ఉక్రెయిన్ రష్యాయుద్ధ నౌకను నెప్ట్యూన్ క్రూయిజ్ క్షిపణితో ధ్వంసం చేసింది. ఒడెసా నగరాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు వరుసగా బాంబులు కురిపిస్తున్న యుద్ధనౌక ‘అడ్మిరల్ ఎస్సెన్’ను ద్వంసం చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు సమాచారం.
గత కొంత కాలంగా నల్లసముద్రంలో రష్యా నౌకలు మోహరించాయి. అదను చూసుకుని బాంబు దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ నౌకాదళం మాత్రం ఈ వార్తలను ధృవీకరించలేదు. కొద్దిరోజుల కిందట సరిహద్దులకు ఆవల రష్యా భూభాగంలోని భారీ ఇంధన నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసిన జెలెన్ స్కీ సేనలు.. తాజాగా ఆ దేశ యుద్ధనౌకను దెబ్బ తీయడం విశేషం.
ఒడెసా… ఉక్రెయిన్‌కు అత్యంత కీలకమైన ఓడరేవు. రష్యా తన అడ్మిరల్ ఎస్సెన్, అడ్మిరల్ మకరోవ్ యుద్ధనౌకలతో పాటు రెండు జలాంతర్గాములను కూడా ఇక్కడ మోహరించింది. ఎస్సెన్ ను ఉపయోగించి పుతిన్ సేనలు 50 క్షిపణులను ఒడెసా నగరంపైకి ప్రయోగించాయి. భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దీంతో ఉ క్రెయిన్ వ్యూహాత్మకంగా ఇక్కడున్న మాస్కో నౌకలను ద్వంసం చేయడంపై దృష్టి పెట్టాయి.
ఉక్రెయిన్ దక్షిణ తీరానికి రక్షణ అంతగా లేదు. రష్యా ఆ ప్రాంతంలో తన నౌకాదళ కార్యకలాపాలను ముమ్మరం చేయడంతో జెలెన్ స్కీ వ్యూహాత్మకంగా చావు దెబ్బ కొట్టారు. రాజధాని కీవ్ లోని ఇంజినీరింగ్ బ్యూరో ‘లంచ్’ ఆధ్వర్యాన 2014లో… యుద్ధనౌకలను ధ్వంసం చేసే క్షిపణి వ్యవస్థల తయారీని ప్రారంభించింది.
సోవియట్ రష్యా కేహెచ్ 35 క్రూయిజ్ మిసైల్‌ను పోలిన ‘ఆర్కి-360 ఎంసీ నెప్ట్యూన్ క్రూయిజ్ మిసైల్’ వ్యవస్థలను తయారుచేసింది. అవే ఇపుడు ఉక్రెయిన్ కు అండగా నిలిచాయి. ఉక్రెయిన్ ఎగుమతులు, దిగుమతుల్లో 70 శాతం నల్లసముద్రం మీదుగా నౌకల ద్వారానే రవాణా అవుతుంటాయి. ఇందులో సగం వాణిజ్యం ఒడెసా రేవు కేంద్రంగానే సాగుతోంది.
అందుకే రష్యా ఈ ప్రాంతంపై పట్టుకోసం భీకరంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే పలు రేవులపై పట్టు సాధించిన పుతిన్ సేనలు…. ఒడెసాను ఎలాగైనా చేజిక్కించుకునే యత్నాలు చేస్తున్నాయి. రష్యా పట్టు బిగిస్తే మటుకు ఉక్రెయిన్ తన సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిగా కోల్పోతుంది. వాణిజ్య పరంగా భారీ నష్ట పోతుంది. ఏమి జరుగుతుందో చూడాలి.