నివురులేని నిప్పుకణిక ! (2)

Sharing is Caring...

Taadi Prakash ……………………………………..

UNDISPUTED ROCK STAR OF TELANGANA………………..  జర్నలిస్టు దేవులపల్లి అమర్ నడిపే ‘ ప్రజాతంత్ర ‘ వారపత్రిక ఏడాదికోసారి ‘ సాహిత్య స్పెషల్ ‘ గా వచ్చేది. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన సాహిత్య సంచికకి లిటరరీ ఎడిటర్ కే శ్రీనివాస్, ఇప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకుడు. ఆ ఏడాది గోరటి వెంకన్న కవర్ పేజీ. వెంకన్న ఇంటర్వ్యూ ని ‘పగిడికంటి పాటగాడు’ అనే గొప్ప శీర్షికతో రాశారు. “నోరులేని పాలమూరు పల్లెను గొంతులో జీరగా నిలుపుకుని సమూహ దుఃఖాన్ని అతను పలుగు రాళ్లు నమిలినట్టు పదాలలోకి అనువదిస్తున్నాడు…. తెలంగాణ కావలసి వచ్చిన కాలానికి ఎదిగివచ్చిన పుత్రుడు వెంకన్న” అని రాశారు శ్రీనివాస్. ఇంటర్వ్యూ నెపంతో ఒక అరుదైన, అనితరసాధ్యమైన విశ్లేషణ చేసి వెంకన్న రాజకీయ, కళాసౌందర్య – ఆధ్యాత్మిక తత్వాన్ని తొలిసారి మనకి తెలియజెప్పినవాడు కే. శ్రీనివాస్.

వెంకన్న కొత్తగా ఎమ్మెల్సీ అయ్యాడుగా…అందుకే మాట్లాడుకోడం. హంస అవార్డు, కాళోజీ అవార్డు, సినారె, లోక్ నాయక్, అరుణ్ సాగర్ అవార్డులు వచ్చినపుడు, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు ‘ కబీర్ సమ్మాన్ ‘ వరించినపుడూ మనం వెంకన్నని తలుచుకున్నాం. మనవాడే మహగట్టి వాడు – అనిజబ్బలు చరుచుకున్నాం. కానీ, ఒక రాష్ట్రానికి శాసనమండలి సభ్యుడు అవడం ప్రత్యేకమైన గౌరవం.మనందరి కంటే ఎక్కువ సాహిత్యం చదువుకున్నవాడు, గొప్ప వాగ్ధాటి కలవాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన వెంకన్నకి పిలిచి ఇచ్చిన గౌరవం నాకెంతో నచ్చింది. చట్టసభల్లో వీధిరౌడీలు, గుండాల్ని చూడడానికి అలవాటుపడిపోయాం కదా!

ఒక మంచి కవిని, నిజమైన ప్రజాప్రతినిధిని ముఖ్యమంత్రి సత్కరించినపుడు మనమెందుకు నొసలు చిట్లించడం! అదేంటో.. ప్రతిదాన్నీ తప్పుబట్టటం. విమర్శించడం, నిందించడం, చటుక్కున జడ్జీల పాత్ర పోషించి ఆనందించడం మనకి అలవాటైపోయింది. బాగా నెగెటివ్ గా మారిపోతున్నాం. లేదా, కరోనా పాజిటివ్ గా మిగిలిపోతున్నాం. కసి, ద్వేషం, పగ ఇచ్చినంత కిక్కు … అపేక్ష, ప్రేమ ఇవ్వలేవేమో కదా!
***
వాగు ఎండిపాయెరో… పెదవాగు తడిపేగు ఎండిపాయెరా… పాట గుర్తుందా మీకు? నిరుపేద పల్లెటూరి పిల్లల ఆటలు, ఆనందాల మీద వెంకన్న పాట విన్నారా? అందులో కవిత్వం పలికిన తీరూ, ఒక విజువల్ వండర్ గా ప్రజెంట్ చేయడంలోని కామన్ సెన్సూ మనల్ని అబ్బురపరుస్తాయి. పాటా పాడేటీ పిల్లలు వూటా సెలిమల్లో … ఆటాలాడేటీ పిల్లలు మోటా గిరుకల్లో..  వాగూలోనీ సేపలోలె ఈదుతున్నారో…..వొడ్డున రెల్లుగడ్డీ లాగా వూగూతున్నారో…  ఏలే ఎన్నెల్లో పిల్లలు ఏలే ఎన్నెల్లో…

తెలంగాణ అంటే హైదరాబాద్ కానట్టే, భారతదేశం అంటే వో పదిపన్నెండు పెద్ద నగరాలు కావు, వందల వేల పచ్చని పల్లెలు అసలు సిసలైనవి. అక్కడి పిల్లల కోసం, ముందుతరాల కోసం గోరటి వెంకన్న రాసిన… ఆ పాట, పాడిన ఆ పాట మనకి బాలల జాతీయగీతం కాదగ్గది. దాన్నో మాంచి యానిమేషన్ ఫిల్మ్ చేస్తానన్నాడు మోహన్. గౌతమ్ ఘోష్, శ్యాం బెనెగల్ లాంటి చేవ వున్న దర్శకులు ఆ పాటనీ, అందులోని నిసర్గ సౌందర్యాన్నీ చిత్రీకరించి మనకివ్వాలని అనిపిస్తోంది. వెంకన్నకి పదవులు కట్టబెట్టడం కాదు. పది పన్నెండు పాటలు ఎంపిక చేసి ‘జయం మనదేరా’ శంకర్ లాంటి మంచి దర్శకుడి చేతికిచ్చి ” THE BEST OF GORATI VENKANNA ” అని ఒక విజువల్ ట్రీట్ గా వాటిని పదిలపరచాలి.

కొంగమ్మా… పాట
వెండి తీగలతో రెండు రెక్కలు ఏ దేవుడల్లే…….మాసిపోని తనువున్న కొంగమ్మా..   నరుడు తప్ప పుడమిలోన కొంగమ్మా…..  ఏ జీవి కపట మెరుగదమ్మ కొంగమ్మా….  రాత్రి పాట ..తోపులకొచ్చిన జంటకు సీకటి దాపును జూపిందో…  తాను కాపల కాసిందో… కోరిక తీరని మనుషులేమో కొరివీదెయ్యాలై……..  పొలిమేరంచు కొచ్చీరో …. ఇంకా వాన, నల్లతుమ్మ, సంచారం, గల్లీసిన్నదీ, పిట్టబతుకు… పవిత్రమైన కవిత్వం ప్రవహించే ఇలాంటి గోరటి వెంకన్న పాటలు ఎన్నయినా కోట్ చేయవచ్చు.
***
వేల పాటలు పాడి ఈ దేశాన్ని ఊగించిన, వెర్రెత్తించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గోరటి వెంకన్న ‘ సంతా మావూరి సంతా వారానికోసారి …’ ‘ అద్దాల అంగడీమాయ… ‘ పాటలు విని పరవశించిపోవడం మనమందరం టీవీల్లో చూశాం. బాలు చనిపోయినపుడు కొందరు అతనికి శాస్త్రీయ సంగీతం రాదనీ, మంచి మిమిక్రీ ఆర్టిస్టనీ వెటకారాలు పోయినపుడు, గొప్ప వాటర్ కలర్ ఆర్టిస్ట్ మోషే డయాన్ వారితో వాదనకి దిగారు.
‘ అదేంటి, బాలూని మీరెలా తప్పుబడతారు? శాస్త్రీయ సంగీతం నాకు బాగా తెలుసని బాలూ ఎప్పుడూ చెప్పలేదే. అయినా బాలూని అనడానికి మనమెవరం? నాతో సహా are we not part of the hypocrasy? ‘ అని నిలదీశాడు మోషే! వెంకన్న విమర్శకులకి ఈ మాట వర్తిస్తుంది.
***
గోరటి వెంకన్నకి ఒక వ్యక్తిగత లేఖ :  వెంకన్నా…నీకూ తెలుసు, నాకూ తెలుసు .. మనకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కి ఇంకా బాగా తెలుసు. It’s all in the game .. పిలిచి పదవి ఇచ్చాడు. ఎమ్మెల్సీ ని చేశాడు. నాకు నచ్చింది నిజంగా! విద్య విలువ తెలిసిన, పద్య కావ్యాలు, సౌందర్య శాస్త్రం చదువుకున్న చంద్రశేఖరరావు కి మనస్సులోనే నమస్కారం పెట్టుకున్నాను. అయినా – లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ అందలం తాత్కాలికం. అది నీచేతికో బంగారు సంకెల … నీ పేరు ప్రతిష్ట ఇప్పుడు అక్కరకు వచ్చింది. అది పూర్తిగా ప్రభుత్వ అవసరం. నీకీ ప్రభుత్వంతో ఎలాంటి అవసరమూ లేదు.

ప్రభుత్వానికైతే నీతో చాలా పని వుంది. నువ్వు పేదోడివి. కూలోడివి. మాలోడివి మాత్రమే కాదు… తూరుపు ఆకాశం నుంచి వేకువని తెచ్చి మాకిచ్చిన కవివి. గంధర్వుడివి. గాయకుడివి. గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ వచనం కవిత్వమై మా మధ్యనే తిరుగుతున్న మేజికల్ రియనిజానివి! నువ్వే ప్రభువ్వి. నీకెవరి గొడుగునీడా అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రభువులు ఒకందుకు పోస్తారు. పాలమూరు పేద కవులు మరొకందుకు తాగుతారు.

రాజకీయాల్దేముంది! మనం పుట్టకముందు నించీ వున్నాయవి! ప్రభుత్వానికి లొంగిపోయావనో, కేసీఆర్ కి భజన చేస్తున్నావనో, వెలమదొరల గడీ కి కాపలా పనికి వొప్పుకున్నాడనో నిన్ను మాటలంటారు.  ఇప్పటికే అన్నారు. ఆ మాటలూ విను. పట్టించుకోకు. నవ్వేసి ఊరుకో. సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఇక్కడ నువ్వెవరికీ రుణపడి లేవు. నీ రుణం తీర్చుకునే శక్తి మాకెవ్వరికీ లేదు. నిర్లక్ష్యంగా, నిష్పూచిగా, బాధ్యతతోనో, రహితంగానో ఎప్పటిలాగే నీ ఇష్టం వచ్చినట్టే వుండు.

గుంటూరు శేషేంద్రశర్మ చెప్పినట్టు ..పంచె పైకెత్తి పట్టుకుని ఈ నగరాన్నతొక్కుకుంటూ వెళ్ళిపో. అప్పుడు కూడా, గోరటి వెంకన్నా.. పది తరాలు పాడుకునే మరో పాట ఒకటి రాయి. కవీ, కాళిదాసు సాక్షిగా మరొక్కసారి నీ గొంతెత్తి విశ్వమానవ గీతం ఆలపించు. అదిగో… అటుచూడు. కోటి చేతులు నిన్నే కోరి రమ్మంటున్నాయి!

నలుగురు బిడ్డల తండ్రివి. నీ బాధ్యతలూ, అవసరాలూ తెలుసు… నీ గారాల బిడ్డల పట్ల నీ అనురాగం… కళ్లారా చూసినవాణ్ణి.  సుఖంగా వుండు. పాలమూరు రాళ్లలో, అడవుల్లో అనామకంగా తిరిగే సంచార జీవివి. వూర్కెనే హైదరాబాద్ లో వున్నట్టు నటిస్తుంటావు. నీ మనసెపుడూ ఆ పల్లెల్లోనే. చిరిగిపోయిన మురికి బట్టల మనుషుల్తోనే …ఆంధ్రా, తెలంగాణ పేద పల్లెలన్నీ నీ పాటే పాడుకుంటున్నాయి. మా వెంకన్న అంటూ హృదయానికి హత్తుకుంటున్నాయి. నీ పేరు తలుచుకుని గుడిసెలో దీపం వెలిగించి, నిన్ను గుండెల్లో పెట్టుకుంటున్నాయి.

నడిచి వస్తున్న వెంకన్న ఒక్కోసారి ముద్దొచ్చే ఎద్దు మూపురంలా అనిపిస్తాడా!  పాట ఎత్తుకున్నాడా… ఆలయ గోపురంలా కనిపిస్తాడు. వెంకన్నది కవ్వించి, నవ్వించి, కన్నీళ్లు పెట్టించే సెన్సాఫ్ హ్యూమర్. అది చాప్లిన్ టెక్నిక్.  “రావొచ్చు పోవొచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు.. రవీంద్రభారతికొచ్చి రాయబారమాడొచ్చు” అని ఆంధ్రావాళ్లని వెక్కిరించినా – బతుకు ఆగం అయిపోయిన, తన పేరు కూడా తెలీని వెర్రిపిట్ట దగ్గరికెళ్లి “ఏదీ లేని పిట్ట చెంతకు జేరి జాతకం అడుగుతున్నడు” .. అని అజ్ఞానాన్నిహేళన చేసినా – అది గొప్ప spontaneity.  “మీరు వుసుకొ వుసుకొ వుసుకంటే.. వురికె వేటకుక్కలం … సమరసింహారెడ్డి నువ్వు సల్లంగుండాలి బాబు హాయిగుండాలి… మీరు బాంబులిస్తె నెత్తిమీద ఏసుకునే తొత్తులం…  ఎస్పీలు కలెక్టర్లయి మీ పిల్లల ఫోటోలు… పేపర్లలో పడాలి, పోలీసుస్టేషన్ లల్ల మా ఫోటోవులుండాలి – అని సీమ ఫ్యాక్షన్ రెడ్ల అరాచకాన్ని Hilarious గా నరికి పోగులు పెడతాడు.

వెంకన్నా…నువ్వు Emotiona …నువ్వు Irrational ..Irresistable and you are just unstoppable. అలాగే వుండు.నీకేం వెంకన్నా. కవివి మాత్రమే కావుకదా.  నిండు కల్లుకుండ లాంటి మనిషివి!  నివురులేని నిప్పుకణికవి!  అంతెత్తున ఎగిరే ప్రజల ఆకాంక్షవి! మేల్కొలిపే రాగానివి, దారిచూపే దీపానివి! జబ్బుపడిన సమాజానికి ఆకులూ, పువ్వులూ, అలల గలగలలూ కానుకలుగా ఇచ్చే నువ్వు.. సాక్షాత్తూ ‘సంచార’ ప్రకృతి చికిత్సాలయానివి! గోరటి వెంకన్న అంటే ఒక పాబ్లో నెరూడా, ఒక బాబ్ డిలాన్ అని కవికుల గురువు శివారెడ్డి వూర్కెనే అన్నాడా!

తెలుగు రచయితలు,కవులు,విమర్శకుల మధ్య కుతూహలం రేపే చర్చ జరిగింది. ఒక్కటే  ప్రశ్న! శ్రీశ్రీ తర్వాత ఎవరు? ఆరుద్రా? తిలక్కా? దాశరథా? కేజీ సత్యమూర్తా? (శివసాగర్) ..శ్రీశ్రీ తర్వాత అంతా శూన్యం అన్న అజంతానా? ‘ సీ నారాయణరెడ్డా? ‘సరస్వతీ సమ్మాన్’ కే శివారెడ్డా? పోనీ, శ్రీరంగం నారాయణబాబా? వెలుతురెక్కడ సోనియా అన్న బైరాగా? ..అంతూపొంతూ లేని చర్చ జరిగింది.
తెలంగాణ జానపద సాంస్కృతిక సంప్రదాయం అద్భుతమైనది. ఇక్కడ కవిత్వం రాసినవాడే  పాడాలి, ఆడాలి, జనాన్ని గెలవాలి.
తెలంగాణ ప్రశ్న : గద్దర్ తర్వాత ఎవరు? ఒక్కపేరే! ఇక్కడ పోటీ లేనేలేదు. ONE AND ONLY గోరటి వెంకన్న. UNDISPUTED ROCK STAR OF TELANGANA
Tail Twist :
తెలంగాణ సందర్శనకు వచ్చే ప్రపంచ పర్యాటకులకు ఒక సూచన : దర్శనీయ స్థలాలు :వేయి స్తంభాల గుడి – వరంగల్….రామప్ప దేవాలయం – వరంగల్….. చార్మినార్ – హైదరాబాద్..  గోరటి వెంకన్న, గౌరారం, మహబూబ్ నగర్.
హెచ్చరిక :
తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాక వెంకన్నని చూడకుండా, అతని పాట వినకుండా వెళ్ళిపోయారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకెవరూ వుండరు.

Read Also  …………………………………..  నివురులేని నిప్పుకణిక ! (1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!