!