Mallareddy Desireddy ……………………….. Corangi beauties
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ? ఏ దారెటుపోతుందో ఎవరిని అడగక.. వాన కురిసి కలిసేది వాగులో…. వాగు వంక కలిసేది నదిలో… కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో.. కానీ ఆ కడలి కలిసేది ఎందులో ?
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై !
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై !
ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాధ్ డైరెక్ట్ చేసిన ‘సిరిసిరి మువ్వ’ సినిమా కోసం వేటూరి మాస్టారు రాసిన పాట అది. ఆ పాట విన్నప్పుడల్లా ఎన్నో సంవత్సరాల క్రితం కోరంగిని చూసిన జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి. ఆ జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను.
కోరంగి తలంపు ఎప్పుడూ ఒక మధురమైన జ్ఞాపకం, ప్రకృతి ఒడిలో పరవశించి మైమరచిన ఒక ఆహ్లదం ఘట్టం. కొన్ని అనుభూతులు మనసుకు పెనవేసుకొనిపోయి గట్టిగా మన జ్ఞాపకాలలో నిగూఢమై వుంటాయి. ఇకపోతే ఒక విషయం నీళ్ళకి ప్రాణముంటుందని మనకు తెలుసు కదా ! గోదావరి, అదే కోరంగి సముద్రం లోపల కలిసే ముఖద్వారం చూస్తుంటే,మనసు పులకరిస్తుంది.
చరిత్ర పుటల్లో అలనాటి కోరంగి.
ఈనాటి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు సమీపంలో ఉన్న గ్రామమే కోరంగి.మారిషస్ దేశంలో తెలుగు వారిని కోరంగిలనేవారు,ఇక అలాగే నాటి బర్మాలో కూడా [మయాన్మార్లో] తెలుగువారిని కోరంగీలుగానే పిలుస్తారు.. అలా ఎందుకంటే శతాబ్దాలుగా కోస్తాంధ్రతీరం కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలే కాక విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల నుండి ప్రజలు ఉపాధి కొరకు చైనా, బర్మా, అలాగే మలేషియా తదితర తూర్పు ఆసియాలోని పలుదేశాలకు, శ్రీలంక, మారిషస్,ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్ళారు. అందుకే వారికి కోరంగీలనే పేరు వచ్చింది.
ఆంధ్ర ప్రజలు మారిషస్‌కి తదితర ప్రాంతాలకి వలస వెళ్ళడమనేది 1836 లో కోరంగి నుండే ప్రారంభమైనది. కోరంగి నుండి గాంజెస్(గంగ) అనే నౌక ఎక్కి వెళ్లినట్లు రికార్డు ఉంది. అలా ఒకేసారి ఎక్కువమంది మన తెలుగువాళ్ళు మారిషస్‌కి వెళ్ళే నౌక ఎక్కింది 1843 సం లో, కొరింగా పాకెట్ అనే ఒక నౌక కొరింగ రేవు నుండి బయల్దేరి వెళ్ళింది ఆ నౌక యజమాని పేరు పొనమండ వెంకటరెడ్డి.
కోరంగి ఒకప్పుడు అతి కీలకమైన ఓడ రేవు. అంతే కాదు ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది.క్రీస్తు పూర్వం నుండే దీని ఆనవాళ్లున్నాయి ,ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చిన తర్వాత కూడా కోరంగి నౌకాయాన పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదిగా పేరు తెచ్చుకుంది.
కోరంగి ప్రాచీన గ్రామము. నాటి కాలములో కోరింగ గ్రామము ఒక మూలాగ్రము (కేప్)పై ఉండేది. క్రమేణా కోరంగి బేలో ఇసుక మేట వేసి తీరము విస్తరించడం వలన ప్రస్తుతం కోరంగి గ్రామం తీరానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నది. కోరంగి నదికి తూర్పు తీరాన ఉన్న కోరంగి పట్టణాన్ని 1759 సం ప్రాంతములో ఇంజరం రెసిడెంటు వెస్ట్‌కాట్ నిర్మించారు.
పశ్చిమ తీరములో నదికి ఆవలివైపు ఉన్న పాత కోరంగి దీనికంటే పురాతనమైనది.నాటి కోరంగిలో మొదట డచ్చివారు తమ స్థావరం ఏర్పరచుకున్నారు.. 1759 సంలో బ్రిటీషువారు ఆనాటి కోరంగిని చేజిక్కించుకొని అక్కడికి దక్షిణాన 5 మైళ్ళ దూరములో ఇంజరం వద్ద ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు.1827లో ఫ్యాక్టరీ మూతపడింది.
1789 సం లో ఒక తుఫాను తాకిడికి వచ్చిన ఉప్పెన వలన ఆనాడు కోరంగిలో వేల మంది మరణించారు.1839 సం లో నవంబరు నెల 25 వ తేదీన వచ్చినట్టి మరో పెద్ద తుఫాను వలన బలమైన గాలులతో పాటు సుమారు 40 అడుగుల ఎత్తున వచ్చిన ఉప్పెనతో రేవు గ్రామమైన కోరంగి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. ఈ తుఫాను ఫలితం వేల మంది ప్రజలు మరణించారు.
అలాగే ఆంగ్లభాషలో తుఫానుకి సమాన పదమైన సైక్లోన్ ను కూడా బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారి హెన్రీ పిడ్డింగ్టన్ 1789 డిసెంబర్లో కోరంగిని ముంచెత్తిన పెనుతుఫానును వర్ణించడానికి సైక్లోన్ పదం వాడారని అంటారు. నాటి ఆ కోరంగి ఇప్పుడు లేదు.ఆనాటి నౌకా పరిశ్రమ కూడా లేదు. నేటి ఇసుకదిబ్బల కింద దాని చరిత్ర సమాధి అయిపోయింది.
కోరంగి రేవుకై…
ఇసుక తెన్నెలపై తేలియాడే ఓ సాగర తీరం, బోసినవ్వుల పాపాయిలా గలగలాపారేటి ఓ గోదావరి నయనం.ఆకుపచ్చని మడ వృక్షాల నడుమ తల్లి ఒడిలో సేద తీరుతున్నటువంటి ఒక పసిబిడ్డవోలే దాగినట్టి ఓ అభయారణ్యం. అరుదైన వలస పక్షులకు ప్రకృతిలో ఆవాసం. ప్రకృతిలో సహజసిద్ధమైన ఒక సోయగాల చిత్రాంగి కోరంగి.
ఈనాటి ఉరుకుల పరుగుల కాంక్రీట్ జీవితంలోని అలసట నుంచి కొంచెం ఉపశమనం పొందే ప్రదేశాలలో ఒకటిగా కోరంగిని చెప్పుకోవచ్చు.కాకినాడ పట్టణానికి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోరంగి.ఈప్రాంతమంతా మడ అడవి విస్తరించి ఉంటుంది. సముద్రపు ఉప్పెనల నుంచి కాకినాడ తీర ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తున్న అటవీ ప్రాంతం.
అంతేకాదు, అరుదైన వృక్షాలు,జంతు,పక్షు జాతులతో నిండి, ఆసియా ఖండంలోనే అతి పెద్ద జీవవైవిధ్యం కలిగిన అభయారణ్యంగా ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందింది.ఇక 1998 లో కోరంగిని ప్రభుత్వంవారు అభయారణ్యంగా ప్రకటించారు.కాకినాడకు ఒకపక్కనున్నహోప్ ఐలాండ్ అలాగే ఇంకో పక్కనున్నమడ అభయారణ్యం ఇక్కడి తీర ప్రాంతానికి రక్షణకవచంలా తుపానుల ప్రభావాన్ని కాస్త తగ్గిస్తున్నాయనే చెప్పాలి.
అభయారణ్యంలో మడ అడవుల్లో బోటు షికారు పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తుంది, ముఖ్యంగా ఈ అడవుల్లో వలస వచ్చిన పక్షుల కిలకిలారావాలతో పర్యాటకుల మనసులు పులకరిస్తాయి.. పశ్చిమ బెంగాల్‌లోనున్న సుందర్‌బాన్ మడ అడవుల తరువాత కోరంగి మడ అడవులకు అంతటి ప్రాధాన్యత ఉంది.
అరుదైన పక్షులు, జంతువులు, ఔషద గుణాలు కలిగిన అనేక విలువైన మొక్కలు, చాలా దట్టమైన పొదలు, చెట్లతో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అరుదైన వృక్ష, జంతు,పక్షి జాతులు కలిగిన ఒక వైవిధ్యమైన తీర ప్రాంతంగా దీనిని గుర్తించారు.
ప్రతి శీతాకాలంలో ఎక్కడెక్కడి నుండో వచ్చే వలస పక్షులకు కోరంగి కేంద్రంగా మారింది. కోరంగిలోన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో 10 రకాల ముఖ్యమైనట్టి నీటి పక్షులను గుర్తించారు.ప్రతి సంవత్సరం కూడా శీతాకాలంలో 78 వేల నుండి 88 వేల వరకు పక్షులు ఆశ్రయం కోసం తరలివస్తుంటాయని ఒక అంచనా .
ఈ ప్రాంతం అరుదైన పక్షులకు ఒక ఆవాసంగా మారినట్టు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కూడా గుర్తించింది. అభయారణ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో సందర్శకులు పర్యటించేందుకు వీలుగా ఒక ఉడెన్ ట్రాక్ కూడా నిర్మించారు. తుల్యభాగ నదిలో బోటులో షికారు సదుపాయం కూడా ఉంది.
కోటిపల్లి రేవుకై…
కోరంగి ప్రకృతిలో పరవశించిన మీరు తప్పక కోటిపల్లి అందాలను కూడా తిలకించాల్సిందే. అది కూడా ఒక ఆహ్లద ప్రయాణం కాకినాడ నుంచి కోటిపల్లికి రైల్‌బస్ ప్రయాణం. మనం రైల్‌బస్‌లో ప్రయాణం చేస్తుంటే మన గ్రామీణ జీవన విధానం ఒక కొత్త అనుభూతిని పరిచయం చేస్తుంది.
రైల్‌బస్ ఒక్కటంటే ఒక్కటే పెట్టె ఉంటుంది. ఈ రైల్లో సుమారుగా 75 మందికి పైగా ప్రయాణం చేయవచ్చు.ఇక కాకినాడ నుంచి కోటిపల్లి వరకు టిక్కెట్ ఖరీదు మాత్రం నేటికీ 10 రూపాయల లోపే, రైలుతో పాటు కొంత మంది సిబ్బంది రైలును నడిపే ఒక డ్రైవర్‌తో పాటు టిక్కెట్లు ఇచ్చేందుకు ఒక బుకింగ్ క్లర్క్, గేట్లు వేయడానికి, తీయడానికి మొబైల్ గేట్ మెన్,రైలుగార్డు, రైలులో మనతోనే ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణంలో ప్రకృతి అందాలను..కొత్త అనుభూతులను ఆస్వాదిస్తారు.