గ్లామర్ గర్ల్ సమంత కు ఇటీవల మంచి క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 లో తమిళ ఉగ్రవాది రాజీ పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు సంపాదించిన సమంత మరో కొత్త వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సమంత కు మొదటి ఓటీటీ సిరీస్. అందులో నటించినందుకు సమంత కు 4 కోట్ల మేరకు పారితోషకం ఇచ్చినట్టు సమాచారం.అప్పటికే సినిమాలలో 3 కోట్లకు పైగా తీసుకునేది అంటారు.
సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయన తార ప్రధమ స్థానంలో ఉంది. 2019 లో ఐరా సినిమాకు 4.5 కోట్లు తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. ఇక అనుష్క అయితే బాహుబలి సినిమాకు దాదాపుగా 4 కోట్లు తీసుకున్నట్టు చెబుతారు. మూడో ప్లేస్ లో ఉన్న సమంత కూడా ఇపుడు ఆ ఇద్దరితో పోటీ పడుతోంది. వీరిలో అనుష్క కు చేతిలో పెద్దగా సినిమాలు లేవు. నయనతార .. సమంత లే సౌత్ లో ప్రధమ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్యే పోటీ నడుస్తోంది. వెబ్ సిరీస్ కు కొంత ఎక్కువ, సినిమాలకు కొంత తక్కువగా సమంత పారితోషకం తీసుకుంటున్నది. ఈ ఇద్దరి తర్వాతే మిగిలిన హీరోయిన్స్.
ఇక మళ్ళీ అసలు పాయింట్ లోకి వస్తే …రెండో ఓటీటీ సిరీస్ లో నటించేందుకు కూడా కొత్త కంపెనీ సమంతకు భారీ పారితోషకం ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట. తమిళ్, తెలుగు , హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో ఆ సిరీస్ ను రూపొందిస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం సమంత ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం లో నటిస్తోంది. పాన్ ఇండియా సినిమా గా ఇది పట్టాలెక్కుతోంది. ఈ చిత్రానికి కూడా భారీ పారితోషకం ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా సగభాగం పూర్తి అయింది. ఇందులో మలయాళ నటుడు దేవమోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు.
ఇప్పటి వరకు తెలుగు తమిళ సినిమాలకే సమంత పరిమితమైనారు. 2010 లో “ఏం మాయ చేసావే” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత తమిళ్, తెలుగు భాషల్లో నలభై కి పైగా చిత్రాల్లో నటించింది. ఈగ, రంగ స్థలం, జాను,యూ టర్న్,ఓ బేబీ,మనం,మజిలీ వంటి చిత్రాలు కెరీర్ పరంగా ఎదగడానికి దోహద పడ్డాయి. సమంత ఇదే దూకుడు కొనసాగిస్తే సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అవడం ఖాయం. సామాజిక సేవ అంటే సమంత కు బాగా ఇష్టం. తాను సంపాదించిన సొమ్ములో కొంత భాగం సేవాకార్యక్రమాల కోసం వెచ్చిస్తోంది. ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో సమంత యే లీడింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు.