ఎన్టీఆర్ కి రోశయ్య చెప్పిన”కావమ్మ మొగుడి”కథ !

Sharing is Caring...

దివంగత కాంగ్రెస్ నేత కొణిజేటి రోశయ్య శాసన సభలో ఉంటే నవ్వులే నవ్వులు. ఆయన లాగా ఛలోక్తులు చెప్పేవారు. చెణుకులు విసిరే వారు.. పిట్ట కథలు చెప్పేవారు మరొకరు లేరంటే అది ఏమాత్రం అతి శయోక్తి కాదు. విమర్శలు వచ్చినపుడు రోశయ్య తనదైన శైలిలో జవాబు చెబుతూ అందులో హాస్యం జొప్పించేవారు.

అన్నట్టు పిట్టకథలు చెప్పడంలో కూడా అయన దిట్ట. ఒకసారి శాసన మండలిలో అప్పటి ముఖ్యమంత్రి  ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు “కావమ్మ మొగుడు కథ “గుర్తుకొస్తుంది అన్నారు. దానికి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు.”ఏమిటా కథ చెప్పండి” అన్నారు. ఎన్టీఆర్ అడిగిన మేరకు రోశయ్య కథ చెప్పడం మొదలెట్టారు.

“ఒక ఊరిలో రాజయ్య .. రాగమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వారికి ఒక్కతే కుమార్తె. ఎనిమిదేళ్ళు రాగానే పెళ్లి చేశారు. తరువాత అల్లుడు  మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి ఎలాగూ రెండుమూడేళ్ళు పడుతుంది కనుక, నేను దేశాటనం వెళ్లి .. తెలివితేటలు నేర్చుకుని ..  ఏదైనా వ్యాపారంలో డబ్బు సంపాదించుకుని వస్తానన్నాడు. అందుకు అత్తమామలు ఆనందపడుతూ అంగీకరించారు.

రెండేళ్ళుగడిచాయి.  మూడో ఏడు దాటింది..  అల్లుడు తిరిగిరాలేదు. అల్లుడు ఏమైనాడా అని అత్తమామలు ఆందోళన పడ్డారు. ఆ ఊరి వాళ్ళను .. పక్క ఊరి వాళ్ళను .. తెలిసిన వాళ్ళను అడుగుతున్నారు. ఇదిలా జరుగుతుండగానే ఒకరోజు ఉదయం అమ్మలక్కలు నీళ్ళ కోసం బావి దగ్గర కెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని వేప పుల్ల తో పళ్ళు తోముకుంటున్నాడు. 

ఆ కుర్రవాడిని చూసి ఒక స్త్రీ మన కావమ్మ మొగుడు లాగా ఉన్నాడు కదా అన్నది. మిగిలిన వారు కూడా అవునన్నారు. ఒకరిద్దరేమో ఉండటమేమిటి ? అతగాడే అన్నారు. మరు నిమిషంలో వార్త  కావమ్మ తల్లిదండ్రులకు చేరింది. వారు పరుగున వచ్చి కుర్రోడిని  ఇంటికి తీసుకెళ్ళారు. ముందుగా ఫలహారాలు పెట్టి స్నానం గట్రా చేయించారు.విందు భోజనం పెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచాయి.

తరువాత అసలు అల్లుడు వచ్చాడు. పెద్ద గొడవ చేసాడు. మామగారు ఖంగుతిని ముందుగా వచ్చిన కుర్రోడిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు అదే మాట అడిగింది. అందుకు సమాధానంగా ఆ కుర్రోడు “కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. మీరు కాదంటే నా కాషాయ బట్టలు ఇస్తే వెళ్ళిపోతాను. ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది “అన్నాడు.

రోశయ్య చెప్పిన ఈ కథ విని ఎన్టీఆర్ తో పాటు సభలో సభ్యులందరూ నవ్వుకున్నారు. తరువాత ఎన్టీఆర్ కథ బాగుంది కానీ నాకూ కావమ్మ మొగుడికీ పోలిక  ఏమిటి? అనడిగారు. అందుకు రోశయ్య జవాబు చెబుతూ … తమరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. డబ్బు,కీర్తి ఆర్జించారు. 60 సంవత్సరాలు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు.

అయితే నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేకపోవడం మూలానా అభివృద్ధి కుంటుపడింది. ఇది వాస్తవం. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోయింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి.ఈ ప్రభావం  ప్రజలపై పడటానికి ఇంకో ఏడాది పట్టొచ్చు. అపుడు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. దానికి “తమరు ..  నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు”… అంటూ ముక్తాయించారు రోశయ్య. ఎన్టీఆర్ కి అర్ధమైంది. రోశయ్య సుతిమెత్తగా చురక వేశారని. అప్పటినుంచి పాలనపై శ్రద్ధ పెట్టారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!