Subramanyam Dogiparthi …………………..
ఎవరికి ఎవరో ఎదురవుతారూ .. మనసూ మనసూ ముడిపెడతారూ ..ఎందుకు వస్తారో కాదనీ ఎందుకు పోతారో? ఈ మాటల పాటతో ముగుస్తుంది సినిమా . గొప్ప జీవిత సారాంశం . ఈ ఫిలసాఫికల్ ముగింపుతో ముగుస్తుంది ఈ వసంత కోకిల సినిమా . పేరుకు డబ్బింగ్ సినిమాయే కాని మామూలు సినిమాలతో పోటీపడి ఓ గొప్ప సినిమాగా నిలిచిపోయింది. చూస్తుంటే ఇప్పటికి ఫ్రెష్ గా ఫీలవుతాం.
శ్రీదేవి , కమల్ హాసన్ ల నట విశ్వరూపం అని అనవచ్చు . గ్లామర్ పాత్రలే కాదు ఇలాంటి డి గ్లామర్ పాత్రలను కూడా అద్భుతంగా నటించగలను అని రుజువు చేసుకున్నది శ్రీదేవి. కమల్ హాసన్ క్లైమాక్స్ లో రైల్వే ప్లాట్ఫారం పై ప్రదర్శించే నటన అద్భుతం. ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సీన్ అదే.
వ్యభిచార గృహంలో శ్రీదేవి కమల్ ను కొట్టే సీన్ ,కుక్కపిల్లను తీసుకొచ్చి శ్రీదేవి దానికి బొట్టు పెట్టె సీన్, కమల్ కోతి లా నటిస్తూ శ్రీదేవిని ఆడించే సన్నివేశాలు, శ్రీదేవి పై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించిన నారాయణ ను కమల్ కొట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్మిత కమల్ ను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించే మరీ అసభ్యంగా లేకుండా తీశారు.
ఈ రెండు పాత్రల తర్వాత ప్రేక్షకులు మరచిపోలేనిది సిల్క్ స్మిత పాత్ర . మెయిన్ ట్రాక్ కి పెద్దగా కనెక్షన్ లేకపోయినా సిల్క్ స్మిత రొమాంటిక్ సెక్సీ లుక్స్ , తన తీపి ఊహలో కమల్ హాసన్ తో డాన్స్ ప్రేక్షకులు మరచిపోలేరు.ఇద్దరూ అదరగొట్టేసారు ఆ డాన్సులో.
ఈ సినిమా విడుదల అయ్యాక ఓ సంవత్సరానికి వచ్చింది చిరంజీవి ఖైదీ.ఆ సినిమాలో చిరంజీవి, మాధవి స్నేక్ డాన్స్ లోని ఆహార్యం కమల్ హాసన్ , సిల్క్ స్మిత ఆహార్యానికి కాస్త దగ్గరగా అనిపిస్తుంది.డాన్స్ కూడా . ఊరించే వయసిది లాలించే మనసిది . మైలవరపు గోపి ఎంత సెక్సీగా వ్రాసాడో !
మిగిలిన పాటల్ని కూడా గోపి చాలా బాగా వ్రాసారు . ‘కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని’ పాట ఎంతో శ్రావ్యంగా ఉంటుంది . బాల సుబ్రమణ్యం చాలా బాగా పాడారు . డబ్బింగ్ పాట లాగా అనిపించదు . ‘ఈ లోకం అతి పచ్చన తోడుంటే నీ పక్కన , ఎవరూ ఆపలేరు వీచే గాలిని’ పాటలు బాగుంటాయి. ఇళయ రాజా & వేలూరి కృష్ణమూర్తిలు సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఊటీ అందాలను బాలూ మహేంద్ర కెమెరాలో బంధించి మరింత చక్కగా చూపారు.
1982 ఫిబ్రవరిలో వచ్చిన ‘మూండ్రం పిరై’ తమిళ సినిమాకు డబ్బింగ్ ఈ వసంత కోకిల. టైటిలే చాలా రొమాంటిక్ . ఆ టైటిల్ ఐడియా ఎవరికి తట్టిందో కాని , హేట్సాఫ్ . కధ , స్క్రీన్ ప్లే , ఫొటోగ్రఫీ , దర్శకత్వం బాలు మహేంద్రవే . 1983 లో సద్మా అనే టైటిలుతో హిందీలో కూడా తీసారు . అన్ని చోట్ల విజయ ఢంకా మోగించింది .
అవార్డుల వర్షం కురిసింది . జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు , ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డులు ; ఉత్తమ దర్శకుడు ఫిలిం ఫేర్ అవార్డు ; రాష్ట్ర స్థాయిలో మూడవ ఉత్తమ చిత్రం , ఉత్తమ నటుడు , ఉత్తమ నటి , ఉత్తమ నేపధ్య గాయకుడు , ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు వచ్చాయి .
సాదాసీదా కధ . అందమైన ప్రకృతికి నెలవైన ఊటీలో సెలయేరు లాగా నడుస్తుంది సినిమా. శ్రీదేవి ఎవరో తెలియకపోయినా ఆమె నిస్సహాయ స్థితికి, అమాయకత్వానికి చలించి తనతో ఇంటికి తీసుకుని వెళ్లి చిన్న పిల్లను చూసినట్టు చూసుకుంటాడు. కమల్ శ్రీదేవికి గతం గుర్తుకొచ్చేలా వైద్యం చేయిస్తాడు. తీరా శ్రీదేవికి గతం గుర్తుకొచ్చాక కమల్ ను గుర్తించదు. అదే విషాదం. కమల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు.
కమల్ ,శ్రీదేవి పాత్రలను బాలు మహేంద్ర గొప్పగా సృష్టించి , అంతకన్నా అద్భుతంగా పోర్ట్రే చేసాడు. గొప్ప సృజనాత్మకత కల దర్శకులలో ఒకడు బాలు మహేంద్ర . బాలచందర్ లాగా సినిమాలను విషాదాంతం చేస్తాడని కోపం వచ్చినా , నిజ జీవితాలు అలాగే ఉంటాయి కదా ! జీవితంలోకి ఎవరు ఎందుకు వస్తారో , ఎందుకు దుర్మార్గంగా నిష్క్రమిస్తారో తెలుసా మనకు ! లేదు కదా ! మనసున్న మనుషులకే పెడతాడు కష్టాలు దేవుడు . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . ఆస్వాదించండి . An unmissable , beautiful , tragic , romantic movie .